చివరి 4 రోజుల్లో 25% డిజిటలైజేషన్
70% చేయడానికి 26 రోజులు తీసుకున్న సిబ్బంది
ఫారాలు ఇవ్వనివారిని దొరకని లిస్ట్‌లో చేర్పు
ఎన్యూమరేషన్ ఫారాలు ఇవ్వని వారిని దొరకని లిస్ట్‌లో చేర్పు
అర్ధరాత్రులు కూర్చొని మరీ డిజిటలైజేషన్ పూర్తి చేయాలని ఉద్యోగులపై ఎన్నికల సంఘం ఒత్తిడి
దీంతో ఒక రోజు ముందుగానే 13కు పైగా జిల్లాల్లో ముగిసిన ‘సర్’
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) మొక్కుబడిగా జరుగుతోంది. చివరి 4 రోజుల్లోనే రికార్డు స్థాయిలో 25% అంటే 1,01,63,279 మంది ఓటర్ల వివరాలను సేకరించి డిజిటలైజేషన్ చేసినట్లు ఎన్నికల సంఘం ప్రకటించిన అధికారిక గణాంకాలే దీనికి నిదర్శనం. ‘సర్’లో 46,397 మంది బీఎల్‌వోలు పాల్గొనగా వీరంతా జూన్15 నుంచి జూలై 9 వరకు సగటున రోజుకు 12,30,757 ఓటర్ల వివరాలను డిజిటలైజ్ చేస్తే..చివరి 4 రోజుల్లో ఏకంగా రోజుకు 25,40,819 ఓట్ల వివరాలు చేసినట్లు ఎన్నికల సంఘం తెలిపింది.
అంటే ఒక బీఎల్‌వో గడిచిన 25 రోజులుగా సగటున 26.52 మంది ఓటర్ల వివరాలను సేకరించగలిగితే..చివరి 4 రోజుల్లో ఏకంగా 54.76 మంది వివరాలను సేకరించారన్నమాట. దీనిబట్టి చూస్తే ‘సర్’ ప్రక్రియ చివర్లో ఎంత మొక్కుబడిగా పూర్తి చేస్తున్నారో ఇట్టే అర్థమైపోతుంది. కాగా, సోమవారం సాయంత్రం 4 గంటలకు వరకు రాష్ట్రంలో 4,16,27,694 ఓటర్లలో 4,09,32,211 ఓటర్ల వివరాలను డిజిటలైజ్ చేసినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్‌యాదవ్ చెప్పారు. ఇక 6.95 లక్షల మంది ఓటర్ల వివరాలే తెలియాల్సి ఉందని చెప్పారు.
విన్నవించినా... వినిపించుకోని ఎన్నికల సంఘం
జూన్ 14లోగా ‘సర్’ ప్రక్రియను ముగించాలని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. అనేక మంది కలెక్టర్లు క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను వీడియో కాన్ఫెరెన్స్‌ల ద్వారా వివరించి గడువు పెంచమని అడగ్గా..ఒడిశా వంటి వెనకబడిన రాష్ట్రాల్లోనే పెంచలేదు ఇక్కడ ఎందుకు పెంచుతాం? ఎట్టి పరిస్థితుల్లోనూ 14లోగా ‘సర్’ ముగించాల్సిందే అంటూ హుకుం జారీ చేసింది.
దీంతో కలెక్టర్లు కింది స్థాయి ఉద్యోగులపై ఒత్తిడి తీసుకువచ్చి ఇంకా ఇవ్వని ఎన్యుమరేషన్ ఫారాలను చిరునామా దొరకని వాటిగా చూపిస్తూ రికార్డులను క్లోజ్ చేయాలంటూ అర్థరాత్రులు వరకు ఆఫీసుల్లో కూర్చొబెట్టి మరీ ‘సర్’ ప్రక్రియను పూర్తి చేయించారు. ఇందుకోసం ప్రత్యేక సిబ్బందిని నియమించి మరీ డిజిటలైజేషన్‌ను పూర్తి చేసినట్లు పలువురు అధికారులు తెలిపారు. వాప్తవానికి ఈ నెల 14(మంగళవారం)తో సర్ ప్రక్రియలో భాగంగా ఇంటింటిసర్వే ముగియ నుంది. అయితే ఒక రోజు ముందుగానే 13కుపైగా జిల్లాల్లో ఈ ప్రక్రియ ముగియడం గమనార్హం. జూన్ 5వ తేదీ ముందున 2002 ఓటర్ల జాబితాతో 80% (3.75 కోట్ల ఓట్లు) మ్యాపింగ్ అయినట్లు ఎన్నికల సంఘం అధికారులు ప్రకటించారు. ఇప్పుడు ఇంటింటి సర్వేలో కనీసం ఆ ఓటర్ల వివరాలను తెలుసుకోవడంలో కూడా బీఎల్‌వోలు విఫలమయ్యారంటే రాష్ట్రంలో సర్ ప్రక్రియ ఎంత ఘోరంగా నడిచిందో తెలుస్తోందని ఓ అధికారి వ్యాఖ్యానించారు.


