Dies Irae: సౌండ్‌తో భయపెట్టారు.. 'డీయస్ ఈరే' తెలుగు రివ్యూ | Dies Irae Horror Movie Review And Rating In Telugu, Pure Horror Experience In Telugu Theaters | Sakshi
Sakshi News home page

Dies Irae Movie Review: రీసెంట్ టైంలో బెస్ట్ హారర్ మూవీ.. ఎలా ఉందంటే?

Nov 8 2025 3:25 PM | Updated on Nov 8 2025 5:15 PM

Dies Irae Movie Telugu Review

గత కొన్నేళ్లుగా హారర్ సినిమాల ట్రెండ్ కొనసాగుతోంది. కానీ దీనికి కామెడీ మిక్స్ చేసి తీస్తున్నారు. అలా కాకుండా కేవలం హారర్ ఎలిమెంట్స్‌తో తీసి వేరే లెవల్లో భయపెట్టిన చిత్రాలంటే అరుదు. ఇప్పుడు అలా ప్యూర్ హారర్ కాన్సెప్ట్‌తో తీసిన మూవీ 'డీయస్ ఈరే'. ఇదో మలయాళం సినిమా. అక్టోబరు 31న అక్కడ రిలీజైంది. వారం ఆలస్యంగా అంటే నవంబరు 7న తెలుగులో థియేటర్లలోకి వచ్చింది. ఇంతకీ ఇది ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.

(ఇదీ చదవండి: The Girlfriend: రష్మిక ‘ది గర్ల్‌ఫ్రెండ్‌’ మూవీ రివ్యూ)

కథేంటి?
రోహన్ (ప్రణవ్ మోహన్‌లాల్) ఓ ఆర్కిటెక్ట్. బాగా డబ్బున్న ఫ్యామిలీ కుర్రాడు. తల్లిదండ్రులు అమెరికాలో ఉంటారు. ఇతడేమో ఇక్కడ పెద్ద ఇంట్లో ఒంటరిగా నివసిస్తుంటాడు. ఖాళీ టైంలో పార్టీలు, ఫ్రెండ్స్ అని ఎంజాయ్ చేస్తుంటాడు. ఓ రోజు రోహన్ క్లాస్‌మేట్ కని(సుస్మితా భట్) బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంటుంది. దీంతో ఆమె కుటుంబాన్ని పరామర్శించేందుకు రోహన్, అతడి ఫ్రెండ్ కని ఇంటికి వెళ్లొస్తారు. అప్పటినుంచి రోహన్ ఇంట్లో రాత్రిపూట గజ్జెల శబ్దాలు వినిపిస్తుంటాయి. కని ఆత్మనే తనని వేధిస్తోందని రోహన్ భావిస్తుంటాడు. అసలు ఈ ఆత్మ ఎవరిది? ఎందుకు రోహన్ వెంటపడుతోంది? కని పొరుగింటి వ్యక్తి మధు(జిబిన్ గోపీనాథ్), రోహన్‌కి ఎలాంటి సాయం చేశాడు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.

ఎలా ఉందంటే?
హారర్ సినిమా అనగానే ఓ ఫార్మాట్ ఉంటుంది. ఓ దెయ్యం, దానికో ఫ్లాష్ బ్యాక్, అది హీరో లేదా హీరోయిన్‌ని వేధించడం.. చివరకు దాని నుంచి బయటపడటం.. దాదాపు ఇదే పాయింట్‌తో చాలా వరకు తీస్తుంటారు. 'డీయస్ ఈరే' కూడా దీనికి మినహాయింపు ఏం కాదు. కానీ చూస్తున్న ప్రేక్షకుడిని ఎంతవరకు భయపెట్టామా అనేది కీలకం. ఈ విషయంలో 'డీయస్ ఈరే' టీమ్‌కి నూటికి నూటి మార్కులు వేయొచ్చు. ఎందుకంటే ఆ రేంజులో భయపెట్టారు. కొన్ని సీన్లలో అయితే వణికిపోతాం.

సినిమా మొదలైన కాసేపటివరకు కథలో పెద్ద కదలిక ఉండదు. రోహన్, అతడు చుట్టూ ఉంటే ప్రపంచాన్ని పరిచయం చేశారు. కని ఆత్మహత్య చేసుకోవడం, ఆమె ఇంటికి రోహన్ వెళ్లడంతో అసలు కథ మొదలవుతుంది. కని హెయిన్ పిన్‌ని రోహన్ తన ఇంటికి తీసుకొస్తాడు. అప్పటినుంచి ఓ ఆత్మ రోహన్‌ని భయపెడుతూ ఉంటుంది. ఆ దెయ్యం చూపించే సీన్‌తో ఇంటర్వెల్ కార్డ్ పడుతుంది. సెకండాఫ్‌లో దెయ్యం ఎవరు? దాన్ని రోహన్ ఎలా ఎదుర్కొన్నాడు అనే అంశాలు చూపిస్తారు. అయితే సెకండాఫ్‌లో ప్రతి సీన్‌లోనూ నెక్స్ట్ ఏం జరగబోతుందా అని ఒకటే ఆత్రుత. చివరి 20 నిమిషాలైతే సీట్ ఎడ్జ్ థ్రిల్ ఎక్స్‌పీరియెన్స్ ఇస్తుంది. సీటు నుంచి మనల్ని కదలం. ఊపిరి కూడా తీసుకోకుండా చూస్తాం. అప్పటివరకు నిదానంగా సాగిన సినిమా కాస్త క్లైమాక్స్‌లో పరుగెడుతుంది.

(ఇదీ చదవండి: ‘జటాధర’ మూవీ రివ్యూ)

ఈ సినిమాలో మెయిన్ ట్విస్ట్ (చెబితే స్పాయిలర్ అవుతుంది)ని పలు సందర్భాల్లో మనం వార్తల్లో చూసే ఉంటాం. ఇంత చిన్న పాయింట్‌ని తీసుకుని ఓ హారర్ మూవీ తీయడం అంటే మాటలు కాదు. అదే టైంలో మలయాళ చిత్రాలపై ఎ‍ప్పుడు ఉండే కంప్లైంట్ ఇందులోనూ ఉంటుంది. చాలా అంటే చాలా నిదానంగా మూవీ సాగుతుంది. అసలు కని ఏ కారణంతో చనిపోయిందో రివీల్ చేయలేదు. చివర్లో పార్ట్ 2 ఉంటుందనే హింట్ ఇచ్చారు. బహుశా సీక్వెల్‍‌లో ఆ విషయం రివీల్ చేస్తారేమో?

కని తమ్ముడు ఓ సందర్భంలో రోహన్ ఇంటికొస్తాడు. అక్కడి ఆత్మ కారణంగా కిరణ్ పై ఫ్లోర్ నుంచి కిందపడిపోతాడు. ఆ విజువల్స్ చూస్తే మన ఒళ్లు జలదరిస్తుంది. క్లైమాక్స్‌లో కని పొరుగింటికి రోహన్ వెళ్తాడు. ఆ సీన్స్ చూస్తున్నంతసేపు కళ్లు తిప్పుకోలేం. ఓ వైపు ఆశ్చర్యం, మరోవైపు భయమేస్తుంది.

ఎవరెలా చేశారు?
ఇందులో పాత్రలు చాలా తక్కువ. లీడ్ రోల్ చేసిన ప్రణవ్ మోహన్‌లాల్ ఆకట్టుకునే ఫెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. క్లైమాక్స్‌లో ఎల్సమ్మ పాత్రలో జయ కురుప్ యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవల్. ఓ రకంగా ఆమె సర్‌ప్రైజ్ చేస్తుంది. మధు పాత్రలో జిబిన్ గోపీనాథ్ మెప్పించారు. మిగిలిన పాత్రధారులు అందరూ న్యాయం చేశారు. డైరెక్టర్ రాహుల్ సదాశివన్ గురించి చెప్పుకోవాలి. గతంలో భూతకాలం, భ్రమయుగం అనే హారర్ మూవీస్‌తో భయపెట్టిన ఈయన.. ఇప్పుడు ఈ చిత్రంతో ఇంకాస్త భయపెట్టాడు. అసలు స్టోరీ ఏం లేనప్పటికీ ఏదో ఉందనే భ్రమ కల్పించి, తనదైన మ్యాజిక్ చేశాడు.

మ్యూజిక్ డైరెక్టర్ క్రిస్టో గ్జేవియర్ ఈ సినిమాకు మరో హీరో. ఎందుకంటే సాధారణంగా హారర్ సినిమాల్లో జంప్ కట్స్, స్కేరీ మూమెంట్స్ ఎక్కడొస్తాయో ఇప్పటి ప్రేక్షకులు పసిగట్టేస్తున్నారు. అలా పండిపోయిన హారర్ మూవీ ప్రేమికుల్ని కూడా తనదైన నేపథ్య సంగీతంతో భయపెడతాడు. డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్‌కి తోడు సినిమాటోగ్రాఫర్ షెహనాద్ జలాల్ వేరే లెవల్ డ్యూటీ చేశాడు. సీన్ మూడ్ ఎలివేట్ చేసేలా, లైటింగ్‌తో.. ఇదెక్కడి హారర్ మూవీ బాబోయే అనిపిస్తాడు. నిర్మాణ విలువలు రిచ్‌గా ఉన్నాయి. రీసెంట్ టైంలో వచ్చిన వన్ ఆఫ్ ది బెస్ట్ హారర్ మూవీ ఇది. ఓటీటీలోకి వచ్చిన తర్వాత చూసి అయ్యో దీన్ని థియేటర్‌లో మిస్ అయిపోయామే అనుకోవచ్చు. వీలుంటే మాత్రం బిగ్ స్క్రీన్‌పై ఈ చిత్రాన్ని ఎక్స్‌పీరియెన్స్ చేయండి. ఇకపోతే 'డీయస్ ఈరే' అనేది లాటిన్ పదం. తన కోపం చూపించే రోజు, శిక్షాదినం అని దీనికి అర్థం.

- చందు డొంకాన

(ఇదీ చదవండి: 'ఆర్యన్' రివ్యూ.. థ్రిల్లర్ సినిమా ఎలా ఉంది?)

Rating:
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement