టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్‌ అయ్యర్‌.. బీసీసీఐ ప్రకటన | Shreyas Iyer Named India A Captain for Australia A ODI Series | BCCI Confirms 6-Month Red Ball Break | Sakshi
Sakshi News home page

టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్‌ అయ్యర్‌.. బీసీసీఐ ప్రకటన

Sep 25 2025 12:10 PM | Updated on Sep 25 2025 1:04 PM

BCCI Appointed Shreyas Iyer As India A Captain Vs Aus A One Day Series

టీమిండియా క్రికెటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (Shreyas Iyer)కు మరో బంపరాఫర్‌ వచ్చింది. ఆస్ట్రేలియా- ‘ఎ’ జట్టుతో జరిగే వన్డే సిరీస్‌కు అతడిని కెప్టెన్‌గా ఎంపిక చేసినట్లు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) గురువారం ప్రకటించింది. అదే విధంగా.. వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌కు శ్రేయస్‌ అయ్యర్‌ దూరమైనట్లు బీసీసీఐ వెల్లడించింది.

కాగా గత కొంతకాలంగా శ్రేయస్‌ అయ్యర్‌ వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. టీ20 ఫార్మాట్లో సూపర్‌ ఫామ్‌లో ఉన్నా ఆసియా కప్‌ టీ20- 2025 టోర్నమెంట్‌ ఆడే భారత జట్టుకు సెలక్టర్లు అతడిని ఎంపిక చేయలేదు. ఈ క్రమంలో బీసీసీఐ తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు రాగా.. ఆస్ట్రేలియా- ‘ఎ’ జట్టుతో స్వదేశంలో అనధికారిక టెస్టు సిరీస్‌కు భారత్‌-‘ఎ’ జట్టు కెప్టెన్‌గా అయ్యర్‌ను ఎంపిక చేసింది.

కెప్టెన్సీ వదులుకోవడంతో పాటు..
ఈ నేపథ్యంలో ఆసీస్‌తో తొలి అనధికారిక టెస్టు ఆడిన శ్రేయస్‌ అయ్యర్‌ (8) విఫలమయ్యాడు. అయితే, రెండో టెస్టు ఆరంభానికి ముందే కెప్టెన్సీని వదులుకోవడంతో పాటు.. జట్టు నుంచి తప్పుకొన్నాడు. టెస్టుల్లో పునరాగమనం కోసం ఎదురుచూస్తున్న శ్రేయస్‌.. ఇలాంటి నిర్ణయం తీసుకోవడం భారత క్రికెట్‌ వర్గాల్లో చర్చకు దారితీసింది.

అయితే, వెన్నునొప్పి కారణంగా నాలుగు రోజుల పాటు ఫీల్డింగ్‌ చేయలేకపోతున్నానని శ్రేయస్‌ అయ్యర్‌.. బీసీసీఐకి లేఖ రాసినట్లు వార్తలు వచ్చాయి. కొన్నాళ్ల పాటు రెడ్‌ బాల్‌ క్రికెట్‌కు దూరంగా ఉండనున్నట్లు బోర్డుకు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది.

ఆరునెలల పాటు దూరం
ఈ నేపథ్యంలో తాజాగా బీసీసీఐ ఈ విషయాన్ని ధ్రువీకరించింది. ఆరునెలల పాటు శ్రేయస్‌ అయ్యర్‌ రెడ్‌ బాల్‌ క్రికెట్‌కు దూరంగా ఉండనున్నట్లు స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఇరానీ కప్‌ మ్యాచ్‌కు అతడిని ఎంపిక చేయలేదని స్పష్టం చేసింది.

రజత్‌, తిలక్‌ అవుట్‌.. కెప్టెన్‌గా శ్రేయస్‌
స్వదేశంలో రెండు అనధికారిక టెస్టుల తర్వాత భారత్‌- ‘ఎ’ జట్టు.. ఆస్ట్రేలియా- ‘ఎ’తో మూడు మ్యాచ్‌ల అనధికారిక వన్డే సిరీస్‌ (సెప్టెంబరు 30- అక్టోబరు 5) ఆడనుంది. కాన్పూర్‌ ఇందుకు వేదిక.

ఈ నేపథ్యంలో ఆసీస్‌తో తొలి వన్డేకు రజత్‌ పాటిదార్‌ను... రెండు, మూడో వన్డేలకు తిలక్‌ వర్మను తొలుత బీసీసీఐ కెప్టెన్‌గా ఎంపిక చేసింది. అయితే, తాజాగా వారిద్దరిని తప్పించి శ్రేయస్‌ అయ్యర్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించింది. 

ఇక తొలి వన్డేకు దూరంగా ఉండనున్న.. ఆసియా కప్‌-2025 ముగిసిన తర్వాత తిలక్‌ వర్మ.. రెండు, మూడో వన్డేల్లో వైస్‌ కెప్టెన్‌గా ఎంట్రీ ఇవ్వనున్నాడు. అతడితో పాటు హర్షిత్‌ రాణా, అర్ష్‌దీప్‌ సింగ్‌ కూడా ఈ సిరీస్‌ ఆడతారు. మరోవైపు.. రజత్‌ పాటిదార్‌ ఇరానీ కప్‌ మ్యాచ్‌లో రెస్ట్‌ ఆఫ్‌ ఇండియా కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.

ఆస్ట్రేలియా- ‘ఎ’తో తొలి అనధికారిక వన్డేకు భారత జట్టు
శ్రేయన్‌ అయ్యర్ (కెప్టెన్‌), ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (వికెట్‌ కీపర్‌), రియాన్ పరాగ్, ఆయుశ్‌ బదోని, సూర్యాంశ్ షెడ్గే, విప్రజ్ నిగమ్, నిషాంత్ సింధు, గుర్జప్‌నీత్‌ సింగ్, యుధ్వీర్ సింగ్, రవి బిష్ణోయ్, అభిషేక్ పోరెల్ (వికెట్‌ కీపర్‌), ప్రియాంశ్‌ ఆర్య, సిమర్జీత్ సింగ్.

ఆస్ట్రేలియా- ‘ఎ’తో రెండు, మూడో అనధికారిక వన్డేలకు భారత జట్టు
శ్రేయస్‌ అయ్యర్ (కెప్టెన్‌), తిలక్ వర్మ (వైస్‌ కెప్టెన్‌), అభిషేక్ శర్మ, ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (డబ్ల్యుకె), రియాన్ పరాగ్, ఆయుశ్‌ బదోని , సూర్యాంశ్ షెడ్గే, విప్రజ్ నిగమ్, నిశాంత్ సింధు, గుర్జప్‌నీత్ సింగ్, యుధ్వీర్ సింగ్, రవి బిష్ణోయ్, అభిషేక్ పోరెల్‌ (వికెట్‌ కీపర్‌), హర్షిత్‌ రాణా, అర్ష్‌దీప్‌ సింగ్‌.

చదవండి: అసలు అక్కడ ఏం ఉంది?: అభిషేక్‌ శర్మపై గావస్కర్‌ ‘ఫైర్‌’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement