
భారత క్రికెట్ జట్లు ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్నాయి. శుబ్‌మన్ గిల్ సారథ్యంలోని పురుషుల జట్టు టెస్టు సిరీస్ ఆడుతుంటే.. హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీలోని మహిళల టీమ్ పరిమిత ఓవర్ల సిరీస్‌లో ఆతిథ్య జట్టుతో తలపడుతోంది.
మరోవైపు.. ఆయుశ్ మాత్రే, వైభవ్ సూర్యవంశీ వంటి నయా ఐపీఎల్ సంచనాలతో కూడిన భారత అండర్-19 జట్టు కూడా ప్రస్తుతం ఇంగ్లండ్‌లోనే ఉంది. ఇంగ్లండ్ యువ జట్టుతో ఐదు యూత్ వన్డేలు పూర్తి చేసుకున్న ఈ టీమ్ 3-2తో సిరీస్‌ను కైవసం చేసుకుంది.
ధనాధన్.. ఫటాఫట్
ఈ సిరీస్‌లో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడిన వైభవ్ సూర్యవంశీ మరోసారి హాట్‌టాపిక్ అయిపోయాడు. అతడి ఆటను చూసేందుకు వందల కిలోమీటర్లు ప్రయాణించి అభిమానులు స్టేడియాలకు వస్తున్నారంటే అతడి క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. అందుకు తగ్గట్లుగానే ధనాధన్ దంచికొడుతూ క్రికెట్ ప్రేమికులకు కనువిందు చేస్తున్నాడు వైభవ్.
ముఖ్యంగా ఇంగ్లండ్ అండర్-19 జట్టుతో నాలుగో వన్డేలో వైభవ్ సూర్యవంశీ 52 బంతుల్లోనే శతక్కొట్టడం ఇంగ్లండ్ టూర్ మొత్తంలో హైలైట్‌గా నిలిచింది. ఇక భారత్- ఇంగ్లండ్ మధ్య తొలి యూత్ టెస్టులోనూ పద్నాలుగేళ్ల ఈ చిచ్చరపిడుగు రాణించాడు. తొలి ఇన్నింగ్స్ (14)లో విఫలమైనా.. రెండో ఇన్నింగ్స్‌లో అర్ధ శతకం (56) సాధించాడు. అంతేకాదు.. ఈ పార్ట్‌టైమ్ స్పిన్నర్ రెండు వికెట్లు కూడా పడగొట్టాడు.
ఇప్పటికే కోటీశ్వరుడిగా
ఇదిలా ఉంటే.. వైభవ్ సూర్యవంశీ ఇప్పటికే కోటీశ్వరుడైన సంగతి తెలిసిందే. ఐపీఎల్-2025 మెగా వేలం సందర్భంగా ఈ బిహార్ కుర్రాడిని రాజస్తాన్ రాయల్స్ ఏకంగా 1.1 కోట్లకు కొనుగోలు చేసింది. అందుకు తగ్గట్లుగానే ఫాస్టెస్ట్ సెంచరీతో పైసా వసూల్ ప్రదర్శన ఇచ్చాడు వైభవ్.
ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా వైభవ్ ఎంత సంపాదిస్తున్నాడన్న అంశంపై నెటిజన్లు ఆరా తీస్తున్నారు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) నిబంధనల ప్రకారం.. స్లాబుల ప్రకారం అండర్-19 ప్లేయర్లకు రోజుకు రూ. 20 వేల చొప్పున ఫీజు అందుతుంది. అయితే, తుదిజట్టులో ఉన్న ఆటగాళ్లకే ఈ మొత్తం దక్కుతుంది. రిజర్వు ప్లేయర్లకు ఇందులో సగం అంటే రూ. 10 వేలు మాత్రమే ఇస్తారు.
ఇప్పటికి రూ. 1.80 లక్షలు
ఈ లెక్కన వైభవ్ ఐదు యూత్ వన్డేల్లోనూ ఆడాడు కాబట్టి.. ఒక్కో మ్యాచ్‌కు రూ. 20 వేల చొప్పున ఐదింటికి రూ. లక్ష లభిస్తుంది. అదే విధంగా.. నాలుగు రోజుల యూత్ టెస్టుగానూ రోజుకు రూ. 20 వేల చొప్పున ఎనభై వేలు అతడికి ఫీజు రూపంలో దక్కుతాయి. వైభవ్‌తో పాటు తుదిజట్టులో ఆడిన ప్రతి ఒక్క ప్లేయర్‌కు ఈ మేర ఫీజు లభిస్తుంది.
సీనియర్ జట్ల ప్రదర్శన ఇలా
ఇదిలా ఉంటే.. శుబ్‌మన్ గిల్ సేన ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల్లో మూడు పూర్తి చేసుకుంది. లీడ్స్‌లో ఓడిన టీమిండియా.. ఎడ్జ్‌బాస్టన్‌లో తొలిసారి గెలుపు జెండా ఎగురవేసిది. అయితే, లార్డ్స్‌లో ఓటమిపాలు కావడంతో ఇంగ్లండ్ 2-1తో ముందంజ వేసింది.
మరోవైపు.. మహిళల జట్టు ఇంగ్లండ్ గడ్డపై తొలిసారి టీ20 సిరీస్ గెలిచింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-2తో కైవసం చేసుకుంది. ఇక మూడు వన్డేల సిరీస్‌లోనూ తొలి మ్యాచ్ గెలిచి.. శుభారంభం అందుకుంది.
చదవండి: సిరాజ్ సింహం లాంటోడు.. కానీ ఒక్కోసారి మేమే వారిస్తాం: టీమిండియా కోచ్