విశాఖపట్నం: రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి లోకే‹Ùకు అత్యంత సన్నిహితుడైన యువ నేత ఆన్‌లైన్ బెట్టింగ్ దందాలో అడ్డంగా దొరికిపోయారు. జీవీఎంసీ 51వ వార్డు టీడీపీ తెలుగు యువత అధ్యక్షుడిగా చెలామణి అవుతున్న పేడాడ మణికంఠ, మంత్రి లోకేష్‌కు అత్యంత ఆప్తుడనే ప్రచారం చేసుకుంటూ బెట్టింగ్ సామ్రాజ్యాన్ని నడుపుతున్నట్లు తెలుస్తోంది.
గత కొద్ది రోజులుగా మణికంఠ తన అనుచరుడు శాంతి స్వరూప్‌తో కలిసి మాధవధార సీతన్న గార్డెన్స్ వేదికగా ఈ ఆన్‌లైన్ జూదాన్ని నిర్వహిస్తున్నారు. దీనిపై పక్కా సమాచారం అందుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు ఆదివారం సాయంత్రం ఆ శిబిరంపై దాడి చేసి వీరిద్దరినీ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వీరు ఆడటంతో పాటు మరో 15 మందితో పెద్ద ఎత్తున బెట్టింగులు ఆడిస్తున్నట్లు విచారణలో తేలినట్లు సమాచారం. దీంతో సోమవారం వీరిద్దరినీ కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం రిమాండ్ విధించింది.
పోలీసుల గోప్యత?
అరెస్ట్ అయిన వ్యక్తి మంత్రి లోకేష్ కు అత్యంత సన్నిహితుడు కావడంతో పోలీసులు ఈ వ్యవహారాన్ని నొక్కిపెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిందితులను రిమాండ్‌కు తరలించినా కూడా వివరాలు బయటకు పొక్కకుండా గుట్టుగా ఉంచడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై పోలీసులను వివరణ అడిగినప్పటికీ వివరాలు చెప్పకుండా తప్పించుకునే ప్రయత్నం చేయడం గమనార్హం.


