రష్మిక ‘ది గర్ల్‌ఫ్రెండ్‌’ మూవీ రివ్యూ | The Girlfriend Movie Review And Rating In Telugu | Sakshi
Sakshi News home page

The Girlfriend Review: ‘ది గర్ల్‌ఫ్రెండ్‌’ మూవీ హిట్టా? ఫట్టా?

Nov 7 2025 3:00 AM | Updated on Nov 7 2025 4:28 AM

The Girlfriend Movie Review And Rating In Telugu

నేషనల్‌ క్రష్‌ రష్మిక, దీక్షిత్‌ శెట్టి ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘ది గర్ల్‌ఫ్రెండ్‌’(The Girlfriend Review). రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వం వహించిన ఈ ఇంటెన్స్‌, ఎమోషనల్‌ లవ్‌స్టోరీని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మి​​ంచాయి. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్‌తో పాటు పాటలకు మంచి స్పందన లభించింది. దానికి తోడు ప్రమోషన్స్‌ కూడా గ్రాండ్‌గా చేయడంతో ‘ది గర్ల్‌ఫ్రెండ్‌’పై హైప్‌ క్రియేట్‌ అయింది.భారీ అంచనాల మధ్య నేడు(నవంబర్‌ 7) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
 

కథేంటంటే..
భూమా(రష్మిక) తండ్రి(రావు రమేశ్‌)చాటున పెరిగిన ఓ అమాయకపు అమ్మాయి. ఎంఏ లిటరేచర్‌ చదవడం కోసం తొలిసారి తండ్రిని వదిలి నగరానికి వచ్చి రామలింగయ్య ఆర్ట్‌ అండ్‌ సైన్స్‌ కాలేజీలో జాయిన్‌ అవుతుంది. విక్రమ్‌(దీక్షిత్‌ శెట్టి), దుర్గ(అను ఇమ్మాన్యుయేల్‌) కూడా అదే కాలేజీలో చేరతారు.

విక్రమ్‌ ఆవేశపరుడు. అంతేకాదు అమ్మాయిలు అంటే ఇలానే ఉండాలనుకునే స్వభావం కలవాడు. తనకు నచ్చినట్లుగా భూమా ప్రవర్తన ఉండడంతో ఆమెను ప్రేమిస్తాడు. మరోవైపు అదే కాలేజీకి చెందిన మరో అమ్మాయి దుర్గ(అనూ ఇమ్మాన్యుయేల్‌)..విక్రమ్‌ని ఇష్టపడుతుంది. కానీ విక్రమ్‌ మాత్రం ఆమెను నిరాకరిస్తూ ఉంటాడు. 
లవ్‌, రిలేషన్‌కు దూరంగా ఉండాలనుకుంటూనే..భూమా కూడా విక్రమ్‌తో ప్రేమలో పడిపోతుంది. ఆ తర్వాత భూమా జీవితం ఎలాంటి మలుపు తిరిగింది? తన లైఫ్‌ మొత్తం విక్రమ్‌  కంట్రోల్‌లోకి వెళ్లిందని తెలిసిన తర్వాత భూమా తీసుకున్న అనూహ్య నిర్ణయం ఏంటి? ఆ నిర్ణయం ఆమెకు ఎలాంటి సమస్యలను తెచ్చిపెట్టింది? వాటిని అధిగమించి ఎలా సక్సెస్‌ అయిందనేదే మిగతా కథ(The Girlfriend Review)

ఎలా ఉందంటే..
అమ్మాయిలు అంటే ఇలానే ఉండాలి.. ఇలాంటి పనులే చేయాలని చెప్పే ‘మగమహారాజులు’ చాలా మందే ఉన్నారు.  బయట నీతులు మాట్లాడి..ఇంట్లో ఆడవాళ్లకు కనీస గౌరవమర్యాదలు ఇవ్వని భర్తలు.. ప్రేమ పేరుతో వారి జీవితాన్ని తమ కంట్రోల్‌లోకి తీసుకొని.. మాటలతో హింసించే బాయ్‌ప్రెండ్స్‌ ఇప్పటీకీ అక్కడక్కడ కనిపిస్తూనే ఉంటారు. అలాంటి బాధలన్నీ భరించి.. ఎదురించి చివరకు తన లక్ష్యాన్ని చేరుకున్న ఓ అమ్మాయి కథే ‘ది గర్ల్‌ఫ్రెండ్‌’. మనల్ని కంట్రోల్‌ చేసే పవర్‌ని ఇతరులకు ఇవ్వొద్దని, కొన్ని విషయాల్లో సొంత నిర్ణయాలే తీసుకోవాలి అని చెప్పే సినిమా ఇది. 

కథగా చూస్తే..ఇది చాలా సింపుల్‌ అండ్‌ రొటీన్‌ స్టోరీ. కానీ డైరెక్టర్‌ రాహుల్‌ రవీంద్రన్‌ దాన్ని తెరపై చూపించిన విధానం కొత్తగా ఉంటుంది. విజువల్స్‌ ద్వారానే తను చెప్పాలనుకున్న పాయింట్‌ని చెప్పే ప్రయత్నం చేశాడు. ఇంటర్వెల్‌ ముందు వచ్చే రష్మిక షవర్‌ సీన్‌, హీరో అమ్మగారితో మాట్లాడుతున్న సమయంలో తీసిన మిరర్‌ విజువల్‌, బ్రేకప్‌ తర్వాత హీరో గ్యాంగ్‌ వెంబడించినప్పు వచ్చే సింబాలిక్‌ షాట్స్‌.. ఇవన్నీ రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వ ప్రతిభను చాటిచెబుతాయి.

ఇదంతా ఒకవైపు.. ఇక లాజిక్కులు, ప్రస్తుత సమాజంలోని వాస్తవిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని సినిమా చూస్తే.. పాత చింతకాయపచ్చడి కథేలాగే కనిపిస్తుంది. అంతేకాదు నాణానికి ఒకవైపే చూపించాడని.. రెండో వైపు కూడా ఉంటుంది కదా..దర్శకుడు అదేలా మిస్‌ అయ్యాడనే ఫీలింగ్‌ కలుగుతుంది. కేవలం మగవాళ్లను బ్యాడ్‌ చేయడానికే ఈ సినిమా తీశాడనే విమర్శలు కూడా దర్శకుడిపై వచ్చే అవకాశం ఉంది. అయితే ఏ వర్గం ప్రేక్షకుడైనా ఈ సినిమాలోని హీరో లేదా హీరోయిన్‌ పాత్రతో కనెక్ట్‌ అవ్వడం ఖాయం. ఇద్దరీ పాత్రలూ.. మనం ఎక్కడో చూసినట్లుగా, విన్నట్లుగానే ప్రవర్తిస్తాయి. 

ఫస్టాఫ్‌ మొత్తం హీరోహీరోయిన్ల ప్రేమ చుట్టూ తిరిగితే.. సెకండాఫ్‌ మాత్రం ప్రేమలో పడిన తర్వాత వారి జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయనే చూపించారు. ఊహకందేలా కథనం సాగినా..తెరపై ఆయా సన్నివేశాలను చూస్తుంటే..కొన్ని చోట్ల ఎమోషనల్‌ అవుతాం. క్లైమాక్స్‌లో హీరోయిన్‌ చెప్పే మాటలు ప్రతి ఒక్కరిని, ముఖ్యంగా నేటి తరం యువకులను ఆలోచింపజేస్తాయి. అక్కడక్కడ లాజిక్ మిస్‌ అవ్వడంతో పాటు ల్యాగ్‌ చేసినా..‘ది గర్ల్‌ఫ్రెండ్‌’ని మాత్రం ఓ వర్గం ప్రేక్షకులు నెత్తిన పెట్టుకుంటారు.

ఎవరెలా చేశారంటే..
ఈ సినిమాలోని భూమా పాత్రకు రష్మికను ఎంచుకోవడంలోనే రాహుల్‌ సగం విజయం సాధించాడు. ఆ పాత్రకు రష్మిక తప్ప మరెవరూ న్యాయం చేయలేరు అన్నట్లుగా నటించింది. ఎమోషనల్‌ సన్నివేశాల్లో ఆమె అద్బుతంగా నటించింది. విక్రమ్‌ పాత్రలో దీక్షిత్‌ శెట్టి ఒదిగిపోయాడు. అనూ ఇమ్మాన్యుయేల్‌ పాత్ర నిడివి తక్కువే ఉన్నప్పటికీ.. చాలా బాగా నటించింది. రావు రమేశ్‌ ఒకటి రెండు షాడ్స్‌తో కనిపించినా..తన అనుభవాన్ని మరోసారి తెరపై చూపించాడు. సాంకేతికంగా ఈ సినిమా చాలా బాగుంది.  హేషమ్ అబ్దుల్ వహాబ్ పాటలు, ప్రశాంత్‌ విహారి నేపథ్య సంగీతం రెండూ ఈ సినిమా స్థాయిని పెంచేశాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్‌ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు  ఉన్నతంగా ఉన్నాయి.

Rating:
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement