బోటు ప్రమాదంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలను పరామర్శించనున్న మాజీ సీఎం
సాక్షి, అమరావతి: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఇటీవల విశాఖ తీరంలో జరిగిన బోటు ప్రమాదంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలను ఆయన పరామర్శించనున్నారు. అదే ప్రమాదంలో మృత్యువుతో పోరాడి ప్రాణాపాయం నుంచి బయటపడిన కారి చిన్నాను కూడా వైఎస్ జగన్ పరామర్శించి, ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకోనున్నారు. బోటు ప్రమాద బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని ఇప్పటికే వైఎస్సార్‌సీపీ నాయకులను వైఎస్ జగన్ ఆదేశించారు. ఈ విషాద ఘటనపై ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటూ బాధితులకు న్యాయం జరిగేలా కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబాలను నేరుగా వైఎస్ జగన్ పరామర్శించి వారికి ధైర్యం చెప్పనున్నారు.
విశాఖ పర్యటన షెడ్యూల్ ఇలా..
వైఎస్ జగన్ మంగళవారం ఉదయం 9.30 గంటలకు తాడేపల్లిలోని నివాసం నుంచి బయలుదేరుతారు. విశాఖపట్నం చేరుకున్న అనంతరం జబ్బార్ తోటలో బాధిత మత్స్యకారుల కుటుంబాలను పరామర్శిస్తారు. అనంతరం ప్రమాదం నుంచి బయటపడిన కారి చిన్నాను పరామర్శించి దుర్ఘటన జరిగిన తీరు గురించి వివరాలు తెలుసుకుంటారు. అనంతరం తిరిగి తాడేపల్లికి తిరుగు ప్రయాణం అవుతారు.
రేపు భీమవరానికి వైఎస్ జగన్
ఆక్వా రైతులకు పరామర్శ
సాక్షి, అమరావతి: వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో పర్యటించనున్నారు. రాష్ట్రంలో ఆక్వా రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆక్వా రైతుల సమస్యలను నేరుగా తెలుసుకుని వారికి అండగా నిలిచేందుకు వైఎస్ జగన్ భీమవరం వెళుతున్నారు. ఆక్వా రంగంలో నెలకొన్న సంక్షోభ పరిస్థితులపై రైతులతో ఆయన ముఖాముఖి చర్చిస్తారు. రైతుల సమస్యలను, నష్టాలను ప్రత్యక్షంగా తెలుసుకుని అండగా నిలుస్తామని భరోసా ఇవ్వనున్నారు. ఆక్వా రైతులు ఎదుర్కొంటున్న కష్టాలను చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమని ఇప్పటికే పలుమార్లు ఆందోళన వ్యక్తం చేసిన వైఎస్ జగన్... ఈ పర్యటన ద్వారా రైతుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని వారి తరఫున పోరాటాన్ని మరింత ఉధృతం చేయనున్నారు.


