ఎక్స్‌గ్రేషియా కుదించి.. బోట్లకు పరిహారం ఎగ్గొట్టి | Chandrababu Govt Neglecting Fisherman | Sakshi
Sakshi News home page

ఎక్స్‌గ్రేషియా కుదించి.. బోట్లకు పరిహారం ఎగ్గొట్టి

Jul 14 2026 5:33 AM | Updated on Jul 14 2026 5:33 AM

Chandrababu Govt Neglecting Fisherman

తమకు ప్రాణప్రదమైన బోట్లను కోల్పోయామని మత్స్యకారుల ఆక్రందన

కారి చిన్నా, మరో 9 మంది మత్స్యకారులను ఆదుకోవడంపై నోరు విప్పని బాబు సర్కార్‌

నాడు బోట్లకు సైతం పరిహారం ఇచ్చి ఆదుకున్న మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 

వైఎస్సార్‌ మత్స్యకార భరోసాతో 5.38 లక్షల మంది గంగపుత్రులకు రూ.538 కోట్ల భృతి 

డీజిల్‌ సబ్సిడీ కింద మరో రూ.148 కోట్ల మేర లబ్ధి...

సాక్షి, అమరావతి: నిత్యం నడిసంద్రంలో జీవనపోరాటం సాగించే గంగపుత్రులను చంద్రబాబు సర్కారు నట్టేట ముంచేసింది! మత్స్యకార కుటుంబాలను ఆదుకోకుండా దగా చేస్తోంది. మృత్యువుతో పోరాడి త్రుటిలో ప్రాణాలు కాపాడుకున్నప్పటికీ.. తమకు ప్రాణప్రదమైన పడవలను కోల్పోయామని ఆక్రోశిస్తున్న మత్స్యకారులను ఆదుకోకుండా మీనమేషాలు లెక్కిస్తోంది. ఆరుగురు సహచరులను కళ్లెదుటే కోల్పోయిన బోటు డ్రైవర్, మత్స్యకారుడు కారి చిన్నా... మరో బోటులో ఒడిశా తీరానికి ప్రాణాలతో చేరుకున్న 9 మంది మత్స్యకారులు.. ప్రాణాలు దక్కించుకున్నా విలువైన బోట్లను కోల్పోయామని విలపిస్తున్నారు.

గల్లంతైన, దెబ్బతిన్న బోట్లకు ప్రభుత్వం పరిహారం ఇచ్చి ఆదుకోవాలని వేడుకుంటున్నారు. రెండేళ్లుగా చంద్రబాబు సర్కారు ఏ ఒక్క బోటుకు పైసా సాయం అందించిన పాపాన పోలేదు. మరోవైపు చనిపోయిన మత్స్యకారుల కుటుంబాలకు సాయం పెంచాల్సింది పోయి సగానికి పైగా కోతలు పెడుతూ పొట్టగొడుతోంది. వేటకు వెళ్లిన ఆరుగురు మత్స్యకారులను రక్షించడంలో ఘోరంగా విఫలమైన చంద్రబాబు ప్రభుత్వం సాయం పంపిణీలోనూ రాజకీయాలు చేస్తూ మత్స్యకారులను తామేదో ఉద్ధరిస్తున్నట్టుగా ప్రచారార్భాటానికి తాపత్రయపడుతోంది.

బోట్లకు సైతం పరిహారం ఇచ్చి ఆదుకున్న వైఎస్‌ జగన్‌ 
తుపానులు లాంటి వైపరీత్యాల వేళ వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలను ఆదుకోవడంతో పాటు వారికి జీవనోపాధి కల్పించే బోట్ల పునర్నిర్మాణానికి సాయం అందించడం చాలా ముఖ్యం. విపత్తుల వేళ గల్లంతైన, ప్రమాదానికి గురైన సందర్భాల్లో ప్రత్యేక బృందాల ద్వారా ఎన్యూమరేషన్‌ చేసి బోట్ల నిర్మాణం, సామర్థ్యాన్ని బట్టి పరిహారాన్ని అంచనా వేస్తారు.

ఆ మేరకు మత్స్యశాఖ ద్వారా ప్రతిపాదనలు సిద్ధం చేసి బోట్ల పునర్నిర్మాణానికి పరిహారం ఇస్తుంటారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ హయాంలో అలా విపత్తుల్లో దెబ్బతిన్న బోట్లకు పూర్తి స్థాయిలో పరిహారం ఇచ్చి ఆదుకున్న ఘటనలు ఎన్నో ఉన్నాయి. 2014–19 మధ్య విపత్తుల వేళ బోట్లు కోల్పోయిన వారికి చంద్రబాబు ప్రభుత్వం ఎగ్గొట్టిన పరిహారంతో పాటు 2019–24 మధ్య ప్రకృతి వైపరీత్యాల్లో గల్లంతైన బోట్లకు సంబంధించి దాదాపు రూ.1.80 కోట్ల సాయం అందించారు.

2023లో విశాఖ హార్బర్‌లో సంభ­వించిన అగ్నిప్రమాదంలో దాదాపు 49 బోట్లు కాలి బూడిదైపోగా ఒక్కో బోటుకు పరిహారం కింద రూ.25 లక్షల నుంచి రూ.39 లక్షల వరకు పరిహారం అందించి ఆదుకున్నారు. అంతేకాదు.. వాటిపై ఆధారపడి జీవించే  400 మందికి ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున సాయం అందించారు. ఈ ఒక్క ఘటనలోనే దాదాపు రూ.7.11 కోట్ల మేర పరిహారం ఇచ్చి మత్స్యకారులకు అండగా నిలిచారు. వేటకు పనికిరాని బోట్లకు సైతం రూ.15 లక్షల చొప్పున పరిహారం చెల్లించి ఆదుకున్నారు.

పరిహారం రూ.10 లక్షలకు పెంచి...
ప్రమాదవశాత్తు మృతి చెందే మత్స్యకార కుటుంబాలకు ఇచ్చే పరిహారాన్ని ఎన్నికల హామీ మేరకు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం రూ.5 లక్షలనుంచి రూ.10 లక్షలకు పెంచింది. నాడు ఐదేళ్లలో అలాంటి ఘటనల్లో క్షణం ఆలస్యం చేయకుండా బాధిత కుటుంబాలకు పరిహారం అందించి అండగా నిలిచారు. 2014–19 మధ్య చంద్రబాబు ప్రభుత్వం ఎగ్గొట్టిన పరిహారంతో సహా 175 మంది మత్స్యకార కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున మొత్తం రూ.17.50 కోట్ల మేర పరిహారాన్ని అందించి మత్స్యకారుల పట్ల తమ చిత్తశుద్ధిని చాటుకున్నారు.

మరొక వైపు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 2019లో వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చిరాగానే వేట నిషేధ భృతిని రూ.4వేల నుంచి రూ.10 వేలకు పెంచడమే కాదు.. డీజిల్‌ సబ్సిడీని రూ.6.03 నుంచి రూ.9లకు పెంచారు. వైఎస్సార్‌ మత్స్యకార భరోసా కింద 5.38 లక్షల మంది గంగపుత్రులకు రూ.538 కోట్ల వేట నిషేధ భృతితో పాటు డీజిల్‌ సబ్సిడీ కింద రూ.148 కోట్ల మేర లబ్ధి చేకూరింది. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో పైపులైన్‌ నిర్మాణం వలన జీవనోపాధి కోల్పోయిన 16,554 మంది మత్స్యకార కుటుంబాలకు రూ.78.22 కోట్లు, ఓఎన్జీసీ పైపులైన్‌ తవ్వకాల వల్ల ఉపాధి దెబ్బతిన్న 23,458 మంది మత్స్యకార కుటుంబాలకు రూ.647.44 కోట్ల సాయాన్ని అందించింది. ఐదేళ్లలో 50 ఏళ్లు నిండిన 69,741 మంది మత్స్యకారులకు సామాజిక పింఛన్ల రూపంలో రూ.759.47 కోట్లు లబ్ధి చేకూర్చారు.

నష్ట పరిహారం కుదించి.. సాయం ఎగ్గొట్టి
వేటకు వెళ్లి దురదృష్టవశాత్తూ మృతి చెందిన మత్స్యకారులకు వైఎస్‌ జగన్‌ హయాంలో ఇచ్చిన రూ.10 లక్షల పరిహారాన్ని చంద్రబాబు ప్రభుత్వం రూ.5 లక్షలకు కుదించింది. 63 క్లెయిమ్‌లకు సంబంధించి రూ.10 లక్షల చొప్పున రూ.6.30 కోట్లు జమ చేయాల్సి ఉండగా చంద్రబాబు ప్రభుత్వం రూ.5 లక్షలకు కోత వేసి రూ.3.15 కోట్లకు సరిపెట్టింది. ఈ రెండేళ్లలో వేటకు వెళ్లి 160 మంది మృతి చెందినట్టు నిర్ధారించగా కేవలం 113 మందికి రూ.5లక్షల చొప్పున రూ.5.65 కోట్ల ప్రతిపాదనలతో సరిపెట్టారు.

వేట నిషేధ భృతి కింద ఇస్తామన్న రూ.20 వేలు తొలి ఏడాది ఎగ్గొట్టారు. సామాజిక పింఛన్లలో కోతపెట్టి 68,632 మందికి కుదించారు. ఇలా అన్ని విధాలుగా మత్స్యకారులను వంచించిన చంద్రబాబు ప్రభుత్వం విశాఖ ఘటనపై స్పందించిన తీరు పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తడంతో మత్స్యశాఖ నుంచి రూ.5 లక్షలు, సీఎం రిలీఫ్‌ ఫండ్‌ నుంచి రూ.5 లక్షల చొప్పున పరిహారం ఇస్తున్నట్టుగా ప్రకటించారు. కానీ వైఎస్‌ జగన్‌ హయాంలో నేరుగా మత్స్యశాఖ నుంచే పరిహారం ఇచ్చేవారని మత్స్యకారులు గుర్తు చేసుకుంటున్నారు. రెండేళ్లలో మృతి చెందిన వారికి రూ.10 లక్షల చొప్పున ఎందుకు సాయం ఇవ్వడంలేదని వారు ప్రశ్నిస్తున్నారు.

బోట్లకు పరిహారంపై నోరుమెదపని బాబు సర్కారు
అధికారంలోకి వచ్చింది మొదలు ఆక్వా రైతులతో పాటు మత్స్యకారులను ముప్పుతిప్పలు పెడుతున్న చంద్రబాబు ప్రభుత్వం సాయంలోనూ కోతలు పెడుతోంది. 2024 ఎన్నికల వేళ కాకినాడ ఫిషింగ్‌ హార్బర్‌లో ఓ బోటు అగ్ని ప్రమాదానికి గురికాగా దాదాపు రూ.50 లక్షల విలువైన ఈ బోటుకు పరిహారం కోసం నాడు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఎన్నికల కోడ్‌ ఎత్తివేసిన తర్వాత చెల్లించాల్సిన పరిహారం రెండేళ్లు గడిచినా బాబు సర్కార్‌ చెల్లించలేదు. అంతేకాదు ఈ రెండేళ్లలో దాదాపు 20కిపైగా బోట్లు వివిధ వైపరీత్యాల్లో దెబ్బతిన్నా ఏ ఒక్క బోటుకు పైసా పరిహారం చెల్లించిన పాపానపోలేదు.

తాజాగా విశాఖ ఘటనలో మృత్యుంజయుడుగా బయటపడిన కారే చిన్నాకు సాయం చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వానికి మనసు రావడం లేదు. సహచర మత్స్యకారులను పోగొట్టుకున్న చిన్నాకు చెందిన దాదాపు రూ.50 లక్షల కుపైగా విలువైన బోటు ఈ ప్రమాదంలో గల్లంతైంది. ఆర్థికంగా కుదేలైన చిన్నాకు జీవనోపాధి లేకుండా పోయింది. మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు, అధికారులు పరామర్శల పేరుతో పబ్లిసిటీ చేసుకుంటున్నా చిన్నాను ఆదుకునే విషయంలో మాత్రం నోరుమెదపడం లేదు. జీవనాధారమైన బోటు పోయిందని, ఆర్థికంగా ఆదుకోవాలని వేడుకుంటున్నా ప్రభుత్వం తమకేమీ పట్టనట్టుగానే వ్యవహరిస్తోంది.

మత్స్యకారులంటే బాబుకు చిన్నచూపు 
మత్స్యకారులంటే చంద్రబాబుకు చిన్నచూపు. ఇలాంటి విపత్తు వేళ ఉదారంగా ఆదుకోవాల్సింది పోయి ఏ విధంగా సాయం ఎగ్గొడదామా? అని చూస్తున్నారు. కారే చిన్నాతో పాటు ఒడిశా తీరానికి చేరుకున్న తొమ్మిది మంది మత్స్యకారులకు కూడా ఆర్ధిక సాయం అందించాలి. గల్లంతైన, పూర్తిగా దెబ్బతిన్న బోట్ల పునర్నిర్మాణం కోసం తక్షణమే రూ.50 లక్షల చొప్పున పరిహారం ఇచ్చి ప్రభుత్వం చిత్తశుద్ధిని చాటుకోవాలి.  – వాసుపల్లి గణేష్‌ కుమార్, మాజీ ఎమ్మెల్యే, 

వంచించడమే లక్ష్యం 
విశాఖ ఘటనలో ఈ ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. సర్కారు అలక్ష్యం వల్లే ఆరుగురు మత్స్యకారులు మృత్యువాత పడ్డారు. బోటు కోల్పోయి ఆర్థికంగా కుదేలైన చిన్నాను ఆదుకోవాలి. బోటుకు రూ.50 లక్షల పరిహారం చెల్లించాలి. వైఎస్‌ జగన్‌ హయాంలో రూ.10 లక్షల పరిహారం ఇస్తే చంద్రబాబు ప్రభుత్వం రూ.5 లక్షలకు కుదించింది. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రెండేళ్లలో చనిపోయిన, గల్లంతైన మత్స్యకారులందరికి రూ.10 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలి. 
– వాసుపల్లి జానకీరామ్, ఈస్ట్‌కోస్ట్‌ మెకనైజ్డ్‌ ఫిషింగ్‌ బోటు ఓనర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement