కర్ణాటకలో ఒక వింత ఘటన కాదు కాదు దారుణ ఘటన చోటు చేసుకుంది. తుమకూరు జిల్లాలో శనివారం ఒక కారు పేలి మంటలు అంటుకున్నాయి. దీంతో 30 ఏళ్ల వ్యక్తి సజీవ దహనమయ్యాడు. అసలు ఆ కారు ఎందుకు పేలింది. చనిపోయిన వ్యక్తి ఎవరు? ఈ విషయాలు తెలిస్తే విస్తుపోవడం మీ వంతు అవుతుంది. ఏమైంది అంటే...
కారు పేలిన ఘటనలో చనిపోయిన వ్యక్తిని నాగేంద్ర (30)గా గుర్తించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. నాగేంద్ర బెంగళూరులో ఒక కారును బుక్ చేసుకున్నాడు.రమ్య ఉల్లాస్ (23)తో కలిసి ఈ కారులో ప్రయాణం మొదలు పెట్టాడు. డ్రైవర్ ఇచ్చిన ప్రాథమిక స్టేట్‌మెంట్ ప్రకారం, వీరిద్దరూ బెంగళూరులో కారు ఎక్కి అంకోలా వైపు బయలుదేరారు. కారు తుమకూరు సమీప ప్రాంతానికి చేరుకోగానే వారిద్దరి మధ్య తీవ్రమైన వాగ్వాదం మొదలైంది.ఈ గొడవ జరుగుతుండగా, నాగేంద్ర కత్తితో రమ్యపై దాడి చేసి పొడిచాడు. దాంతో తీవ్ర భయాందోళనకు గురైన రమ్య.. నాగేంద్ర వద్ద బాంబు ఉందని గట్టిగా అరుస్తూ డ్రైవర్‌ను హెచ్చరించింది. గాయాలపాలైనప్పటికీ, ఆమె ఎలాగోలా కారులోంచి బయటకు దూకేసింది.అది గమనించిన డ్రైవర్ ప్రవీణ్ వెంటనే కారును రోడ్డు పక్కన ఆపి, తాను కూడా బయటకు పరుగులు తీశాడు.
ఇదీ చదవండి: ఐటీ ఉద్యోగం పోయింది : నేడు రోజుకు రూ. 50 వేల టర్నోవర్
రమ్య, డ్రైవర్ ఇద్దరూ బయటకు దూకేసిన తర్వాత..నాగేంద్ర కారు డోర్లను లోపలి నుండి లాక్ చేసుకుని, తనతో పాటు తెచ్చుకున్న నాటు బాంబును పేల్చేసుకున్నాడు. ఈ పేలుడు తీవ్రతకు కారు పూర్తిగా తగలబడిపోయింది, నాగేంద్ర లోపలే సజీవ దహనమయ్యాడు. ఈ ప్రమాదంలో డ్రైవర్ ప్రవీణ్‌కు కూడా గాయాలయ్యాయి. గాయపడిన యువతి రమ్య ఉత్తర కన్నడ జిల్లా నివాసి.బెంగళూరులోని సంజయ్ గాంధీ ఆసుపత్రిలో ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్‌గా పనిచేస్తోంది. ఈ దాడిలో గాడయపడిన రమ్య,ప్రస్తుతం తుమకూరు జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
పోలీసుల దర్యాప్తు
స్థానికుల సమాచారం మేరకు తుమకూరు జిల్లా ఎస్పీ అశోక్‌తో పాటు ఇతర ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ దాడి వెనుక ఉన్న అసలు కారణాలు ఏంటి? నాగేంద్ర అంతటి ఘాతుకానికి ఒడిగట్టడానికి దారితీసిన పరిస్థితులు ఏంటి? అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. అసలు ఈ పేలుడు ఎలా జరిగింది? అతను వాడిన పేలుడు పదార్థం ఎలాంటిది? అనే విషయాలను నిర్ధారించడానికి ఫోరెన్సిక్ నిపుణులు ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు.
ఇదీ చదవండి: 30 ఏళ్ల నమ్మకం ఖరీదు రూ. 97 లక్షలు : నట్టేట ముంచేశాడు


