కలెక్టర్ అభిషిక్త్ కిశోర్‌కు వినతి పత్రం అందిస్తున్న వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు
సర్వే నం.13లోని ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలు తొలగించాలి
ప్రభుత్వ భూమిని పరిరక్షించాలి
ఆక్రమణలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలి
కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసిన వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు
ఆంధ్రప్రదేశ్, విశాఖపట్నం: విశాఖ ఉత్తర నియోజకవర్గం, 49వ వార్డు మురళీనగర్, కప్పరాడ సర్వే నంబర్ 13లోని ప్రభుత్వ భూమిలో జరుగుతున్న ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కె.కె.రాజు డిమాండ్ చేశారు. నిరుపేద బర్మా కాందిశీకుల పోరాట ఐక్యవేదిక ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట జరిగిన ధర్నాలో ఆయన పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అభిíÙక్త్ కిశోర్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రభుత్వంలో సంక్షేమం, అభివృద్ధి కనిపించకపోగా, ఉత్తరాంధ్రలో విలువైన ప్రభుత్వ భూముల ఆక్రమణలు, కార్పొరేట్లు, రియల్ ఎస్టేట్ వర్గాలకు విలువైన భూములను కట్టబెట్టే పరిస్థితులు నెలకొన్నాయని విమర్శించారు.

తమకు న్యాయం చేయాలని కోరుతూ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేస్తున్న బర్మా కాందిశీకులు
బర్మా కాందిశీకుల స్థలాల ఆక్రమణలు
బర్మా కాందిశీకుల భవిష్యత్తు అవసరాల కోసం ప్రభుత్వం గతంలో కేటాయించిన సుమారు 3 ఎకరాల భూమిని కొందరు ఆక్రమించి అక్రమ నిర్మాణా లు చేపడుతున్నారని ఆరోపించారు. ఆ స్థలాలను రూ.4 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు విక్రయిస్తూ అమాయక ప్రజలను మోసం చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై పలుమార్లు రెవెన్యూ, పోలీ స్ అధికారులకు ఫిర్యాదులు చేసినా ఫలితం లేకపోయిందన్నారు. ఫిర్యాదు చేసిన వారిపైనే బెదిరింపులు, ఒత్తిళ్లు తీసుకొస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అక్రమ నిర్మాణాలు తొలగించాలి
సర్వే నెం.13లోని అన్ని అక్రమ నిర్మాణాలను వెంటనే తొలగించి, ప్రభుత్వ భూమిని పరిరక్షించాలని కలెక్టర్‌ను కోరినట్లు తెలిపారు. భవిష్యత్తులో ఆ భూమిపై ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా అక్కడ నివసిస్తున్న నిజమైన బర్మా కాందిశీకుల అభిప్రాయాన్ని గ్రామసభ ద్వారా తెలుసుకుని, చట్టబద్ధంగా అర్హులైన వారికి మాత్రమే కేటాయించాలని, ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో 49వ వార్డు మాజీ కార్పొరేటర్ అల్లు శంకరరావు, నిరుపేద కాందిశీకుల పోరాట ఐక్యవేదిక ప్రతినిధులు, మహిళలు, యువకులు పాల్గొన్నారు.


