PC: BCCI/X
శ్రీలంక, అఫ్గనిస్తాన్‌లతో ముక్కోణపు వన్డే సిరీస్‌లో భారత్- ‘ఎ’ ఇప్పటికి రెండు మ్యాచ్‌లు పూర్తి చేసుకుంది. తొలుత ఆతిథ్య లంక జట్టుతో తలపడ్డ తిలక్ వర్మ సేన.. ఎనిమిది పరుగుల స్వల్ప తేడాతో గట్టెక్కింది.
అఫ్గన్ చేతిలో ఓటమి
అనంతరం అఫ్గన్-‘ఎ’ జట్టుతో మ్యాచ్‌లో 349 పరుగుల మేర భారీ స్కోరు సాధించినప్పటికీ.. భారత జట్టుకు పరాభవం తప్పలేదు. వర్షం పదేపదే అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్‌లో అఫ్గన్ జట్టు డక్‌వర్త్ లూయీస్ పద్ధతి ప్రకారం.. నాలుగు పరుగుల స్వల్ప తేడాతో విజయం సాధించింది.
ఫలితంగా పాయింట్ల పట్టికలో అఫ్గనిస్తాన్ అగ్రస్థానానికి దూసుకుపోగా.. భారత్, శ్రీలంక రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. అయితే, తర్వాతి మ్యాచ్‌లో అఫ్గనిస్తాన్‌పై గెలిచి లంక టాప్‌కు దూసుకెళ్లగా.. భారత్ రెండు, అఫ్గన్ మూడో స్థానంలో కొనసాగుతున్నాయి.
మరోసారి శ్రీలంకతో
ఈ ట్రై సిరీస్‌లో భాగంగా భారత్ సోమవారం నాటి మ్యాచ్‌లో మరోసారి శ్రీలంకతో తలపడుతోంది. దంబుల్లా వేదికగా టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. బ్యాటింగ్‌కు దిగిన భారత్ 49.2 ఓవర్లలో 265 పరుగులు చేసి ఆలౌట్ అయింది.
ఓపెనర్లు ప్రభ్‌సిమ్రన్ సింగ్ (11), వైభవ్ సూర్యవంశీ (21) విఫలం కాగా.. రుతురాజ్ గైక్వాడ్ 37, కెప్టెన్ తిలక్ వర్మ 23 పరుగులు చేశారు. మిగతా వారిలో ఆల్‌రౌండర్లు సూర్యాంశ్ షెడ్గే (72), విప్రాజ్ నిగమ్ (51) అర్ధ శతకాలతో రాణించడంతో భారత్‌కు గౌరవప్రదమైన స్కోరు దక్కింది.
రెండుసార్లు అదే తప్పు
అయితే, విప్రాజ్ చేసిన పొరపాటు వల్ల భారత్ భారీ మూల్యమే చెల్లించాల్సి వచ్చింది. భారత్-‘ఎ’ ఇన్నింగ్స్‌లో 35వ, 37వ ఓవర్లలో విప్రాజ్.. సింగిల్ తీసే క్రమంలో పిచ్ మధ్యలో పరిగెత్తాడు. ఎంసీసీ నిబంధన 41.14 ప్రకారం.. ఉద్వేశపూర్వకంగా గానీ, అనుకోకుండా గానీ పిచ్ మధ్యలో (ప్రొటెక్టెడ్ ఏరియా)కి వచ్చి డ్యామేజ్‌కు కారణమయ్యే పరిస్థితి తలెత్తితే తొలుత అంపైర్ సదరు స్ట్రైకర్‌ను హెచ్చరిస్తాడు.
ఇదే తప్పు పునరావృతం చేస్తే బ్యాటింగ్ చేసే జట్టు స్కోరులో ఐదు పరుగుల మేర కోత విధిస్తారు. అయితే, ఇక్కడ తొలుత అనుకుల్ రాయ్ కూడా ఇలాంటి తప్పిదానికే పాల్పడగా.. అంపైర్ వార్నింగ్‌తో వదిలేశాడు. అయితే, విప్రాజ్ ఒకటి కాకుండా.. ఏకంగా రెండుసార్లు పిచ్ మధ్యలోకి రావడంతో మొత్తంగా భారత్‌కు పది పరుగుల మేర నష్టం కలిగింది.
పది పరుగుల నష్టం
ఫలితంగా శ్రీలంక తమ ఇన్నింగ్స్‌ను 10/0తో మొదలుపెట్టింది. అంటే విప్రాజ్ తప్పిదం వల్ల ప్రత్యర్థికి అదనంగా పది పరుగుల మేర లాభం చేకూరింది. ఫైనల్ రేసులో ఉండాలంటే భారత్ తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఈ ఆల్‌రౌండర్ చేసిన తప్పిదం దేనికి దారితీస్తుందో చూడాలి మరి!!


