
‘‘చాలామంది ఫ్రీమేక్‌లు చేస్తున్నారు. కానీ... మేం అధికారికంగా రీమేక్ (తమిళ హిట్ ఫిల్మ్ ‘గరుడన్’కు తెలుగు రీమేక్ ‘భైరవం’) చేశాం. అయినా ప్రేక్షకులు ఏ సినిమా బాగున్నా చూస్తారు. అది రీమేకా... ఫ్రీమేకా? అని పెద్దగా ఆలోచించరు. ‘భైరవం’(Bhairavam Movie) సినిమా తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుంది. నా ప్రతి సినిమాలో ఉండే ఓ సామాజిక సందేశం ఈ సినిమాలోనూ ఉంది’’ అని అన్నారు దర్శకుడు విజయ్ కనకమేడల(Vijay Kanakamedala).
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మనోజ్ మంచు, నారా రోహిత్ హీరోలుగా నటించిన చిత్రం ‘భైరవం’. అదితీ శంకర్, ఆనంది, దివ్యా పిళ్ళై హీరోయిన్లుగా నటించారు. విజయ్ కనకమేడల దర్శకత్వంలో పెన్ స్టూడియోస్ అధినేత జయంతిలాల్ గడా సమర్పణలో కేకే రాధామోహన్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 30న రిలీజ్ కానుంది.
ఈ సందర్భంగా విజయ్ కనకమేడల మాట్లాడుతూ–‘‘తమిళ సినిమా ‘గరుడన్’ కథ కమర్షియల్‌గానూ నాకు నచ్చింది. తెలుగులోనూ ముగ్గురు హీరోలతో చేయొచ్చనిపించింది. కథ అనుకున్నప్పుడే సాయిగారిని హీరోగా ఫైనల్ చేశాం. రోహిత్, మనోజ్‌గార్లను ఆ తర్వాత కలిస్తే, వారూ ఓకే చెప్పారు. కథలో ఈ ముగ్గురు హీరోలకు సమ ప్రాధాన్యత ఉంటుంది.
మొదట్లో ముగ్గురు హీరోలతో సినిమా చేయడం కష్టమేమో అనిపించింది. కానీ... ఈ ముగ్గురు ఆఫ్ స్క్రీన్‌లోనూ మంచి మిత్రులు. దాంతో నా పని సులువైంది. ఇక ‘భైరవం’ కథ విషయానికొస్తే... ముగ్గురు స్నేహితుల ఫ్యామిలీల మధ్య జరిగే కథ. ఒక గ్రామంలో గుడి ఉంటుంది. ఆ గుడికి క్షేత్రపాలకుడు భైరవుడు. ఆ భైరవుడి రూపం నుంచి సినిమాకి ‘భైరవం’ అని టైటిల్ పెట్టాం.
కథలో ఒక హీరోకు (బెల్లంకొండ సాయిశ్రీనివాస్ పాత్రను ఉద్దేశించి) చిన్నప్పట్నుంచి కాలభైరవుడు పూనతాడు. ఎందుకు? ఏమిటి? అనేది సినిమా చూస్తే తెలుస్తుంది. సినిమాలో మంచి ఎమోషన్ ఉంది. యాక్షన్ సీక్వెన్స్‌లూ అలరిస్తాయి. నా తర్వాతి సినిమా ఇంకా ఖరారు కాలేదు. నా దగ్గర చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్‌గార్లకు తగిన కథలు ఉన్నాయి’’ అని అన్నారు.