నేను మాజీ మంత్రిని 45 ఏళ్లుగా ఓటు వేస్తున్నా...
నా ఓటు లేకపోవడం విడ్డూరం
చదువు లేనివారి సంగతేంటి?
అడ్మినిస్ట్రేషన్ అస్సలు బాగాలేదు
మాజీ మంత్రి డాక్టర్ శనక్కాయల అరుణ
గుంటూరు వెస్ట్: మాజీ మంత్రి, సీనియర్ సిటిజన్ అయిన తన ఓటే కనబడడంలేదంటూ టీడీపీ మాజీ మంత్రి డాక్టర్ శనక్కాయల అరుణ సోమవారం గుంటూరులోని కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మను కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న సర్ ప్రక్రియపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
విద్యావంతురాలైన తనకే ఇటువంటి ఇబ్బందులు ఏర్పడితే చదువులేని వారి సంగతి ఏంటని ప్రశ్నించారు. 45 ఏళ్లుగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న తన ఓటు కనబడడంలేదని బీఎల్‌ఓ చెప్పడంతోపాటు త్వరలోనే నోటీసులు పంపుతాం వచ్చి హాజరు కావాలని పేర్కొన్నారని వివరించారు. 2002 ముందు ఓటరు కార్డు చూపించినా ఓటు లేదని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.
ఓటు లేదని చెబుతున్న సమయంలో తాను రాష్ట్ర మంత్రిగా పనిచేశానని గుర్తు చేశారు. సర్ ప్రక్రియ దేశ వ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోందన్నారు. అడ్మిని్రస్టేషన్ అసలు బాగాలేదని పెదవివిరిచారు. సర్ ప్రక్రియపై సీఎం చంద్రబాబు దృష్టిసారించాలని డిమాండ్ చేశారు. రాజకీయాలకు అతీతంగా దీనిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని పేర్కొన్నారు. గతంలో ఎన్నికల కమిషనర్‌గా పనిచేసిన టీఎన్ శేషన్ లాంటి వారు తిరిగి రావాలని ఆకాంక్షించారు.


