
ఢిల్లీలో ‘ఇండియా’ కూటమి ఎంపీల నిరసన ర్యాలీ
పార్లమెంట్ నుంచి ఈసీ కార్యాలయానికి బయలుదేరిన విపక్ష నేతలు
ర్యాలీకి అనుమతి లేదంటూ మధ్యలోనే అడ్డుకొని అరెస్టు చేసిన పోలీసులు
న్యూఢిల్లీ: బిహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ(ఎస్‌ఐఆర్)తోపాటు దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాల్లో అక్రమాలు, ఓట్ల చోరీ, గత లోక్‌సభ ఎన్నికల్లో రిగ్గింగ్‌పై విపక్ష ‘ఇండియా’ కూటమి పోరుబాట పట్టింది. ఓట్ల చోరీని వెంటనే ఆపాలని, ‘ఒక్కరికి ఒక ఓటు’ అనే విధానాన్ని పక్కాగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాం«దీ, ప్రియాంక గాంధీ సహా ప్రతిపక్ష ఎంపీలు సోమవారం దేశ రాజధానిలో ప్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శిస్తూ భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు.
తెల్లటోపీలు ధరించి పార్లమెంట్ మకరద్వారం నుంచి కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయానికి బయలుదేరిన ‘ఇండియా’ కూటమి ఎంపీలను పోలీసులు మధ్యలోనే అడ్డుకున్నారు. ఈ సందర్భంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ర్యాలీకి అనుమతి లేదంటూ పీటీఐ భవనం ఎదుట పోలీసులు ఏర్పాటు చేసిన బారీకేడ్లను పక్కకు తొలగించేందుకు ఎంపీలు ప్రయత్నించారు.
కేవలం 30 మందిని అనుమతిస్తామని పోలీసులు చెప్పగా, ఎంపీలు అంగీకరించలేదు. ఎన్నికల సంఘానికి విజ్ఞాపన పత్రం అందజేయడానికి శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తున్న తమను అడ్డుకోవడం ఏమిటని మండిపడ్డారు. కొందరు రోడ్డుపై బైఠాయించి, ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా బిగ్గరగా నినాదాలు చేశారు. ప్రజాస్వామ్యాన్ని హత్య చయడం ఆపాలన్నారు.
మహిళా ఎంపీలు మహువా మొయిత్రా, సాగరికా ఘోష్, సుస్మితా దేవ్, సంజనా జాతవ్, జోతిమణితోపాటు సమాజ్‌వాదీ పార్టీ సభ్యుడు అఖిలేష్ యాదవ్ బారీకేడ్లపైకి ఎక్కారు. ఎన్నికల సంఘం తీరుపై నిప్పులు చెరిగారు. నినాదాలతో హోరెత్తించారు. ఈ గందరగోళం మధ్య మహిళా ఎంపీలు మహువా మొయిత్రా, మితాలీ బేగ్ స్పృహ తప్పిపడిపోగా, రాహుల్ గాంధీ వారికి సపర్యలు చేశారు. తర్వాత పోలీసులు నిరసనకారులను బస్సుల్లోకి ఎక్కించి, పార్లమెంట్ స్ట్రీట్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. రెండు గంటల తర్వాత వారందరినీ విడుదల చేశారు.
రాజకీయ పోరాటం కాదు: రాహుల్
ఇది రాజకీయ పోరాటం కాదని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తేల్చిచెప్పారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే పోరాటం ప్రారంభించామని స్పష్టంచేశారు. నిరసన ర్యాలీ సందర్భంగా ఆయన మాట్లాడారు. చట్ట ప్రకారం ఒక్కరికి ఒక ఓటు మాత్రమే ఉండాలన్నారు. అక్రమాలు, అవకతవకలకు తావులేని స్వచ్ఛమైన, స్పష్టమైన ఓటర్ల జాబితా కోసం ఉద్యమిస్తున్నామని ఉద్ఘాటించారు. ఎన్నికల్లో జరుగుతున్న అక్రమాల గురించి ప్రజలందరికీ తెలుసని చెప్పారు.
ఎన్నికల సంఘం దీనిపై స్పందించడం లేదని నిలదీశారు. గత ఎన్నికల్లో దేశమంతటా జరిగిన రిగ్గింగ్‌పై త్వరలో బాంబు పేలుస్తానని రాహుల్ మరోసారి వెల్లడించారు. ఎన్నికల సంఘం కోరుతున్నట్లుగా సంతకం చేసిన అఫిడవిట్ సమర్పించే ప్రసక్తే లేదన్నారు. ఎన్నికల సంఘం వెబ్‌సైట్ నుంచి తీసుకున్న సమాచారాన్ని విశ్లేíÙంచి, ఓట్ల చోరీని బయటపెట్టానని, ఇంతకంటే సాక్ష్యాధారాలు ఇంకేం కావాలని ప్రశ్నించారు. అది తాను సృష్టించిన డేటా కాదని స్పష్టంచేశారు.
బీజేపీ కుట్రలను అడ్డుకుంటాం: ఖర్గే
ప్రజల హక్కుల పరిరక్షణ కోసం పోరాడుతూనే ఉంటామని కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే స్పష్టంచేశారు. ఓట్ల చోరీని అంగీకరించే ప్రసక్తే లేదన్నారు. ఎస్‌ఐఆర్ పేరిట ఓటర్ల జాబితాలను తారుమారు చేస్తున్నారని ధ్వజమెత్తారు. బీజేపీ కుట్రలను కచి్చతంగా అడ్డుకుంటామని అన్నారు. ఈ మేరకు ఖర్గే ‘ఎక్స్’లో పోస్టుచేశారు. దేశంలో బీజేపీ నిరంకుశత్వం చెల్లదన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.
రాజ్యాంగానికి వ్యతిరేకంగా బీజేపీ చేస్తున్న కుట్రలను ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. సాక్షాత్తూ పార్లమెంట్ ఎదుటే ప్రజాస్వామ్యంపై దాడి జరిగిందని, ప్రజాస్వామ్యాన్ని హత్య చేశారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ధ్వజమెత్తారు. ప్రతిపక్ష ఎంపీలను అరెస్టు చేయడాన్ని ఆయన ఖండించారు. తమ డిమాండ్లపై ఎన్నికల సంఘానికి వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్తుండగా అరెస్టు చేయడం దారుణమని విమర్శించారు.
ఎన్నికలు నిర్వహించాల్సిన ఎన్నికల సంఘం దొంగతనం చేసే సంఘంగా మారొద్దని జైరాం రామేశ్ హితవు పలికారు. నిరసన ర్యాలీలో శరద్ పవార్(ఎన్సీపీ–ఎస్పీ), టి.ఆర్.బాలు(డీఎంకే), సంజయ్ రౌత్(శివసేన–ఉద్ధవ్), డెరెక్ ఓబ్రెయిన్(టీఎంసీ)తోపాటు ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యుడు సంజయ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా, నిరసన ర్యాలీ కోసం ఎవరూ అనుమతి తీసుకోలేదని ఢిల్లీ పోలీసులు చెప్పారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎన్నికల సంఘం ఆఫీసు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
బారీకేడ్ దాటేసిన అఖిలేశ్
నిరసన ర్యాలీలో తమను అడ్డుకున్న పోలీసులపై సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ అఖిలేశ్ యాదవ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. బారీకేడ్లను తోసుకొని ముందుకెళ్లేందుకు ప్రయత్నించారు. బారీకేడ్ ఎక్కి అవతలికి దూకేశారు. పోలీసులు వెంటనే అప్రమత్తమై ఆయనను అదుపులోకి తీసుకున్నారు.
ప్రజా ఉద్యమంలా మారింది: రాహుల్
న్యూఢిల్లీ: ‘ఓట్ చోరీ’కి వ్యతిరేకంగా చేపట్టిన ప్రచారం ఉధృతమై ప్రజా ఉద్యమంలా మారిందని రాహుల్ గాంధీ ‘ఎక్స్’లో పేర్కొన్నారు. పోర్టల్ ప్రారంభించినప్పటి నుంచి మద్దతుగా 15 లక్షల సర్టిఫికెట్లను డౌన్‌లోడ్ చేసుకున్నారని, 10 లక్షల వరకు మిస్‌డ్ కాల్స్ వచ్చాయన్నారు.