నువ్వా-నేనా!.. నరాలు తెగే ఉత్కంఠ.. ఆఖరికి.. | FIFA WC 2026: Turkiye Stuns USA Seal Last Gasp 3-2 Win | Sakshi
Sakshi News home page

నువ్వా-నేనా!.. నరాలు తెగే ఉత్కంఠ.. ఆఖరికి..

Jun 26 2026 10:16 AM | Updated on Jun 26 2026 10:31 AM

FIFA WC 2026: Turkiye Stuns USA Seal Last Gasp 3-2 Win

ఫిఫా ప్రపంచకప్‌-2026లో అమెరికా- తుర్కియే మధ్య మ్యాచ్‌ ఉత్కంఠగా సాగింది. లాస్‌ ఏంజెలెస్‌ వేదికగా తుర్కియే అనూహ్య రీతిలో పటిష్ట అమెరికా జట్టుపై విజయం సాధించింది. గ్రూప్‌- ‘డి’లో భాగంగా శుక్రవారం నాటి మ్యాచ్‌లో ఆతిథ్య జట్టును 3-2తో చిత్తు చేసి తమ తొలి విజయం నమోదు చేసింది.

కాగా గ్రూప్‌- ‘డి’ నుంచి ఇప్పటికే అమెరికా వరుసగా రెండు విజయాలతో నాకౌట్‌ దశకు అర్హత సాధించింది. ఈ క్రమంలో తుర్కియే మీదా గెలిచి హ్యాట్రిక్‌ విజయంతో అజేయంగా నిలవాలని భావించింది. ఇక అప్పటికి రెండు మ్యాచ్‌లలో రెండూ ఓడిన తుర్కియే సులువుగా తలొగ్గుతుందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

కానీ తుర్కియే అంచనాలన్నీ తలకిందులు చేసింది. నిజానికి మూడో నిమిషంలోనే ఆస్టన్‌ ట్రస్టీ గోల్‌ కొట్టి అమెరికాకు శుభారంభం అందించాడు. అయితే, తుర్కియే ఆటగాడు బారిస్‌ యిల్మాజ్‌ ఇచ్చిన పాస్‌తో ఆర్డా గూలర్‌ గోల్‌ కొట్టి 1-1తో స్కోరు సమం చేశాడు.

నువ్వా- నేనా
ఆ తర్వాత మ్యాచ్‌ రెండో అర్ధ భాగంలో ఒర్కూన్‌ కొకూ గోల్‌ కొట్టడంతో తుర్కియే 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే, సెబాస్టియన్‌ బెర్‌హాల్టర్‌ గోల్‌ కొట్టడంతో.. అమెరికా 2-2తో స్కోరు సమం చేసింది. 

అయితే, అప్పటికి ఫలితం తేలకపోగా.. అదనపు సమయం కేటాయించారు. ఈ క్రమంలో నరాలు తెగే ఉత్కంఠ నెలకొనగా.. కాన్‌ అహ్యాన్‌ అనూహ్య రీతిలో గోల్‌ కొట్టి తుర్కియేను విజేతగా నిలిపాడు.

ఆసీస్‌, పరాగ్వే సైతం
ఇక గ్రూప్‌-డి మరో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా పరాగ్వేతో మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. దీంతో టేబుల్‌ టాపర్‌ అమెరికాతో పాటు.. రెండు, మూడు స్థానాల్లో నిలిచిన ఆస్ట్రేలియా, పరాగ్వే నాకౌట్‌కు చేరాయి. 

అయితే, ఆఖరి మ్యాచ్‌లో తుర్కియే అమెరికాపై సంచలన విజయం సాధించినప్పటికీ.. టోర్నీ నుంచి నిష్క్రమించింది. అంతకుముందు రెండు మ్యాచ్‌లలోనూ టర్కీ ఓడిపోవడం ఇందుకు కారణం. అయితే, వెళ్తూ వెళ్తూ.. అజేయంగా నాకౌట్‌కు చేరాలనుకున్న అమెరికాకు మాత్రం షాకిచ్చింది.

చదవండి: వైభవ్‌ కోసం వాళ్లకు అన్యాయం చేయలేము!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement