అశ్లీల, కుల వివక్ష పాటలు పెడితే ఇక జైలుకే! | Bihar Govt Issues Strict Warning On Obscene And Caste Based Songs At Public Events Amid Law And Order Concerns | Sakshi
Sakshi News home page

అశ్లీల, కుల వివక్ష పాటలు పెడితే ఇక జైలుకే!

Jun 17 2026 8:08 AM | Updated on Jun 17 2026 11:52 AM

Bihar Government big Warning says play Obscene or Casteist Songs in Public Face

పట్నా: బిహార్ ప్రభుత్వం సామాజిక శాంతిభద్రతల పరిరక్షణ కోసం అత్యంత సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. బహిరంగ సభలు, సామాజిక కార్యక్రమాలు, వివాహాది శుభకార్యాల్లో అశ్లీలత, కుల ఆధారిత అంశాలతో కూడిన పాటలను ప్లే చేయడంపై తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. సమాజంలో శాంతి భద్రతలకు, మత సామరస్యానికి లేదా సామాజిక ప్రశాంతతకు భంగం కలిగించే విధంగా ఇలాంటి పాటలను ప్రసారం చేసినా, పాడినా లేదా ప్రోత్సహించినా వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని అధికారులు స్పష్టం చేశారు.

సామాజిక సామరస్యానికి విఘాతం
రాష్ట్రవ్యాప్తంగా వివిధ బహిరంగ ప్రదేశాలు, మార్కెట్లు, వాహనాలు, వివాహ వేడుకలు, ఇతర సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలలో విభజన భావాలను ప్రేరేపించే అశ్లీల, కుల ఆధారిత కంటెంట్ బహిరంగంగా ప్లే అవుతోందని ప్రభుత్వం గుర్తించింది. దీనివల్ల సమాజంలో పరస్పర సోదరభావం, సామరస్యం పెరగడానికి బదులుగా, అశ్లీలత, హింసాత్మక సంఘటనలు, పరస్పర ద్వేషం, శత్రుత్వం, అశాంతి పెరుగుతున్నాయని హోం శాఖకు పంపిన లేఖలో అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపధ్యంలో ఉద్రిక్తతలను రేకెత్తించే ఎలాంటి అసభ్యకరమైన భాష లేదా కుల సంబంధిత వ్యాఖ్యలను సహించేది లేదని ప్రభుత్వం తేల్చి చెప్పింది.

నిఘా నీడలో వేడుకలు
ఈ తాజా హెచ్చరికలు కేవలం ఇళ్లకు మాత్రమే పరిమితం కాకుండా.. సాంస్కృతిక కార్యక్రమాలు, ఊరేగింపులు, కమ్యూనిటీ ఈవెంట్‌లు, పండుగ వేడుకలు, పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యే అన్ని బహిరంగ సందర్భాలకు వర్తిస్తాయి. కులపరమైన లేదా ద్వంద్వార్థాలు ఉన్న కొన్ని పాటలు సామాజిక విభజనలను సృష్టించి, తగాదాలకు దారితీసి, శాంతిభద్రతలపై ప్రభావం చూపుతాయని ప్రభుత్వం నమ్ముతోంది. ఇందుకోసం జిల్లా మేజిస్ట్రేట్లు, ఎస్ఎస్పీలు, ఎస్పీలు అలర్ట్‌గా ఉండాలని, ఆయా కార్యక్రమాల నిర్వాహకులు చట్టపరమైన నిబంధనలను ఉల్లంఘించకుండా చూసుకోవాలని, అభ్యంతరకరమైన కంటెంట్‌పై వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని ఆదేశాలు జారీ అయ్యాయి.

అసెంబ్లీ వేదికగా మొదలైన పోరు
ఈ సమస్య ఈనాటిది కాదు. గత 2023లోనే బిహార్ అసెంబ్లీలో అప్పటి కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రతిమా కుమారి ఇలాంటి అసభ్యకరమైన కంటెంట్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆ సమయంలోనే దీనిని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇటీవలి కాలంలో బిహార్‌తో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ స్పష్టమైన బూతు పదాలు, కుల గుర్తింపులను ప్రస్తావించే పాటలు తరచూ వివాదాలకు దారితీస్తున్నాయి. సామాజిక విబేధాలను ప్రోత్సహిస్తూ, సమాజంలోని కొన్ని వర్గాలను కించపరిచే విధంగా ఉన్న ఈ ధోరణిపై తీవ్ర విమర్శలు రావడంతో ప్రభుత్వం ఈ కఠినమైన నిర్ణయానికి వచ్చింది.

ఇది కూడా చదవండి: ఉదయం పొడవు.. రాత్రికి పొట్టి..

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement