
న్యూఢిల్లీ: అమెరికా హెచ్1బీ వార్షిక వీసా కోసం దరఖాస్తు రుసుము భారీ పెంచిన నేపథ్యంలో ఒకవైపు ఆందోళన నెలకొంది. యూఎస్ వెళ్లాలనుకునే భారతీయుల ఆశలకు దాదాపు గండిపడింది. సుమారు లక్ష అమెరికన్ డాలర్ల(రూ. 83 లక్షలు) రుసుము చెల్లిస్తే కానీ కొత్తగా హెచ్ 1 బీ వీసా కోసం దరఖాస్తు చేసుకునే వారిక అవకాశం ఉండదు. అంటే తమ దేశానికి రావొద్దని పరోక్షంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంకేతాలిచ్చేశారు. తమ దేశ సంపదను భారతీయులు కొల్లగొట్టేస్తున్నారనే భయం ట్రంప్‌లో మొదలైనట్లుంది.
భారతీయుల్లో టాలెంట్‌కు కొదవ లేకపోవడంతో అమెరికాలోని అవకాశాలను ఇట్టే అందిపుచ్చుకుంటున్నారు. ఈ తరుణంలో హెచ్ 1 బీ వీసా దరఖాస్తు రుసుము పెంపుతో దీనిని అడ్డుకోవాలనే ప్రయత్నంలో భాగంగా ట్రంప్ తన అసూయను బయటపెట్టేసుకున్నారు. ఎప్పుడూ లేని విధంగా హెచ్ 1 బీ వీసా దరఖాస్తు రుసుమును పెంచేశారు.
దీనిపై కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ.. ‘ మన దేశంలోని యువత ప్రతిభకు అమెరికా భయపడినట్లుంది’ అంటూ చమత్కరించారు. ఇదే విషయంపై ఓ జాతీయ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గోయల్ మాట్లాడారు. రేపు(సోమవారం, సెప్టెంబర్ 22వ తేదీ) వాణిజ్య చర్చల్లో భాగంగా అమెరికా పర్యటనకు బయల్దేరి వెళ్లనున్నారు గోయల్. అయితే ముందుగానే అమెరికా విధించిన హెచ్ 1 బీ వీసా రుసుముకు సంబంధించి ఎదురైన ప్రశ్నకు గోయల్ స్పందించారు. దీనికి సంబంధించిన వీడియోను ‘ఎక్స్’లో షేర్ చేశారు.
టాలెంట్ పరంగా చూస్తే మనవాళ్లు మేటి అని, దాన్ని చూసే అమెరికా హెచ్ 1 బీ వీసా దరఖాస్తు రుసుమును అమాంతం పెంచేసిందంటూ నవ్వుతూ సెటైర్లు వేశారు. ‘మన ప్రతిభను చూసి వాళ్ళు కూడా కొంచెం భయపడుతున్నారు. దానికి కూడా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు’ అని చమత్కరించారు. పలు దేశాలు భారత్‌తో వాణిజ్య ఒప్పందాలకు ఎదురుచూస్తున్నాయని, భారత్‌తో సంబంధాలను మెరుగుపరుచకోవడానికి చాలా దేశాలు ముందు వరుసలో ఉన్నాయన్నారు.
Bharat is a winner, come what may! pic.twitter.com/5MXtih8Cnr
— Piyush Goyal (@PiyushGoyal) September 20, 2025
కాగా, నేటి(ఆదివారం, సెప్టెంబర్ 21వ తేదీ) నుంచి హెచ్1బీ వార్షిక వీసా కోసం దరఖాస్తు చేసే ప్రతి వ్యక్తి లక్ష డాలర్లు (సుమారు రూ.83 లక్షలు) ఫీజు చెల్లించాల్సి ఉంది. అయితే, ఈ పెంపు కొత్తగా దరఖాస్తు చేసే విదేశీ ఉద్యోగులకు మాత్రమే వర్తించనుంది. ఇప్పటికే హెచ్1-బీ వీసా ఉన్నవారికి తాజా పెంపు వర్తించదని తెలిపింది.
అమెరికా అధ్యక్షుడు తాజాగా విడుదల చేసిన ‘ప్రోక్లమేషన్ ఆఫ్ రెస్ట్రిక్షన్ ఆన్ ఎంట్రీ ఆఫ్ సర్టెన్ నాన్‌ఇమ్మిగ్రెంట్ వర్కర్స్’ ప్రకటన ప్రకారం హెచ్ 1బీ వీసాలపై కీలకమైన పరిమితులు విధించింది. ట్రంప్ ఆదేశాలను అమలు చేసే యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (CBP) అధికారికంగా మార్గదర్శకాలు విడుదల చేసింది.
ఇదిలా ఉంచితే, పీయూష్ గోయల్ భారత్-అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పంద చర్చలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు సెప్టెంబర్ 22న అమెరికాకు పయనం కానున్నారు. సెప్టెంబర్ 16న ఢిల్లీలో అమెరికా వాణిజ్య ప్రతినిధి బ్రెండన్ లించ్ బృందం.. భారత ప్రతినిధి రాజేష్ అగర్వాల్ తో జరిపిన ఏడు గంటల సుదీర్ఘ సమావేశం తర్వాత ఈ పర్యటన జరుగుతోంది. ప్రధానంగా రష్యా నుంచి చమురు కొనుగోళ్లపై అమెరికా విధించిన సుంకాలను తగ్గించడం ఈ చర్చల్లో ఒక కీలక అంశం కానుంది.