గేటు దూకుతున్న సౌరవ్ దాస్, జంతర్‌మంతర్‌లో జాతీయజెండాతో అశుతోష్ రాంకా, పోలీస్ వ్యానులో సౌరవ్, అశుతోష్, ఇతర సీజేపీ కార్యకర్తలు
గేటు దూకి లోపలికి ప్రవేశించి నిరసన వ్యక్తం చేసిన నేతలు
సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా, అజింక్య షిండేను అరెస్టు చేసిన పోలీసులు
జంతర్‌మంతర్ స్వాదీనం చేసుకున్నట్లు సీజేపీ ప్రకటన
జ్ఞానేశ్ కుమార్ రాజీనామా జంతర్ మంతర్ వద్దే జరుగుతుంది
సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే స్పష్టీకరణ
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ను నిరసనల వేదికల జాబితా నుంచి కేంద్ర ప్రభుత్వం తొలగించడంపై కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) నేతలు, కార్యకర్తలు మంగళవారం తెల్లవారుజామున ఆందోళనకు దిగారు. పార్టీ నేతలు ఆశుతోష్ రాంకా, సౌరవ్ దాస్, అజింక్య షిండే ఆధ్వర్యంలో అక్కడికి చేరుకున్న కార్యకర్తలు పోలీసుల అడ్డంకులను దాటుకుని నిరసన తెలిపేందుకు ప్రయతి్నంచారు. ఇనుప గేటు, పోలీసుల బారికేడ్లను దూకి జంతర్‌మంతర్ ప్రాంగణంలోకి ప్రవేశించారు.
ఈ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా నిరసనకారులు నినాదాలు చేశారు. భారత్ మాతాకీ జై, ఇంక్విలాబ్ జిందాబాద్, జైభీమ్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. ‘సర్ఫరోష్ కీ తమన్నా’అనే విప్లవ కవితను కూడా పఠించారు. సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా, అజింక్య షిండేతోపాటు మరికొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీజేపీ నాయకులను ద్వారకా జిల్లాలోని జాఫర్‌పూర్ కలాన్ పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు ఓ అధికారి తెలిపారు.
కొంతమంది సీజేపీ కార్యకర్తలు అక్కడ గుమిగూడటంతో పోలీస్ స్టేషన్ లోపల, చుట్టుపక్కల భద్రతను పెంచినట్లు చెప్పారు. జంతర్‌మంతర్ తాము తిరిగి స్వా«దీనం చేసుకున్నట్లు సీజేపీ ఒక ప్రకటనలో స్పష్టంచేసింది. నిరసన తెలిపే హక్కు తమకు ఉందని వెల్లడించింది. తమ సభ్యులు బారికేడ్లను ఛేదించుకొని, జంతర్‌మంతర్ ప్రదేశంలోకి ప్రవేశించి, అక్కడ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారని వెల్లడించింది.
జంతర్‌మంతర్‌ను లాక్కోవడానికి అధికారం ఎక్కడిది?
జంతర్‌మంతర్ వద్ద తాము ప్రతిపాదించిన శాంతియుత నిరసన కోసం తేదీ, సమయం కోరుతూ పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు లేఖ సమర్పించిన రోజే.. అంటే అక్టోబర్ 12న ప్రభుత్వం నుంచి డీనోటిఫికేషన్ ప్రకటన వెలువడిందని అశుతోష్ రాంకా వెల్లడించారు. నిరసన తెలిపేందుకు అనుమతి కోసం అధికారులను సంప్రదించాలని ప్రభుత్వం చెప్పినట్లు గుర్తుచేశారు. అనుమతి కోరుతున్న సమయంలోనే నిబంధనలను మార్చడం ఏమిటని ప్రశ్నించారు.
నిరసన ప్రదేశంలోకి ప్రవేశంపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ విధించిన ఆంక్షలను సౌరవ్ దాస్ తప్పుపట్టారు. ప్రజల సొత్తు అయిన జంతర్‌మంతర్‌ను లాక్కోవడానికి హోంశాఖకు అధికారం ఎక్కడదని నిలదీశారు. నిరసనలకు కేటాయించిన జంతర్‌మంతర్‌లో నిరసనలు కచ్చితంగా జరుగుతాయన్నారు. జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేసేదాకా అక్కడి నుంచే తమ పోరాటం కొనసాగుతుందని పేర్కొన్నారు. భారత రాజ్యాంగ ప్రతిని చూపిస్తూ.. రాజ్యాంగం మనతోనే ఉందని సౌరవ్ దాస్ అన్నారు.
జంతర్‌మంతర్ వద్ద అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్ మీడియాతో మాట్లాడారు. నిర్బంధంలో ఉన్న సీజేపీ నాయకులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ‘దిశ’అనే విద్యార్థి సంఘం సభ్యులు మంగళవారం కన్నాట్ ప్లేస్ నుంచి జంతర్‌మంతర్ వరకు ర్యాలీ నిర్వహించారు. జంతర్ మంతర్‌ను తిరిగి స్వా«దీనం చేసుకోవాలని పిలుపునిచ్చారు. జంతర్ మంతర్‌ను డీనోటిఫై చేయడాన్ని తప్పుపట్టారు.
ప్రతిఘటనను రద్దు చేయలేరు: దీప్కే
తమపార్టీ నేతలను పోలీసులు అరెస్టు చేయడం పట్ల సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే మండిపడ్డారు. ‘ప్రజల ప్రతిఘటనను మీరు రద్దు చేయలేరు’అని తేల్చిచెప్పారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ట్యాగ్ చేస్తూ మంగళవారం సోషల్ మీడియాలో దీప్కే పోస్టుచేశారు. జంతర్‌మంతర్‌లో జాతీయ జెండా ఎగరవేయడం కూడా నేరమేనా? అని ప్రశ్నించారు.
నిరసన ప్రదేశం వైపు సీజేపీ సభ్యులు దూసుకెళ్లడం, ఒక గేటుపైకి ఎక్కి, త్రివర్ణ పతాకాన్ని పట్టుకుని నినాదాలు చేయడం, ఆ తర్వాత పోలీసు సిబ్బంది వారిని అదుపులోకి తీసుకున్న ఒక వీడియోను దీప్కే షేర్ చేశారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ‘‘నిర్ణీత నిరసన ప్రదేశాల జాబితా నుంచి జంతర్ మంతర్‌ను తొలగిస్తే, జవాబుదారీతనం కోరుతున్న ప్రజల గొంతు నొక్కేయవచ్చని ప్రభుత్వం భావిస్తే ఈ ఉద్యమం లక్ష్యాన్ని తప్పుగా అర్థం చేసుకున్నట్టే. జంతర్ మంతర్ కేవలం పటంలో ఒక ప్రదేశం మాత్రమే కాదు.
అది అధికారంలో ఉన్నవారిని ప్రశ్నించడానికి పౌరులు గుమిగూడిన చోటు. ఏ పరిపాలనాపరమైన ఉత్తర్వు కూడా ఆ ప్రజాస్వామ్య స్ఫూర్తిని చెరిపివేయలేదు’’అని దీప్కే ఉద్ఘాటించారు. సీజేపీ నాయకులు పోలీసుల నిర్బంధంలోనే ఉన్నారని, వారిని కలిసేందుకు తమ న్యాయవాదులకు అనుమతి ఇవ్వడం లేదని ఆరోపించారు. తమ నాయకులను కిడ్నాప్ చేశారని పోలీసులపై ధ్వజమెత్తారు. పోలీసులు చట్టాన్ని పాటించడం లేదని విమర్శించారు. జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చివరకు జంతర్ మంతర్ వద్దే జరుగుతుందని పేర్కొన్నారు. ‘మీకు చేతనైంది చేసుకోండి’అంటూ ప్రభుత్వానికి సవాలు విసిరారు.
ఇదీ చదవండి: కలిసికట్టుగా పోరాడుతాం!


