టాలీవుడ్ హీరోయిన్ సమంత ప్రస్తుతం మా ఇంటి బంగారంతో ప్రేక్షకులను పలకరించనుంది. తన సొంత బ్యానర్‌లో ఈ మూవీని నిర్మించింది. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా జూన్ 19న థియేటర్లలో సందడి చేసేందుకు వచ్చేస్తోంది. ఇటీవలే హైదరాబాద్‌లో గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించారు. రిలీజ్ టైమ్ దగ్గర పడడంతో సామ్ వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సమంత తన సినీ ప్రయాణంపై ఆసక్తికర కామెంట్స్ చేసింది.
ఒక సమయంలో స్టార్‌డమ్ అనే మత్తుకు బానిసయ్యానని సమంత చెప్పుకొచ్చింది. తన సినిమాలు వరుస హిట్స్ కావడంతో నాలో అహంకారం కూడా మెల్లగా పెరుగుతూ వచ్చిందని సామ్ పేర్కొంది. చిన్న పట్టణం నుంచి వచ్చిన ఓ అమ్మాయికి స్టార్‌డమ్ దక్కడం నాకే ఆశ్చర్యంగా అనిపించిందని వెల్లడించింది. ఓకే ఏడాదిలో ఐదు సినిమాలు చేశా.. అన్నీ హిట్ కావడంతో నాది ‘గోల్డెన్ లెగ్’ అని అందరు అనేవారని గుర్తు చేసుకుంది. అలా నాపై ఒత్తిడి కూడా పెరిగిందని చెప్పుకొచ్చింది. దీంతో ఇంకా ఎక్కువ సినిమాలు చేయాలనుకున్నా.. నటిగా నా కెరీర్‌లో ముగింపు ఉండదనుకున్నానని సామ్ తెలిపింది.
అయితే అనారోగ్యం, సినిమాలకు బ్రేక్ రావడం నా ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేసిందని సమంత తెలిపింది. అప్పుడే తిరిగి సినిమాల్లోకి వస్తే కొన్ని పాత అలవాట్లు మార్చుకోవాలని అప్పుడే నిర్ణయించుకున్నానని వెల్లడించింది. విరామం తర్వాత తన జీవితం, కెరీర్‌ను కొత్త కోణంలో చూసేలా చేసిందని పేర్కొంది. కాగా.. 2022 నుంచి సామ్ మయోసైటిస్ అనే ఆటో ఇమ్యూన్ వ్యాధితో బాధపడిన సంగతి తెలిసిందే.


