హోల్డర్ సిక్సర్ల వర్షం.. సిరీస్ కైవసం చేసుకున్న విండీస్‌ | West Indies Beat Sri Lanka-5 Wickets-3rd T20-Clinch Series After-2024 Home Ground | Sakshi
Sakshi News home page

హోల్డర్ సిక్సర్ల వర్షం.. సిరీస్ కైవసం చేసుకున్న విండీస్‌

Jun 15 2026 11:39 AM | Updated on Jun 15 2026 12:24 PM

West Indies Beat Sri Lanka-5 Wickets-3rd T20-Clinch Series After-2024 Home Ground

జాసన్‌ హోల్డర్‌, ఇన్‌సెట్‌లో షమర్‌ జోసెఫ్‌

స్వదేశంలో శ్రీలంకతో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను వెస్టిండీస్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. భారత కాలమాన ప్రకారం సోమవారం తెల్లవారుజామున జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో వెస్టిండీస్ 5 వికెట్ల తేడాతో శ్రీలంకపై విజయాన్ని అందుకుంది. విండీస్ బౌలర్‌ షమర్ జోసెఫ్ ఐదు వికెట్లతో లంక పతనాన్ని శాసించగా, బ్యాటింగ్‌లో రూథర్‌ఫోర్డ్, హోల్డర్ మెరుపులు మెరిపించారు.  

తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 20 ఓవర్లలో 169 పరుగులకు ఆలౌటైంది. దునిత్ వెల్లలాగె (43 పరుగులు) టాప్ స్కోరర్‌గా నిలవగా, కమిల్ మిశారా (28), నిస్సాంక (26) పర్వాలేదనిపించారు. విండీస్ బౌలర్లలో షమర్ జోసెఫ్ 5 వికెట్లు తీయగా, అకిల్ హొసెన్‌, మాథ్యూ ఫోర్డె, జాసన్ హోల్డర్‌, రోస్టన్ చేజ్ తలా ఒక వికెట్ తీశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన విండీస్ జట్టు 19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 170 పరుగులు చేసి విజయం సాధించింది. 

53 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన విండీస్‌ను రోవ్‌మెన్ పావెల్ (33), రూథర్‌ఫోర్డ్ (54 నాటౌట్‌) చక్కదిద్దడమే గాక జట్టును విజయంవైపు నడిపించారు. ఈ ఇద్దరు కలిసి ఐదో వికెట్‌కు 81 పరుగులు జోడించారు. విజయానికి చేరువవుతున్న క్రమంలో పావెల్ ఔటైనప్పటికీ, క్రీజులోకి వచ్చిన జాసన్ హోల్డర్ (5 బంతుల్లో 21 నాటౌట్‌) మూడు భారీ సిక్సర్లు బాది వెస్టిండీస్‌ను గెలిపించాడు. 

లంక బౌలర్లలో హసరంగ రెండు వికెట్లు తీయగా, వెల్లలాగె, దుష్మంత చమీర, తీక్షణ తలా ఒక వికెట్ తీశారు. షమర్ జోసెఫ్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌’తో పాటు ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ కూడా గెలుచుకున్నాడు. 2024 తర్వాత వెస్టిండీస్‌ తమ సొంతగడ్డపై టీ20 సిరీస్‌ నెగ్గడం విశేషం. ఇరుజట్ల మధ్య జూన్ 25 నుంచి అంటిగ్వా వేదికగా తొలి టెస్టు జరగనుంది.

మ్యాచ్‌లో నమోదైన పలు రికార్డులు..
👉ఈ మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీయ‌డం ద్వారా ష‌మ‌ర్ జోసెఫ్ స‌రికొత్త రికార్డు నెలకొల్పాడు. స‌బీనా పార్క్ వేదిక‌గా జ‌రిగిన టీ20 మ్యాచ్‌ల్లో ఐదు వికెట్లు తీసిన తొలి బౌల‌ర్‌గా ష‌మ‌ర్ జోసెఫ్ నిలిచాడు. గ‌తంలో ఈ మైదానంలో ఐర్లాండ్‌కు బౌల‌ర్ అలెక్స్ కుసాక్ (4/11) అత్యుత్త‌మంగా ఉండేది. తాజాగా  ఆ రికార్డును జోసెఫ్ బ‌ద్ద‌లు కొట్టాడు.

👉టీ20 క్రికెట్‌లో వెస్టిండీస్ త‌ర‌ఫున ఐదు వికెట్లు తీసిన తొమ్మిదో బౌల‌ర్‌గా ష‌మ‌ర్ జోసెఫ్ నిలిచాడు. ఇక శ్రీలంక‌తో మ్యాచ్‌లో ఐదు వికెట్ల హాల్ అందుకున్న రెండో బౌల‌ర్‌గా జోసెఫ్ నిలిచాడు. గ‌తంలో ఓషెన్ థామ‌న్ ఈ ఫీట్ సాధించాడు.

👉శ్రీలంక‌తో మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీయడం ద్వారా ష‌మ‌ర్  జోసెఫ్ టీ20 క్రికెట్‌లో 50 వికెట్ల మార్క్ పూర్తి  చేసుకున్నాడు.

చదవండి: శ్రీలంక-ఏతో మ్యాచ్‌.. వైభ‌వ్‌ సూర్యవంశీ ప్లాఫ్‌ షో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement