బంధం ముగిస్తే సరిపోదా?.. బలి ఎందుకు? | Why Are Relationships Ending In Murder Instead Of Breakups, Know About The Dark Side Of Modern Relationships | Sakshi
Sakshi News home page

బంధం ముగిస్తే సరిపోదా?.. బలి ఎందుకు?

Jun 24 2026 9:02 AM | Updated on Jul 3 2026 2:11 PM

Why Are Relationships Ending in Murder Instead of Breakups

ఒకప్పుడు ప్రేమ విఫలమైతే దూరమయ్యేవారు. పెళ్లి బంధం సరిగా సాగకపోతే విడాకులు తీసుకునేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపిస్తుందా?. ప్రేమించిన వారినే హత్య చేయడం, జీవిత భాగస్వామిని అంతమొందించడం, సంబంధానికి అడ్డుగా ఉన్నారని ప్రాణాలు తీయడం వంటి ఘటనలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అసలు బంధాలు ‘బ్రేక్’ అవ్వడం కాకుండా ఎందుకు బలైపోతున్నాయి?. కాస్త లోతుల్లోకి వెళ్తే..

మేఘాలయ హనీమూన్ కేసునే పరిశీలిద్దాం. ఇండోర్‌కు చెందిన జంట.. హనీమూన్‌కు వెళ్లింది. దంపతులు మిస్‌ కావడం.. ఆ తర్వాత నాటకీయ పరిణామాలు.. భర్త చనిపోవం.. భార్య దీనావస్థలో రోడ్డు మీద కనిపించడం.. చివరకు భార్య&ప్రియుడి చేతిలోనే హత్యకు గురవడం తీవ్ర సంచలనం రేపింది. మరోవైపు ఇటు తెలంగాణలో సంచలనం సృష్టించిన సర్వేయర్ హత్య కేసులోనూ వివాహేతర సంబంధాల కోణం ప్రధానంగా చర్చకు వచ్చింది. 

అటు.. ఉత్తరప్రదేశ్‌లో వెలుగులోకి వచ్చిన మీరట్ "బ్లూ డ్రం" కేసులో భార్య, ఆమె ప్రియుడు కలిసి భర్తను హత్య చేశారనే ఆరోపణలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. తాజాగా పుణెలో పెళ్లికి సిద్ధమవుతున్న కేతన్ అగర్వాల్‌ ప్రమాదవశాత్తూ చనిపోలేదని.. అది హత్య అని తేలడం సంచలనం సృష్టించింది.  ఫొటోషూట్ పేరుతో ఓ కోటకు తీసుకెళ్లి కాబోయే వధువు, ఆమె ప్రియుడే అతన్ని దారుణంగా హత్య చేయడం కలకలం రేపింది.

ఈ ఘటనల్లో పరిస్థితులు, వ్యక్తులు, ప్రాంతాలు వేర్వేరుగా ఉన్నప్పటికీ.. ఒక ఉమ్మడి అంశం కనిపిస్తోందని మానసిక నిపుణులు చెబుతున్నారు. అదే.. సంబంధాన్ని ముగించడం కంటే వ్యక్తినే శాశ్వతంగా తొలగించాలనే ప్రమాదకర ఆలోచన.

మనస్తత్వ నిపుణుల ప్రకారం.. నేటి కాలంలో కొందరు ప్రేమను పరస్పర గౌరవంతో కూడిన బంధంగా కాకుండా, స్వాధీన భావంతో చూస్తున్నారు. నువ్వు నాకే చెందాలి.. లేదంటే ఎవరికీ దక్కకూడదు అనే ఆలోచన తీవ్ర స్థాయికి చేరినప్పుడు హింసాత్మక ధోరణులు పెరిగే ప్రమాదం ఉంటుందని వారు హెచ్చరిస్తున్నారు.

అలాగే, తిరస్కరణను అంగీకరించలేకపోవడం కూడా కీలక కారణమని నిపుణులు చెబుతున్నారు. సంబంధం కొనసాగకపోతే విడిపోవడం, చట్టబద్ధంగా విడాకులు తీసుకోవడం వంటి మార్గాలు ఉన్నప్పటికీ, కొందరు వాటిని పరాజయంగా భావిస్తున్నారని అంటున్నారు. పరువు పోతుందనే భయం, ఆర్థిక ప్రయోజనాలు కోల్పోతామనే ఆందోళన, కుటుంబమో.. సమాజమో ఏమనుకుంటుందో అనే ఒత్తిడి కొందరిని తీవ్ర నిర్ణయాల వైపు నెడుతున్నాయని విశ్లేషిస్తున్నారు.

మరోవైపు సోషల్ మీడియా ప్రభావం కూడా సంబంధాలపై పడుతోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సోషల్ మీడియాలో కనిపించే పర్ఫెక్ట్ రిలేషన్‌షిప్ చిత్రాలతో తమ బంధాలను పోల్చుకోవడం, చిన్న చిన్న విభేదాలను కూడా పెద్ద సమస్యలుగా భావించడం వల్ల అసహనం పెరుగుతోందని చెబుతున్నారు. భావోద్వేగాలను నియంత్రించుకోలేకపోవడం, కోపాన్ని ఆరోగ్యకరంగా వ్యక్తం చేయలేకపోవడం, కౌన్సెలింగ్ తీసుకోవడంపై ఇప్పటికీ ఉన్న అపోహలు కూడా సమస్యను మరింత తీవ్రమం చేస్తున్నాయని పేర్కొంటున్నారు.

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఏ బంధంలోనైనా విభేదాలు సహజం. అయితే సంభాషణ, కుటుంబ సభ్యుల సహకారం, అవసరమైతే కౌన్సెలింగ్ ద్వారా చాలా సమస్యలను పరిష్కరించవచ్చు. బంధం కొనసాగించడం సాధ్యం కాకపోతే విడిపోవడం కూడా ఒక మార్గమే. కానీ ప్రాణాలు తీయడం ఎప్పటికీ పరిష్కారం కాదని వారు స్పష్టం చేస్తున్నారు.

వరుసగా వెలుగులోకి వస్తున్న ఈ ఘటనలు ఒక స్పష్టమైన సందేశాన్ని ఇస్తున్నాయి. ప్రేమ అనేది స్వాధీనం కాదు, బాధ్యత. బంధం అనేది నియంత్రణ కాదు, పరస్పర గౌరవం. ఆ గౌరవం, నమ్మకం కోల్పోయినప్పుడు బంధాలు బలహీనపడతాయి. కానీ ఏ పరిస్థితుల్లోనూ ఒకరి ప్రాణాన్ని తీసే హక్కు మరొకరికి లేదన్న విషయాన్ని సమాజం మరచిపోకూడదు.

::వెబ్‌ ప్రత్యేకం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement