అమరావతికి అసలు ఎవరు రమ్మన్నారు? | KSR's Comments On Chandrababu Naidu's Statement Regarding The YSRCP | Sakshi
Sakshi News home page

అమరావతికి అసలు ఎవరు రమ్మన్నారు?

Jul 2 2026 10:34 AM | Updated on Jul 2 2026 12:41 PM

KSR's Comments On Chandrababu Naidu's Statement Regarding The YSRCP

అమరావతికి వాళ్లను ఎవరు వెళ్లమన్నారు? వారు కుట్రలు చేస్తున్నారు.. అందుకే రైతులు తిరగబడ్డారు.. ఇది వైఎస్సార్‌సీపీ నేతలను ఉద్దేశించి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటన. అంటే దీని అర్థం రైతుల ముసుగులో టీడీపీ వారు దాడి చేసినట్లు అంగీకరించినట్లే అవుతుందా? లేదా?..

'మేమే రమ్మన్నాం.. ప్రభుత్వం తమను వేధిస్తున్న తీరుపై మాజీ ముఖ్యమంత్రి జగన్‌కు తెలియచేస్తే ఆయన ఒక కమిటీని వేశారు. వాస్తవ పరిస్థితులను గమనించడానికి తమ కోరిక మేరకు ఆ వైఎస్సార్‌సీపీ కమిటీ నేతలు వస్తుంటే టీడీపీ వారు అడ్డుకుని రభస సృష్టించారు. ఇది దారుణంగా ఉంది..' అని ఉండవల్లి, పెనుమాక గ్రామాలకు చెందిన రైతులు కొందరు ఇచ్చిన జవాబు.

'అమరావతి ఏమైనా పాకిస్తానా? తాము ఎందుకు వెళ్లకూడదు..' అని మాజీ మంత్రి అంబటి రాంబాబుతో సహా పలువురు వైఎస్సార్‌సీపీ నేతలు, ఇతరత్రా ఆలోచనపరుల ప్రశ్న.

'వైఎస్సార్‌సీపీ నేతలను తరిమిన రాజధాని రైతులు.. ఇది ఎల్లో మీడియాగా పేరొందిన తెలుగుదేశం పత్రిక ఈనాడు' పేపర్‌లో పెట్టిన హెడ్డింగ్.. ఇది మెయిన్ పేజీలో వచ్చిన శీర్షిక అయితే జిల్లా పత్రికలో మరో కథనం ఇచ్చారు. దానికి 'ఈసడించినోళ్లను ఈడ్చి కొట్టారు' అన్న శీర్షికను పెట్టి మరో స్టోరీ రాశారు. అందులో ఏమి రాశారో తెలుసా!.. 

శనివారం రాజధాని పర్యటనకు వచ్చిన వైఎస్సార్‌సీపీ నాయకులను చేతికి దొరికిన కర్రలతో వెంబడిస్తూ, కోడిగుడ్లు విసురుతూ తీవ్ర పరాభవం చేశారు అని ఈనాడులో పేర్కొన్నారు. అదే టైమ్‌లో 'రాళ్లు, కోడిగుడ్లతో గుర్తు తెలియని వ్యక్తుల దాడి' అని ఈనాడు మొదటి పేజీలో అందుకు విరుద్ధంగా తెలిపారు.

'వైఎస్సార్‌సీపీవారిని గంట సేపు అడ్డగించారని, రెచ్చగొట్టేలా వైఎస్సార్‌సీపీ చేష్టలు' అని కూడా రాశారు. అంటే దీని అర్దం ఎక్కడా వైఎస్సార్‌సీపీవారు దాడులు చేయలేదని పరోక్షంగా తెలియచేసినట్లే కదా! అక్కడ అరాచకం చేసింది టీడీపీ గూండాలని తెలుసు.. ప్రశాంతంగా తమ దారిన తాము వెళుతున్న వైఎస్సార్‌సీపీ నేతలను అడ్డుకున్నది వారేనని తెలుసు. అయినా తెలుగుదేశంపై విధేయతతో అడ్డగోలు కథనాలు రాశారు. మరో టీడీపీ మీడియా అయితే 'మళ్లీ అమరావతి వైపు వైఎస్సార్‌సీపీ వాళ్లు కన్నెత్తి చూడకుండా చేయాలని' వ్యాఖ్యానించింది. ఆ తర్వాత ప్లేట్ మార్చి 'వైఎస్సార్‌సీపీ నేతలే అమరావతిపై దండయాత్ర చేశారని' పచ్చి అబద్దాన్ని ప్రచారం చేసిది. దీనిని బట్టి ఎంత నిస్సిగ్గుగా ఈ ఎల్లో మీడియా పనిచేస్తున్నది అర్థం చేసుకోవచ్చు.

ఈ ఘటనలో ఒక కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డారు. అతనిపై రాయి విసిరిన వ్యక్తి టీడీపీ వాడని తెలిసినా పోలీసులు మాత్రం అతని పేరు కేసులో చేర్చలేదట. కొద్ది రోజుల క్రితం కీలక మంత్రి లోకేష్ ప్రకటించినట్లు టీడీపీ కార్యకర్తలు తప్పులు చేసినా కేసులు పెడితే ఊరుకోనని, అవసరమైతే డీజీపీని పంపిస్తానని బెదిరించిన నేపథ్యంలోనే పోలీసులు ఇలా వ్యవహరించారన్న అభిప్రాయం కలుగుతుంది.

అసలు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి విపక్షానికి చెందిన రాజకీయ పార్టీని అమరావతి ప్రాంతానికి వెళ్లరాదని అనడం సరైనదేనా? అంటే అమరావతిలో జరగకూడనివి జరుగుతున్నాయని అంగీకరించినట్లే కదా అని పెనుమాక రైతు ఒకరు వ్యాఖ్యానించారు. నిజంగా ఈ నాలుగైదు గ్రామాల రైతుల పట్ల ప్రభుత్వం ఇంత క్రూరంగా ప్రవర్తించడం దారుణంగా ఉంది. వారు రాజధానిలో రోడ్డుకు అవసరమైన భూమి ఇచ్చినా, వారికి ఉన్న భూములు మొత్తం ఇవ్వాలని ప్రభుత్వం పట్టుబట్టి భయపెడుతోంది. వారు తమ హక్కులను కాపాడుకునేందుకు పోరాడుతున్నారు. సమస్యలను తెలుసుకోవలసిన ప్రభుత్వ పెద్దలే తమ పొలాలలో తాము పనిచేసుకోనివ్వకుండా రకరకాల ఆటంకాలు సృష్టిస్తున్నారని రైతులు వాపోతున్నారు.

వీరి పొలాల్లో మట్టి తవ్వుకుని టీడీపీ మాఫియా గాంగ్ అమ్ముకుందట. ఆ పొలాలను చెరువుల మాదిరి కొందరు అధికారులు పాడు చేశారు. ఆరుగాలం కష్టపడే రైతులను రకరకాలుగా అవమానాలకు గురి చేస్తున్నారు. వేధిస్తున్నారు. అయినా రైతులు తమ పోరాటం కొనసాగించడం టీడీపీ ప్రభుత్వానికి, ఎల్లో మీడియాకు కంటగింపుగా మారింది.

కొద్ది రోజుల క్రితం జగన్‌ను కలిసిన రైతులు ఆయన సామాజికవర్గానికి చెందినవారని ఒక ఎల్లో మీడియా పత్రిక రాసింది. ఇప్పుడు ఆ కారణంతోనే రైతులను ఇలా హింసిస్తున్నారా అని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. ఇది సమాజానికి మంచిది కాదు. నిజానికి ఆ గ్రామాలలో అన్ని సామాజికవర్గాల రైతులు ఈ భూ సేకరణను వ్యతిరేకిస్తున్నారు. అవసరమైన భూమి ఇచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం ఇలా కక్షపూరితంగా వ్యవహరించడం ఒక ఎత్తు అయితే, వైఎస్సార్‌సీపీ నేతలు వారితో మాట్లాడడానికి వెళుతున్నప్పుడు ఉండవల్లి వద్ద ప్లాన్ ప్రకారం అడ్డుకుని టీడీపీ గూండాలు నానా గందరగోళం సృష్టించడం మరో ఎత్తుగా ఉంది. పైగా దాడులు చేసినవారిపై కాకుండా, బాధితులపైన కేసులు పెట్టడం ఈ ప్రభుత్వం ఒక ట్రెండ్ గా మార్చింది.

చంద్రబాబు సర్కార్ ఇలాంటి దుష్ట సంప్రదాయాలకు తెరదీయడం అత్యంత శోచనీయం. ఇది భవిష్యత్తులో వచ్చే ప్రభుత్వాలు కూడా పాటించే ప్రమాదం ఉంటుందన్న సంగతిని చంద్రబాబు, ఆయన కుమారుడు మంత్రి లోకేష్ విస్మరిస్తున్నారు.

కొద్దిరోజుల క్రితం తెలంగాణలో ఒక సభ పెట్టుకోవడానికి పవన్ కళ్యాణ్ అనుమతి కోరితే రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున కాకుండా, మరో రోజు పెట్టుకోవచ్చని ఆ ప్రభుత్వం చెబితే ఇదేమైనా మీ అయ్య జాగిరా అని ప్రశ్నించారు. పవన్‌కు చంద్రబాబు సైతం మద్దతు ఇచ్చారు. ఇప్పుడు అదే ప్రశ్నను వైఎస్సార్‌సీపీ నేతలు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. తాము అమరావతి రాజధాని గ్రామాలకు ఎందుకు వెళ్లకూడదని అడుగుతున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు ఎక్కడకు వెళ్లి, ఎవరిని రెచ్చగొట్టినా అప్పటి ప్రభుత్వం ఏమీ మాట్లాడకూడదనేవారు. అనపర్తికి ఆయన ఒకసారి వెళ్లినప్పుడు శాంతిభద్రతల సమస్య వస్తోందని, టూర్ వద్దని పోలీసులు చెబితే ఆయన ఒప్పుకోకుండా కాలి నడకన వెళతానని అంటూ పట్టుబట్టి వెళ్లారు. అయినా పోలీసులు ఆయనపై కేసు పెట్టకుండా రక్షణ కల్పించారు. పల్నాడు ప్రాంతంలో ఉద్రిక్తతలు ఉన్న పరిస్థితిలో పోలీసుల మాట ఖాతరు చేయకుండా ఆయన టూర్ చేశారు.

గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన పాదయాత్ర చేసిన సందర్భంలో కొందరు తెలంగాణవాదులు అడ్డుకోవడానికి యత్నించేవారు. అప్పట్లో మంద కృష్ణ మాదిగ తన అనుచరులతో యాత్రకు సహకరించారు. అయినా కొన్నిచోట్ల ఘర్షణ వాతావరణం ఏర్పడేది. వరంగల్ జిల్లాలో ఒకసారి తెలంగాణవాదులు గట్టిగా అడ్డుపడితే అప్పట్లో పవర్‌ఫుల్‌గా ఉన్న ఒక టీడీపీ నేత తన మనుషులతో వారిపై దాడి చేయించారు. వారిని ఉరికించి కొట్టామని ఆయనే స్వయంగా చెప్పారు. చంద్రబాబు ఎక్కడికైనా వెళ్లవచ్చు కాని, తను అధికారంలో ఉంటే మాత్రం విపక్షం ఎక్కడకు కదలకూడదా అన్న ప్రశ్న వస్తుంది.

గతంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అమరావతిని గేటెడ్ కమ్యూనిటిగా మార్చుతున్నారని విమర్శించేవారు. ఇప్పుడు ఆయన చంద్రబాబు సరసన చేరి మద్దతు ఇస్తుండవచ్చు. కాని ఆయన చెప్పిన గేటెడ్ కమ్యూనిటీ మాట ప్రస్తుతం నిజం అవుతుందేమో అన్న సందేహం వస్తోంది. అమరావతిలో ఎలాంటి తప్పులు జరగకపోతే, వేల కోట్ల అప్పులు తెచ్చి జరుపుతున్న నిర్మాణాలలో అవినీతి లేకపోతే, రైతులంతా స్వచ్చందంగా భూములు ఇస్తున్నట్లయితే వైఎస్సార్‌సీపీ నేతల పర్యటనను అడ్డుకోవలసిన అవసరం ఏమి ఉంటుంది.

అమరావతిలో ఒక భయానక వాతావరణం సృష్టించి ఎవరూ అందులోని లోటుపాట్లను ఎత్తి చూపరాదన్న లక్ష్యమా? లేక సాయికృష్ణ లాకప్ డెత్ కేసును డైవర్ట్ చేయడానికి దీనిని వాడుకున్నారా అన్నది తెలియదు. చిత్రం ఏమిటంటే దాడులకు గురైన వైఎస్సార్‌సీపీ నేతలపై  ఎస్సీ.ఎస్టీ చట్టం కింద కూడా ఒక మహిళతో ఫిర్యాదు చేయించడం, వెంటనే కేసు నమోదు చేయడం జరిగిపోయాయట. దౌర్జన్యాలకు పాల్పడిన టీడీపీవారిపై మాత్రం నామమాత్రపు కేసులు పెట్టారట. దీనిని బట్టి ఏపీలో పోలీస్ వ్యవస్థ ఎంతగా దిగజారిపోయింది.. చంద్రబాబు ప్రభుత్వం ఎంత అరాచకంగా మారింది అర్థం అవుతోంది కదా!


-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement