ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వేసే వ్యూహాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. వీటిపై ఎవరైనా పీహెచ్‌డీ చేస్తే కచ్చితంగా డాక్టరేట్ వస్తుందేమో! కొందరు విశ్లేషకులు చంద్రబాబువి వ్యూహాలు అంటారు.. మరికొందరు కుట్రలు అంటారు. ఆ వ్యూహాలలో ఎటు తిరిగి తనకే రాజకీయ ప్రయోజనం కలిగేలా జాగ్రత్తపడుతుంటారు. ఆయనకు బాండ్ బాజా వాయించే ఎల్లో మీడియా ఎటూ ఉంటుంది. సాయికృష్ణ కుటుంబాన్ని మేనేజ్ చేయడానికి చంద్రబాబు ఆడిన గేమ్ కాని, తదుపరి క్యాబినెట్ సమావేశంలో ఆయన చేసిన కామెంట్లు కాని గమనిస్తే ఈ విషయం అర్దం అవుతుంది.
అలాగే ఈ ఉదంతంలో చర్చ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైపు నడిచేలా కథ ఎలా సాగించారో విశ్లేషించడం కూడా ఆసక్తికరమే. సాయికృష్ణ కేసులో సర్కిల్ ఇన్ స్పెక్టర్ నాగరాజు అరెస్టును కొన్ని రోజుల పాటు జాప్యం చేయడం, దర్యాప్తులో కీలకమైన అంశాలు రాకుండా జాగ్రత్తపడడం కనిపిస్తుంది. అన్నిటిని మించి నాగరాజుతో ప్రభుత్వ పెద్దలు ఒక డీల్ కుదుర్చుకుని కూటమి పెద్దల పేర్లు, పోలీస్ ఉన్నతాధికారుల పేర్లు బయటకు రాకుండా చూడడానికి జరుగుతున్న ప్రయత్నాలు జరిగాయని వైఎస్సార్‌సీపీ ఆరోపించింది. న్యాయం అన్నది అధికారం, పలుకుబడిని పట్టి ఉంటుందని కూటమి ప్రభుత్వం పలుమార్లు రుజువు చేస్తున్నట్లు అనిపిస్తుంది.
కాపు యువకుడు సాయికృష్ణ పోలీసుల హింస కారణంగా మరణించిన ఘటనలో చంద్రబాబు తెలివిగా చర్చను ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైపు తిప్పారనిపిస్తుంది. అదేదో జనసేనకు, వైఎస్సార్‌సీపీకి మధ్య వివాదం అన్నట్లుగా ప్రచారం జరగాలని ఆయన కోరుకుంటున్నట్లుగా ఉంది. ఆ సంగతి అర్థం అవుతున్నా, పవన్ కళ్యాణ్ నిస్సహాయంగా ఆ ట్రాప్‌లో నుంచి బయటపడలేకపోతున్నట్లుగా విశ్లేషణలు వస్తున్నాయి. సాయికృష్ణ కేసు అన్నది నిజానికి కులానికి సంబంధించిన సమస్య కాదు. ఏపీలో జరుగుతున్న పోలీసుల రాక్షస కృత్యాలకు, చట్టాలు, రాజ్యాంగంతో నిమిత్తం లేకుండా సాగుతున్న రెడ్‌బుక్ అరాచకాలకు సంబంధించిన అంశం. మానవహక్కులను కాలరాస్తున్న ప్రభుత్వంపై ప్రజలలో వస్తున్న తీవ్ర వ్యతిరేకత. వీటన్నిటిని కప్పిపుచ్చి రాజకీయ కోణంలో కేసును మలుపు తిప్పి పవన్ కళ్యాణ్‌ను అడ్డం పెట్టుకుని కథ నడపాలని చంద్రబాబు చూస్తున్నట్లుగా అనిపిస్తుంది.
ఈ ప్రక్రియలో రాజకీయ లబ్ది జరిగితే తనకు, అప్రతిష్ట వస్తే అది పవన్ కళ్యాణ్ ఖాతాలోకి వెళ్లేలా వ్యూహాం పన్నారా అన్న అభిప్రాయాన్ని కొంతమంది విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారం ఇలాగే సాగితే పవన్ కళ్యాణ్ ఒక బకరా అయ్యే అవకాశం ఉందని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. సాయికృష్ణ కుటుంబానికి జరిగిన అన్యాయంపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో, వారు కొందరు కాపు నేతలను ఆశ్రయించడం తదితర అంశాల వల్ల, కులం కోణం కూడా సహజంగానే వస్తుంది. అది ఎవరూ కాదనలేని సత్యం.
విపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు కుల రాజకీయాలే కాదు.. మత రాజకీయాలు కూడా చేసి ప్రజలను ఎంత రెచ్చగొట్టాలో అంతా చేశారన్నది నిర్వివాదాంశం. సాయికృష్ణ కేసులో తప్పని స్థితిలో సీఐ నాగరాజును అరెస్టు చేయవలసివచ్చిందన్నది బహిరంగ రహస్యం. ఈ కేసులో సాయికృష్ణను మార్కాపురం నుంచి టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకుని వచ్చి హింసకు శ్రీకారం చుట్టారు. దానిని నాగరాజు కొనసాగించారన్నది అభియోగం.
ఆ టాస్క్ ఫోర్స్ విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబు ఆధీనంలో ఉంటుంది. ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబుకు, ఇతర పెద్దలకు సన్నిహితుడన్న పేరు ఉంది. ఆయనను కాపాడుకోకపోతే, ఆ కేసు ఆ పై అధికారులు, తదుపరి ప్రభుత్వంలో బాధ్యతలు నిర్వహిస్తున్నవారికి కూడా అంటుకునే అవకాశం ఉంటుంది. దాంతో సీఐ నాగరాజును పూర్తిగా మేనేజ్ చేసిన తర్వాతే, సిసిటీవీ ఫుటేజి మాయం అయ్యాకే కేసును ముందుకు తీసుకు వెళ్లే విధంగా ప్లాన్ చేసి ఉంటారన్నది జై భీమ్ అధ్యక్షులు జడ శ్రవణ్ తో పాటు పలువురు వైఎస్సార్‌సీపీ నేతల అభిప్రాయంగా ఉంది. అందులో వాస్తవం ఉండే అవకాశం కనిపిస్తుంది.
మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి కుల ప్రస్తావన లేకుండా, మానవ హక్కుల కోణంలో సాయి కుటుంబాన్ని పరామర్శించినా తొలుత విపరీతమైన వ్యతిరేక ప్రచారం చేయించారు. అయినా పరిస్థితి చేయి జారిపోతోందని భయపడి స్వయంగా చంద్రబాబే కుటుంబాన్ని తనవద్దకు పిలిపించుకుని రాయబారం చేశారు. అక్కడ ఏమి జరిగిందో కాని ఆ కుటుంబం స్వరం మార్చేసింది. ఇది ఒక కోణం అయితే క్యాబినెట్ సమావేశంలో యధాప్రకారం క్రిమినల్స్‌కు వైఎస్సార్‌సీపీ మద్దతు ఇస్తోందని చంద్రబాబు అన్నారని ఎల్లో మీడియా రాసింది. అది నిజమే అయితే, ఆ క్రిమినల్ కుటుంబాన్ని చంద్రబాబు ఎందుకు పరామర్శించారు? విజయవాడ తూర్పు టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు ఆ కుటుంబంతో ఎందుకు మాట్లాడి ఓదార్పు మాటలు చెప్పారు. జనసేన నేత ఒకరు డబ్బు ఆఫర్ ఎందుకు ఇచ్చారు? ఇవేవి ప్రస్తావనకు రాకుండా చంద్రబాబు మాట్లాడతారు. ఇది ఇలా ఉంటే కాకినాడలో పవన్ కళ్యాణ్ తలాతోక లేకుండా వైఎస్సార్‌సీపీవారిని దూషించి రెచ్చగొట్టడం చంద్రబాబు ప్లాన్‌లో భాగమేనన్నది ఎక్కువ మంది అభిప్రాయం.
రౌడీ షీటర్ చనిపోతే ఏమిటన్నట్లు పవన్ మాట్లాడడం ఎంత దారుణంగా ఉంది. అతను కాపు కులం వాడైతే మాత్రం అని ఆయన భావిస్తున్న తీరు పద్ధతిగా ఉందా? సీఐ నాగరాజు లేదా, టాస్క్ ఫోర్స్ పోలీసులు కూడా ఒక వ్యక్తి చచ్చేలా హింసించడం నేరం కాదని చట్టబద్దమైన పదవులలో ఉన్న చంద్రబాబు, పవన్‌లు చెప్పదలిచారా? లేక సాయికృష్ణ పేదవాడు కనుక, అతనికి అండ లేదు కనుక, కేవలం జనసేనలో ఒక సామాన్య కార్యకర్త కనుక పట్టించుకోనవసరం లేదనుకున్నారా! అదే సీఐ కూడా కాపు వ్యక్తి అయినా, బాగా డబ్బు ఉన్న వ్యక్తి అవడం, అతని మేనమామ ఒక మాజీ డీజీపీ కావడం వల్ల అతనికి పవన్ అండగా నిలబడుతున్నారా అన్న విమర్శ రాదా? సాయిపై కేసులు ఉంటే, మరి పోలీసులకు హత్యలు చేసే అధికారం ఉండదు కదా! అంటే వారు కూడా నేరం చేసినట్లే అవుతుంది కదా! ఆ ప్రస్తావన ఎందుకు క్యాబినెట్‌లో రాలేదు. తాను ఎందుకు సాయి కుటుంబాన్ని పిలిపించుకుని మాట్లాడింది చంద్రబాబు ఎందుకు చెప్పలేకపోయారు?
బాధిత సాయి కుటుంబంతో రాజీచేసుకుని, కేసులో నిందితుడుగా ఉన్న నాగరాజుతో కూడా డీల్ కుదుర్చుకోవడం తెలుగుదేశం పార్టీకే సాధ్యమవుతుందేమో! పవన్ కళ్యాణ్‌పై వైఎస్సార్‌సీపీ నేతలు విమర్శలు చేస్తుంటే స్పందించరేమిటని, కుల రాజకీయాలను తిప్పి కొట్టాలి కదా అని ఆయన అన్నారట. వైఎస్సార్‌సీపీ పవన్ కళ్యాణ్‌పై తొలుత ఏమీ మాట్లాడలేదు. చంద్రబాబు పైన, పోలీసు అధికారులపైన ఆరోపణలు చేసింది. దానికి జవాబుగా రౌడీలకు మద్దతు ఇస్తారా అని ఎదురుదాడి చేశారు. ఆ తర్వాత ఆయనే స్వయంగా రౌడీ కుటుంబంతో భేటీ అయ్యారు. దానిని ప్రస్తావంచకుండా పవన్ కళ్యాణ్ అంశాన్ని తెరపైకి తెచ్చారు.
కాకినాడలో పవన్ కళ్యాణ్ వైఎస్సార్‌సీపీవారిని ఉద్దేశించి గూండాలు, రౌడీలు అంటూ అనుచితంగా మాట్లాడారు. దానికి జవాబుగా టీడీపీ, జనసేనలలో ఉన్న రౌడీలు, గూండాల గురించి వివరాలను వైఎస్సార్‌సీపీ బయటపెట్టింది. టీడీపీకి 135 మంది ఎమ్మెల్యేలు ఉంటే వారిలో క్రిమినల్ కేసులు ఉన్నవారు 115 మంది అట. అందులో తీవ్రమైన అభియోగాలు ఉన్నవారి సంఖ్య 82. జనసేనలో 21 మంది ఎమ్మెల్యేలు ఉంటే పది మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. అందులో ఏడుగురిపై తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయాలను దాచేసి వైఎస్సార్‌సీపీపై ఆరోపణలు చేసి ప్రజలను తప్పుదారి పట్టించాలన్నది చంద్రబాబు లక్ష్యం. కాని సోషల్ మీడియాలో అన్ని వివరాలు వెలుగులోకి వచ్చేస్తున్నాయి. ఈ విషయాలపై మాత్రం టీడీపీ, జనసేనలు నోరు పెగల్చవు.
ఈ కేసులో పవన్‌ను ఇరికించాలని జగన్ తన పార్టీ నేతలతో అన్నారని ఒక ఊహాగానాన్ని సృష్టించి దుష్ప్రచారం చేసిది. నిజానికి పవన్ పద్దతిగా వ్యవహరించకుండా చేసింది టీడీపీ, ఎల్లో మీడియానే కదా! ఒకప్పుడు పోలీసులు ఎలా నిందితులను కొడతారంటూ ప్రశ్నలు వేసిన పవన్‌తోనే, లాకప్ డెత్‌లకు బాధ్యులైన పోలీసులకు మద్దతుగా మాట్లాడించి ఆయన పరువు తీశారు. ఇక నాగరాజుపై అన్ని ఆరోపణలు వస్తే కొంతమంది ఆయనకు మద్దతు పలుకుతున్నారంటూ 'నాగరాజుకు జేజేలు' అన్న హెడింగ్ పెట్టి ఇలాంటి హత్యలను కూడా సమర్థించే దుస్థితిలోకి ఎల్లో మీడియా వెళ్లిందంటే వారికి ఉన్న ప్రయోజనం ఏమిటో జనం ఊహించుకోలేరా?

-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత


