సీఎం చంద్రబాబు సర్కార్‌లో నీరుగారిన సంచలన కేసు
ఏడాది దాటినా కొలిక్కిరాని గండికోట మైనర్ బాలిక క్రూర హత్య ఉదంతం
అనుమానితుడు లోకేష్‌కు ‘డీఐజీ’ స్పీడ్ క్లీన్‌చిట్
తారుమారైన పోలీసుల దర్యాప్తు వ్యూహం
ఇద్దరు ఎస్పీలు మారినా తేలని మిస్టరీ
‘విజనరీ’ పాలనలోనే అబల ప్రాణాలకు రక్షణ కరవా?
సీసీ ఫుటేజీలు, టవర్ లొకేషన్లు చూసినా తేలని దర్యాప్తు
తెరవెనుక రాజకీయ కారణాలతోనే కేసు అటకెక్కిందా?
సాక్షి ప్రతినిధి, కడప: పర్యాటక ప్రాంతమైన గండికోటలో గత ఏడాది (2025 జూలై 14న) చోటుచేసుకున్న మైనర్ బాలిక అత్యంత క్రూరమైన హత్య కేసు జరిగి సరిగ్గా ఏడాది పూర్తయింది. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్, టవర్ లొకేషన్లు, పాలిగ్రాఫ్, నార్కో అనాలిసిస్ వంటి అత్యాధునిక పరీక్షలు నిర్వహించి, ఇద్దరు ఐపీఎస్ స్థాయి అధికారులు పర్యవేక్షించినా క్షేత్రస్థాయిలో ఫలితం మాత్రం ‘కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు’ చందంగా మారింది. సోషల్ మీడియాలో చిన్న పోస్టు పెడితే చాలు శరవేగంగా అర్ధరాత్రి పూట కూడా స్పందించే సీఎం చంద్రబాబు సర్కార్.. ఒక అబల ప్రాణం పోయి ఏడాదైనా నిందితులెవరో తేల్చలేక చేతులెత్తేయడం గమనార్హం.
మిస్సింగ్ కేసు నుంచి మర్డర్ దాకా..
ఇంటర్మీడియట్ చదువుతున్న సదరు బాలిక కళాశాలకు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు 2025 జూలై 14న ప్రొద్దుటూరు పోలీసులు క్రైమ్ నెంబర్ 257/2025 కింద మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఆ తర్వాత గండికోట పరిసరాల్లో బాలిక హత్య వ్యవహారం బహిర్గతం కావడంతో జమ్మలమడుగు పోలీసులు క్రైమ్ నంబర్ 498/2025 కింద హత్య కేసు నమోదు చేశారు. అప్పట్లో ఈ మైనర్ బాలిక హత్య ఉదంతం రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనంగా మారింది.
లోకేష్‌కు క్లీన్‌చిట్ ఇచ్చిన డీఐజీ.. ఆంతర్యమేమిటి?
ఈ మైనర్ బాలిక హత్య కేసులో కర్నూల్ రేంజ్ డిఐజీ కోయ ప్రవీణ్ అత్యంత వేగంగా ఒక నిర్ధారణకు రావడం సర్వత్రా అనుమానాలకు తావిచ్చింది. అప్పట్లో ఘటన స్థలానికి చేరుకున్న డీఐజీ కోయ ప్రవీణ్, అప్పటి ఎస్పీ అశోక్‌కుమార్ సమక్షంలోనే విలేకరులతో మాట్లాడుతూ.. హత్యలో బాలిక స్నేహితుడు లోకేష్ ప్రమేయం లేదని హడావుడిగా ప్రకటించారు. అంతటితో ఆగకుండా, “ఈ రోజు సాయంత్రానికే నిందితులను అదుపులోకి తీసుకుంటామని, ఎస్పీ పూర్తి వివరాలు తెలియజేస్తారన్ఙి మీడియాకు వివరించారు. అయితే, సీసీటీవీ ఫుటేజీలలో బాలిక లోకేష్ బైక్‌పై గండికోటకు వెళ్లినట్లు, తిరుగు ప్రయాణంలో లోకేష్ ఒక్కడే వస్తున్నట్లు స్పష్టంగా రికార్డు అయినా.. డిఐజీ స్థాయి అధికారి కేసులో ఎలాంటి పురోగతి లేకుండానే లోకే‹Ùకు క్లీన్‌చిట్ ఇవ్వడం వెనుక ఆంతర్యం ఏమిటనేది ఇప్పటికీ అంతుబట్టడం లేదు.
పరువు హత్య కోణంలోనూ దర్యాప్తు మాయం
ముఖ్య అనుమానితుడు లోకేష్‌కు డీఐజీ క్లీన్ చిట్ ఇవ్వడంతో దర్యాప్తు దృష్టి ఒక్కసారిగా మృతురాలి సమీప బంధువుల వైపు మళ్లింది. స్నేహితుడు హత్య చేయలేదంటే, ఇది కచ్చితంగా బంధువులే చేసిన ‘పరువు హత్య’ అయ్యి ఉంటుందనే కోణంలో విశ్లేషణలు నడిచాయి. పోలీసులు మృతురాలి బంధుగణాన్ని అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణకు బంధువులంతా పూర్తిగా సహకరించినప్పటికీ, అటు వైపు కూడా ఎలాంటి క్లూస్ కానీ, ఆధారాలు కానీ లభ్యం కాలేదని పోలీసులు తేల్చేశారు.
ఇద్దరు ఎస్పీలు మారినా తేలని మిస్టరీ.. జవాబు చెప్పాల్సింది విజనరీ సీఎం
గండికోట మైనర్ బాలిక హత్య కేసును వైఎస్సార్ కడప జిల్లా పోలీసులు ఏడాది దాటినా చేధించలేకపోవడం పోలీసు యంత్రాంగం వైఫల్యానికి అద్దం పడుతోంది. అప్పటి ఎస్పీ అశోక్‌కుమార్‌తో పాటు ప్రస్తుత ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ సైతం ఈ కేసును స్వయంగా పర్యవేక్షించారు. టవర్ లోకేషన్ల ద్వారా ఫోన్‌కాల్స్ విశ్లేషణ, అనుమానిత వాహనదారుల విచారణ వంటి అన్ని సాంకేతిక వ్యవహారాలను ఉపయోగించి దర్యాప్తు చేసినా సంక్లిష్టత అలాగే ఉండిపోయింది.అత్యాధునిక టెక్నాలజీ ఉన్నా ఈ కేసు చేధించలేకపోవడం వెనుక ఉన్న తెరవెనుక రాజకీయ కారణాలు, ఒత్తిళ్లు ఏమిటో ‘విజనరీ సీఎం’ అని చెప్పుకునే చంద్రబాబు సర్కారే తేల్చి చెప్పాలని రాజకీయ విశ్లేషకులు మరియు ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.


