అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య నిర్వహించిన నీట్-యూజీ రీ-ఎగ్జామ్‌లో భారీ కుంభకోణం వెలుగుచూసింది. అభ్యర్థులకు బదులుగా వేరొకరు పరీక్ష రాస్తూ పట్టుబడిన వ్యవహారాలు సంచలనంగా మారాయి. ఘటనపై అధికారులు సమగ్ర దర్యాప్తు చేపట్టగా, ఒక్క బీహార్‌లోనే ఇప్పటివరకు 30 మందిని అరెస్ట్ చేశారు. ఈ మోసం వెనుక ఉన్న అసలు సూత్రధారులు, నెట్‌వర్క్‌ను గుర్తించే పనిలో దర్యాప్తు సంస్థలు నిమగ్నమయ్యాయి.
బిహార్‌లో నీట్ రీటెస్ట్-2026 సందర్భంగా భారీ అక్రమాలు వెలుగు చూశాయి. పరీక్ష రాస్తున్న వారి స్థానంలో ఇతరులు హాజరయ్యిన ఘటనలు బయటపడటంతో అధికారులు పెద్ద ఎత్తున తనిఖీలు చేపట్టారు. ఈ దాడుల్లో మొత్తం 30 మంది అరెస్టు కాగా, అందులో 9 మంది నకిలీ అభ్యర్థులుగా పరీక్ష రాస్తూ పట్టుబడటం కలకలం రేపింది. లఖిసరాయ్ జిల్లాలో పలు పరీక్ష కేంద్రాల్లో జరిగిన తనిఖీల్లో ఈ మోసం బయటపడింది.
కేఆర్‌కే హైస్కూల్ పరీక్ష కేంద్రం నుంచి ఒకరు, కేంద్రీయ విద్యాలయం నుంచి ఏడుగురు, హసన్‌పూర్ స్కూల్ నుంచి మరో వ్యక్తి.. నకిలీగా పరీక్ష రాస్తూ పట్టుబడ్డారు. వీరంతా వేరే అభ్యర్థుల స్థానంలో పరీక్షకు హాజరైనట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ ఘటనతో పాటు మరో 21 మందిని కూడా అనుమానితులుగా అరెస్టు చేశారు. వీరి పాత్ర ఈ మోసపూరిత నెట్‌వర్క్‌లో ఉందా? అనే కోణంలో అధికారులు లోతుగా విచారణ చేస్తున్నారు. మొత్తం అరెస్టుల సంఖ్య 30కి చేరగా.. ఆ సంఖ్య పెరగొచ్చని అధికారులు చెబుతున్నారు.
అరెస్టయిన వారిని ఎస్డీఎం ప్రభాకర్ కుమార్, ఎస్డీపీవో శివమ్ కుమార్ పర్యవేక్షణలో ప్రశ్నిస్తున్నారు. విచారణలో వెలుగులోకి వస్తున్న సమాచారం ఆధారంగా ప్రత్యేక పోలీసు బృందాలు సంబంధిత ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నాయి. ఈ మోసానికి వెనుక పెద్ద నెట్‌వర్క్ ఉండొచ్చని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
లఖిసరాయ్ జిల్లా మేజిస్ట్రేట్ శైలేంద్ర కుమార్, ఎస్పీ ప్రేరణ కుమార్ ఈ కేసు విచారణను స్వయంగా పర్యవేక్షిస్తున్నారని అధికారులు తెలిపారు. మరింత మంది ఈ రాకెట్‌లో భాగమై ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
దేశవ్యాప్తంగా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే NEET పరీక్షలో ఇలాంటి మోసాలు వెలుగులోకి రావడం ఆందోళన కలిగిస్తోంది. పూర్తి నెట్‌వర్క్‌ను బయటకు తీసేందుకు విచారణ కొనసాగుతుండగా, మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై పరీక్ష నిర్వహణ సంస్థ ఎన్‌టీఏ స్పందించాల్సి ఉంది.


