2024 మేనిఫెస్టోలో ఉద్యోగులకు టీడీపీ కూటమి ఇచ్చిన హామీలు
చంద్రబాబు వెన్నుపోటుతో ఉద్యోగులు విలవిల!
మాటలన్నీ నీటిమూటలే.. మేనిఫెస్టో పచ్చి మోసం
హామీలు పోతే పోయే.. రెగ్యులర్‌గా రావాల్సిన వాటికీ మంగళం.. బాబు మోసాలకు నిరసనగా గుండు కొట్టించుకున్న ఉద్యోగ సంఘం నేతలు
రెండేళ్లలో ఐదు డీఏలు బంద్.. 24 నెలలుగా రాని ఐఆర్
కొత్త పీఆర్‌సీ లేదు.. సరెండర్ లీవులూ లేవు
రెండేళ్లలో ఉద్యోగులకు జరిగిన నష్టం రూ. 37వేల కోట్లకు పైమాటే
ఒక్కో సాధారణ ఉద్యోగికి రూ.5.15 లక్షలు నష్టం
ఒక్కో హెడ్ కానిస్టేబుల్ కోల్పోయింది రూ.7.03 లక్షలు
చంద్రబాబు తమను నిలువునా మోసం చేశారని నిరసన వ్యక్తం చేస్తున్న ఉద్యోగులు
సాక్షి, అమరావతి: ఎన్నికలకు ముందు అరచేతిలో వైకుంఠం చూపించారు. అలవిమాలిన హామీలిచ్చి అందరినీ బుట్టలో వేసుకున్నారు. ఎన్నికల తర్వాత షరా మామూలే.. హమీలన్నీ తూచ్.. హామీలన్నీ అటకెక్కించడం, మేనిఫెస్టోలు మాయం చేయడం చంద్రబాబుకు ‘వెన్నుపోటు’తో పెట్టిన విద్య. బాబుగారి సూపర్‌సిక్స్, సూపర్ సెవన్ మోసాలకు అన్ని వర్గాలూ లబోదిబోమంటుంటే.. ఉద్యోగులు మాత్రం గుక్కపట్టి మరీ... విలవిల్లాడుతున్నారు.. ఎందుకంటే వారికి ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా రెగ్యులర్‌గా రావాల్సినవి కూడా రాకుండా పోవడంతో.. ఈ రెండేళ్లలో చివరకు తమకు ‘బోడిగుండు’ మిగిలిందని వాపోతున్నారు. ఉద్యోగులకు హక్కుగా రావాల్సిన ఐదు డీఏలు, పీఆర్సీ, ఐఆర్, సరెండర్ లీవులన్నీ నిలిచిపోయాయి.
చంద్రబాబు తమను నిలువునా మోసం చేశారనే ఆవేదనతో ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు, రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు కాకర్ల వెంకట్రామిరెడ్డి సోమవారం అందరిముందు బోడిగుండు గీయించుకుని నిరసన తెలిపారు. ఆయనతోపాటు మరో ఇద్దరు నేతలు బోడిగుండు చేయించుకుని చంద్రబాబు పాలనలో తమకు మిగిలింది ఇదేనని చూపించారు. వారికి గతంలో ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వకపోగా ఎప్పటికప్పుడు పెంచి ఇవ్వాల్సిన వాటికి కూడా చంద్రబాబు ఎగనామం పెట్టారు. ప్రభుత్వ ఉద్యోగులే కాదు పోలీసులు కూడా బాబు గారి బాధితులే. ఈ రెండేళ్లలో ఒక్కో ఉద్యోగి సగటున రూ.5.15 లక్షలు.. ఒక్కో పోలీసు రూ.7 లక్షలకుపైగా నష్టపోయారని లెక్కలు తెలియజేస్తున్నాయి. తమకు ఈ స్థాయిలో నష్టం చేసిన ముఖ్యమంత్రి మరెవరూ లేరని ఉద్యోగులు వ్యాఖ్యానిస్తున్నారు.
పెన్షనర్లకూ భారీ నష్టమే..
జీవితాంతం ప్రభుత్వ సేవలో గడిపిన పెన్షనర్లపైనా సర్కారు కనికరం చూపలేదు. ఈ రెండేళ్లలో ఓపీఎస్ పెన్షనర్లు ఒక్కొక్కరు సుమారు రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు నష్టపోయారు. ఇక సీపీఎస్ ఉద్యోగుల కోసం గత ప్రభుత్వం తీసుకొచ్చిన జీపీఎస్ పెన్షన్ విధానాన్ని అమలు చేయకపోవడంతో ఒక్కో సీపీఎస్ పెన్షనర్ నెలకు రూ.10 వేల చొప్పున రెండేళ్లలో రూ.2.50 లక్షలు కోల్పోయాడు.
రాష్ట్రవ్యాప్తంగా లెక్కిస్తే.. రూ.37 వేల కోట్లకు గండి
రాష్ట్రంలో సుమారు 5.6 లక్షల మంది రెగ్యులర్ ఉద్యోగులు (గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులతో కలిపి), 2 లక్షల మంది కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు, 3.4 లక్షల మందికి పైగా పెన్షనర్లు ఉన్నట్లు ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. ఒక్కో రెగ్యులర్ ఉద్యోగికి సగటున రూ.4–5 లక్షల చొప్పున లెక్కిస్తేనే ఉద్యోగుల నష్టం సుమారు రూ.25 నుంచి రూ.27 వేల కోట్లు. పెన్షనర్ల నష్టం మరో రూ.10 వేల కోట్లు. అంటే చంద్రబాబు రెండేళ్ల పాలనలో ఉద్యోగ, పెన్షనర్ కుటుంబాల నుంచి నిలిపివేసిన సొమ్ము అక్షరాలా రూ.37 వేల కోట్లకు పైమాటే. ఈ సొమ్ము ఉద్యోగుల చేతికి అంది ఉంటే మార్కెట్లో చలామణి అయి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకూ ఊతమిచ్చేది. అంటే ఉద్యోగులకు జరిగిన నష్టం సమాజంలోని అన్నివర్గాలకూ జరిగిన నష్టంగానే భావించాలి.
రెండేళ్లలో ఒక్కో ఉద్యోగికీ రూ.5.15 లక్షలు నష్టం!
పదేళ్ల సర్వీసు, రూ.51,140 మూలవేతనం, 12 శాతం హెచ్‌ఆర్‌ఏతో ఒక ఉద్యోగిని ఉదాహరణగా తీసుకుంటే రెండేళ్లలో అతనికి జరిగిన నష్టం ఇలా ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చాక అతనికి ఐదు డీఏలు పెండింగ్‌లో పడ్డాయి. ఈ ఐదు డీఏల నష్టమే రూ.1,10,480. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పీఆర్సీకి ముందు 27 శాతం మధ్యంతర భృతి ఇచ్చింది. చంద్రబాబు సర్కారు మాత్రం 24 నెలలుగా ఐఆర్ ఊసే ఎత్తడం లేదు. ఆ ఉద్యోగికి రెండేళ్లలో రూ.3,27,013 ఆవిరైంది. దీనికి తోడు రెండేళ్లలో ఇవ్వాల్సిన రెండు ఎర్న్‌డ్ లీవ్ సరెండర్ బిల్లులు రూ.77,967 నిలిచిపోయాయి. మొత్తం నష్టం రూ.5,15,460. ప్రమోషన్ ఇంక్రిమెంట్లు, స్పెషల్ పే, ఏఏఎస్ ఇంక్రిమెంట్లు ఇందులో కలపలేదు. అవి కూడా కలిపితే ఇంకా ఎక్కువ అవుతుంది.
ఖాకీకి మరింత శరాఘాతం..
ప్రజల భద్రత కోసం పండగలు, సెలవులు లేకుండా పనిచేసే పోలీసుల పరిస్థితి మరీ దారుణం. సాధారణ ఉద్యోగులకు రెండేళ్లలో రెండు సరెండర్ లీవులైతే పోలీసులకు ఏడాదికి మూడు చొప్పున ఆరు సరెండర్ లీవ్‌లు ఇవ్వా లి. వాటిని ప్రభుత్వం పూర్తిగా తొక్కిపెట్టింది. అదనంగా వారికి రావాల్సిన 15 టీఏలు (ఒక్కోటి రూ.2,100) కూడా పెండింగ్‌లోనే ఉన్నాయి. రూ.51,140 మూలవేతనం ఉన్న ఒక హెడ్ కానిస్టేబుల్ నష్టం లెక్క ఇదీ..


