పల్నాడు కల.. జగన్‌ సాకారం | YS Jagan Govt Efforts Going to Fullfill To Palnadu with Super specialty Hospital | Sakshi
Sakshi News home page

పల్నాడు కల.. జగన్‌ సాకారం

Jul 14 2026 5:45 AM | Updated on Jul 14 2026 5:45 AM

YS Jagan Govt Efforts Going to Fullfill To Palnadu with Super specialty Hospital

100 ఎంబీబీఎస్‌ సీట్లతో పిడుగురాళ్ల మెడికల్‌ కాలేజీ ప్రారంభానికి ఎన్‌ఎంసీ అనుమతి

ఎన్నికల నాటికే మెజార్టీ నిర్మాణ పనులను పూర్తి చేసిన వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం

వెనుకబడిన ప్రాంతంలో పేదలకు చెంతనే సూపర్‌ స్పెషాలిటీ వైద్యం లక్ష్యంగా అడుగులు

చంద్రబాబు గద్దెనెక్కాక వైద్య కళాశాలలపై నీలినీడలు

గత్యంతరం లేని పరిస్థితుల్లో కళాశాల ప్రారంభానికి దరఖాస్తు

సాక్షి, అమరావతి: వెనుకబడిన పల్నాడు ప్రాంత ప్రజలకు ఉచితంగా సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవలను అందించే లక్ష్యంతో గత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం చేసిన కృషి ఫలిస్తోంది. 2026–27 విద్యా సంవత్సరం నుంచి 100 ఎంబీబీఎస్‌ సీట్లతో పిడుగురాళ్ల వైద్య కళాశాల ప్రారంభానికి నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ (ఎన్‌ఎంసీ) అనుమతులు జారీ చేసింది. వైఎస్‌ జగన్‌ పిడుగురాళ్లలో ప్రభుత్వ నూతన వైద్య కళాశాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం కామేపల్లి వద్ద రూ.500 కోట్లతో అధునాత వసతులతో వైద్య కళాశాల, బోధనాస్పత్రి నిర్మాణాన్ని చేపట్టారు. 

గత ప్రభుత్వ ప్రణాళిక ప్రకారం 2025–26 విద్యా సంవత్సరంలోనే 150 ఎంబీబీఎస్‌ సీట్లతో వైద్య కళాశాల ప్రారంభం కావాల్సి ఉంది. కళాశాలకు అనుమతులు రాబట్టాలంటే తొలుత బోధనాస్పత్రి అందుబాటులో ఉండాలి. ఈ నేపథ్యంలో 2024 సార్వత్రిక ఎన్నికల నాటికే బోధనాస్పత్రి నిర్మాణం కూడా పూర్తి చేశారు. మరోవైపు మొదటి ఏడాది ఎంబీబీఎస్‌ విద్యార్థులకు తరగతుల నిర్వహణకు వీలుగా కళాశాల, హాస్టల్స్, ఇతర నిర్మాణాలను దాదాపుగా పూర్తి చేశారు. ప్రాజెక్ట్‌ వ్యయంలో రూ.300 కోట్ల విలువైన పనులు ఎన్నికల నాటికే పూర్తయ్యాయి. ఎన్నికలకు ముందే ఆస్పత్రి భవనాన్ని వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వమే ప్రారంభించింది. అనంతరం ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చింది.

బాబు సర్కార్‌ బ్రేకులు..
ఎన్నికల అనంతరం గద్దెనెక్కిన చంద్రబాబు ప్రభుత్వం కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలను పీపీపీలో ప్రైవేట్‌కు కట్టబెట్టాలని నిర్ణయించారు. దీంతో పిడుగురాళ్ల వైద్య కళాశాల నిర్మాణ పనులకు బ్రేకులు పడ్డాయి. తొలుత ఈ వైద్య కళాశాలను సైతం పీపీపీలో ప్రైవేట్‌కు కట్టబెట్టాలని చంద్రబాబు నిర్ణయించారు. అయితే ఈ కళాశాల నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యం కూడా ఉంది. మరోవైపు కళాశాలలను ప్రైవేట్‌కు కట్టబెట్టడంపై వైఎస్సార్‌సీపీ పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం చేయడంతో పిడుగురాళ్ల వైద్య కళాశాలను ప్రైవేట్‌కు కట్టబెట్టే నిర్ణయాన్ని చంద్రబాబు విరమించుకున్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో ప్రభుత్వ ఆధ్వర్యంలోనే కళాశాల ఏర్పాటుకు 19 నెలల అనంతరం చర్యలు ప్రారంభించారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ కృషిని చంద్రబాబు కొనసాగించి ఉంటే 2024లోనే బోధనాస్పత్రి అభివృద్ధి అయిపోయి, గత విద్యా సంవత్సరంలోనే మన విద్యార్థులకు ఎంబీబీఎస్‌ సీట్లు సమకూరి ఉండేవి.  

చంద్రబాబు చేసింది శూన్యం
వాస్తవ పరిస్థితులను క్షుణ్ణంగా గమనిస్తే పిడుగురాళ్ల వైద్య కళాశాల ప్రారంభం విషయంలో చంద్రబాబు ప్రభుత్వం చేసింది శూన్యమేనని బోధపడుతుంది. వైద్య కళాశాల ఏర్పాటు నిర్ణయం, భూ సేకరణ, టెండర్‌ పిలవడం, పనులు ప్రారంభించడం, మెజార్టీ శాతం పనులు పూర్తి చేయడం.. ఇలా కీలక అడుగులన్నీ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంలోనే పడ్డాయి. మరోవైపు కళాశాల, బోధనాస్పత్రి కోసం పోస్టులను సైతం ఈ ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిందే లేదు. 

గత ప్రభుత్వంలో మార్కాపురం, పులివెందుల, ఆదోని, మదనపల్లె వైద్య కళాశాలలు, బోధనాస్పత్రులకు కొత్తగా మంజూరు చేసిన 837 పోస్టులను చంద్రబాబు ప్రభుత్వం పిడుగురాళ్ల వైద్య కళాశాల, బోధనాస్పత్రికి సర్దుబాటు చేసింది. వాస్తవాలు ఇలా ఉంటే మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చంద్రబాబు ప్రభుత్వం ఘనతే అనే రీతిలో హడావుడి చేస్తుండటం గమనార్హం.

మన విద్యార్థులకు తీరని ద్రోహం..
ప్రభుత్వ కొత్త వైద్య కళాశాలలను ప్రైవేట్‌కు కట్టబెట్టడం కోసం చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రంలోని వేల మంది విద్యార్థులకు తీరని ద్రోహం తలపెట్టింది. మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ ఒకేసారి రాష్ట్రంలో 17 కొత్త వైద్య కళాశాలల నిర్మాణాన్ని చేపట్టారు. వాటిలో పది కాలేజీలను చంద్రబాబు సర్కారు ప్రైవేట్‌కు కట్టబెడుతోంది. పులివెందుల వైద్య కళాశాలకు 50 ఎంబీబీఎస్‌ సీట్లను ఎన్‌ఎంసీ మంజూరు చేయగా, లేఖ రాసి మరీ ఆ అనుమతులను చంద్రబాబు ప్రభుత్వం రద్దు చేయించింది. 

ఇలా పది వైద్య కళాశాలలకు బాబు అడ్డుపడటంతో 2024–25లో 700 ఎంబీబీఎస్‌ సీట్లు, 2025–26లో 1750 చొప్పున మొత్తంగా రెండేళ్లలో 2,450 సీట్లను మన విద్యార్థులు కోల్పోయారు. ఫలితంగా తెలంగాణ విద్యార్థులతో పోలిస్తే నీట్‌లో ఉత్తమ ర్యాంక్‌లు సాధించినప్పటికీ కన్వీనర్‌ కోటాలో సీట్‌ దక్కక నిరుపేద, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మధ్య తరగతి వర్గాలకు చెందిన మన విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారు. వైద్య విద్య కలను చంద్రబాబు సర్కారు ఛిద్రం చేయడంతో వారి జీవిత ఆశయం తలకిందులైంది.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement