రాజకీయ ప్రత్యర్థులపై దుష్ప్రచారం చేయడంలో తెలుగుదేశం పార్టీకి ఉన్నంత సామర్థ్యం దేశంలో మరే పార్టీకి ఉండకవచ్చు. రావణ్ అనే యూట్యూబర్‌పై దేశద్రోహం కేసు పెట్టడంపై సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తం అయింది. అంతా ఇదేమి పద్దతి అని నొచ్చుకున్నారు. దీనివల్ల ముఖ్యమంత్రి చంద్రబాబుకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు తీరని అప్రతిష్ట వస్తే,ఎపి పోలీసు వ్యవస్థకు కళంకం ఏర్పడిందన్న వ్యాఖ్యలు వచ్చాయి. దీంతో ఆత్మరక్షణలో పడిన తెలుగుదేశం పార్టీ వెంటనే వ్యూహం మార్చి వైఎస్సార్‌సీపీపై బురద చల్లడం ఆరంభించింది. ఎల్లో మీడియాతో పాటు, సోషల్ మీడియాలో తనకు ఉన్న పట్టు మేరకు విపరీతమైన వ్యతిరేక ప్రచారం సాగించింది.
అదే టైమ్‌లో మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర నేతలతో వైఎస్ జగన్‌పైన, వైఎస్సార్‌సీపీపైన నిందలు వేయడం ఆరంభించారు. రావణ్ అరెస్టు చేశాక జరిగిన పరిణామాలలో జనసేన పరువు పోగొట్టుకుంటే, తీవ్రవాద నిరోధచట్టం కింద కేసులు, దేశద్రోహం కేసులు వంటివి పెట్టి తెలుగుదేశం పార్టీ సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లయింది. జనసేన క్యాడర్ కొంతమంది అరాచకంగా పోలీస్ స్టేషన్‌లపై దాడులు చేసినా వారిని అరికట్టలేకపోయిన చంద్రబాబు ప్రభుత్వం కనీసం కేసులు పెట్టలేదు. జనసేన వారిపై కేసులు పెడితే ఎక్కడ పవన్ కళ్యాణ్‌కు, ఆ పార్టీ వారికి కోపం వస్తుందన్న భయం కావచ్చు.
జనసేన జనంలో పలచన అయినా ఫర్వాలేదులే అన్న వ్యూహం కావచ్చు. కాని న్యాయ వ్యవస్థ తగురీతిలో స్పందించి రావణ్ కు బెయిల్ ఇచ్చేస్తుండడంతో పవన్‌ను సంతృప్తి పరచడానికిగాను అన్నట్లు తీవ్రమైన నేరారోపణ చేస్తూ రావణ్‌పై కేసులు పెట్టింది. ఈ ఫిర్యాదు చేసింది జనసేనకు చెందిన ఒక స్థానిక నేత అయినా, దానిని ఆమోదించడం ద్వారా టీడీపీ కూడా భాగస్వామి అయినట్లయింది. చంద్రబాబు ఆధ్వర్యంలోనే లా అండ్ ఆర్డర్ పనిచేస్తుంటుందన్న సంగతి తెలిసిందే. దీనిపై వైఎస్సార్‌సీపీతో పాటు, వామపక్షాలు, ఆలోచనాపరులు, విజ్ఞులైనవారంతా స్పందించారు. న్యాయవాది జడ శ్రావణ్ ఇదంతా కుట్ర పూరితంగా చేస్తున్నారని విమర్శించారు.
సామాజిక అంశాలపై కూడా స్పందించే నటుడు ప్రకాష్ రాజ్ ఎప్పటికప్పుడు రావణ్ అంశంపై ఏపీ ప్రభుత్వాన్ని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను తప్పుపడుతూ వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. పలువురు సీనియర్ పాత్రికేయులు, యూట్యూబ్ చానళ్లు నిర్వహిస్తున్న కొంతమంది ప్రభావశీలురు కూడా ఏపీ ప్రభుత్వ తీరును తప్పుపడుతూ వీడియోలు చేశారు. రావణ్ చేసిన విషయాలలో తప్పు ఉంటే చర్య తీసుకోవద్దని ఎవరూ అనడం లేదు.కాని తప్పుడు కేసులు పెట్టడం, అది కూడా ఏకపక్షంగా చేయడంపైనే అంతా బాధపడ్డారు. పవన్ కళ్యాణ్ గతంలో నక్సల్సిజంకు సంబంధించి చేసిన అనుకూల ప్రకటనల వీడియోలు కూడా ఇప్పుడు బయటకు వచ్చాయి.
దీంతో రావణ్ విషయంలో తప్పుడు కేసు పెట్టిన విషయం జనం అందరికి తెలిసిపోయిందన్న ఆందోళనతో చంద్రబాబు సర్కార్ వ్యూహాత్మక ఎదురుదాడి చేయడం ఆరంభించింది. రావణ్ దేశద్రోహి అని, సమాజ విధ్వంసకుడు అని, హిందూ మత వ్యతిరేకి అని ఇలా పలు ఆరోపణలు సంధిస్తూ ప్రచారం చేయడానికి టీడీపీ, జనసేనలు యత్నించాయి. వారికి బీజేపీ కూడా జత కలిసింది. ఈ క్రమంలోనే వైఎస్సార్‌సీపీ పైన, ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌పైన పలు విమర్శలు చేస్తూ టీడీపీ నేతలు మీడియా సమావేశాలు పెట్టారు. చివరకు చంద్రబాబు కూడా ఇష్టారీతిన ఆరోపణలు చేశారు. రావణ్‌కు జగన్ మద్దతు ఇస్తారా అంటూ టీడీపీ గంభీరంగా మాట్లాడే యత్నం చేసి దొరికిపోయిందని చెప్పాలి. నిజానికి రావణ్ ఎప్పుడూ వైఎస్సార్‌సీపీకి సంబంధించిన వ్యక్తి కాదు. ఒకప్పుడు వపన్ కళ్యాణ్ అభిమాని.
ఆ విషయం ఆయనే పలుమార్లు చెప్పారు. చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణలపై వ్యతిరేక వీడియోలు చేయలేదు. వైఎస్ జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు పలు విమర్శలతో వీడియోలు చేసిన వ్యక్తి రావణ్. అయినా రావణ్‌పై కూటమి సర్కార్ తీవ్రమైన కేసులు పెట్టడం మీద జగన్ మానవత్వంతో స్పందించారు. తప్పుడు కేసులు పెట్టడం మంచిది కాదని ఆయన ప్రభుత్వానికి సలహా ఇచ్చారు. కులాలు, మతాలకు అతీతంగా ఆయన వ్యవహరిస్తే సమాజ విధ్వంసకుడు రావణ్‌ను సమర్థిస్తున్నారంటూ టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోంది.
అయితే అదే టైమ్‌లో వామ పక్షాలు కూడా రావణ్‌పై ఉపా కేసులు పెట్టడంపై మండిపడ్డాయి. వారి జోలికి మాత్రం టీడీపీ, జనసేనలు వెళ్లలేదు. సీపీఎం కార్యదర్శి వి.శ్రీనివాసరావు, సీపీఐ జాతీయ కార్యదర్శి కె. రామకృష్ణ చాలా ఘాటుగా ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఇది తప్పుడు కేసు అని వారు స్పష్టం చేశారు. ఈ క్రమంలో టీడీపీ మద్దతుదారుగా పేరొందిన మాజీ ఐపీఎస్ అధికారి ఎబి వెంకటేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రావణ్‌పై కూటమి సర్కార్ తప్పుడు కేసులు పెట్టిందని ఆయన తెలిపారు. రావణ్‌పై పెట్టిన కేసులకు ఆధారంగా అక్కడక్కడ, ఆయా సందర్భాలలో మాట్లాడిన మాటలను కట్ చేసి, ముక్కలు, ముక్కలు అతికించి వీడియోల రూపంలో పోలీసులు పెట్టారని ఆయన అభిప్రాయపడ్డారు.
రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తి ఇతర మతాలను దారుణంగా అవమానించే రీతిలో మాట్లాడితే దానికి జవాబు ఇచ్చారే కాని రావణ్ స్వయంగా మతాలను దూషించలేదన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. దీంతో ఏపీ పోలీసుల దుశ్చర్య ప్రజలకు మరింత స్పష్టంగా తెలిసింది. మరి ఏబీ వెంకటేశ్వరరావుపై ఎందుకు టీడీపీ విమర్శలు చేయలేకపోయింది. ఆయన అడిగినవాటికి ఎందుకు జవాబులు ఇవ్వడం లేదు. ఇప్పటికే సాయికృష్ణ, క్రాంతికుమార్, గంగవ్వ, తదితర కేసులలో పోలీసులపై మచ్చపడింది. దానికితోడు రావణ్ పై తప్పుడు కేసు పెట్టారని ఒక రిటైర్డ్ సీనియర్ పోలీసు అధికారి వెల్లడించడంతో అటు చంద్రబాబు, పవన్‌లకు, ఇటు పోలీసు అధికారులకు బాగా డామేజీ అయిందని చెప్పాలి.
చిత్రమేమిటంటే వైఎస్ జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు వైఎస్సార్‌సీపీకి చెందిన ఒక నేత పార్టీపై అసమ్మతితో కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టేలా రోజూ మాట్లాడుతుంటే వైఎస్ జగన్ ప్రభుత్వంపై దారుణమైన ఆరోపణలు చేస్తుండేవారు. దానిని ఎల్లో మీడియా లైవ్ కవరేజీ ఇచ్చి అదేదో పండగ మాదిరి సంబర పడేది. అంతే తప్ప ఆయన సమాజాన్ని విధ్వంసం చేస్తున్నారని ఎక్కడా రాయలేదు.
రాజద్రోహం కేసు పెట్టి ఆయనను అరెస్టు చేస్తే తెలుగుదేశం పార్టీ నానా రచ్చ చేసింది. ఇప్పుడేమో అదే రాజద్రోహం కేసును రావణ్‌పై బనాయిస్తోంది. దాస్ అనే వ్యక్తి చేస్తున్న దారుణ ప్రసంగాలపై చర్య తీసుకుని ఉంటే కూటమి ఇప్పుడేమి చెప్పినా అర్థం ఉండేది. పవన్ కళ్యాణ్ తాను గతంలో నక్సలిజానికి, చెగువేరాకు ఎందుకు మద్దతు ఇచ్చింది చెప్పి తప్పు చేశానని ప్రకటించి ఉంటే ఆయనలో నైతికత ఉందన్న అభిప్రాయం కలిగేదన్న భావనను పలువురు వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ఏబీ వెంకటేశ్వరరావు చెప్పిన అంశాలకు ఏపీ పోలీసులు సమాధానం ఇస్తారా? ఆయనపై కూడా టీడీపీ దాడి చేస్తుందా? టీడీపీ, జనసేనలు ఈ అంశంపై ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. లేకుంటే వారే సెల్ప్ గోల్ వేసుకున్నట్లవుతుంది.

- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత


