కొంతకాలం క్రితం వరకు తెలుగు సినిమాలో మహిళా ప్రధాన చిత్రాలకు తగినంత ఆదరణ ఉండేది. అందుకు తగ్గట్టే వారూ వీరని తేడా లేకుండా విజయశాంతి నుంచి అనుష్క వరకు, చాలా మంది కథానాయికలు తమ మహిళా ప్రధాన చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద భారీ బ్లాక్‌బస్టర్‌లను సాధించారు. ఓ వైపు గ్లామర్ చిత్రాలు చేస్తూనే మరోవైపు హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలలోనూ రమ్యకృష్ణ లాంటి వారు సత్తా చాటారు. అయితే ఉత్తరాది నుంచి దిగుమతయ్యే గ్లామర్ డోస్ పెరగడం మొదలైన దగ్గర నుంచి కధానాయిక ప్రాధాన్యమున్న సినిమాల జోరు తగ్గడం కూడా మొదలైంది.
అదే క్రమంలో కధానాయిక ప్రాధాన్య చిత్రాలు తీయడమే అరుదైపోగా అరకొర గా వచ్చినవి కూడా జనాదరణ పొందలేక పోయాయి. మొన్నటి సమంత శాకుంతలం నుంచి నిన్నటి అనుష్క ఘాటి దాకా బాక్సాఫీస్ దగ్గర దారుణంగా చతికిలబడ్డాయి. దీంతో హీరోయిన్ ప్రాధాన్యమున్న చిత్రాలను తీసి మెప్పించే సత్తా టాలీవుడ్ కోల్పోయిందా? లేక చూసే ఆసక్తిని ప్రేక్షకులు కోల్పోయారా? అనే ప్రశ్నలు తలెత్తాయి.
ఈ నేపధ్యంలో ఇటీవల విడుదలైన మహిళా ప్రధాన చిత్రాలైన ’8 వసంతాలు’ ’పరదా’ ది గర్ల్ ఫ్రెండ్ బాక్సాఫీస్ ట్రెండ్‌లను బట్టి చూస్తే, సమస్య ప్రేక్షకుల దగ్గర లేదని సినిమా రూపకర్తల దగ్గరే ఉందని తేలిపోయింది. ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వం వహించిన ’8 వసంతాలు’ చిత్రం జూన్ 20న ’కుబేరా’ చిత్రంతో పాటు విడుదలైంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించినప్పటికీ, ఈ చిత్రం విడుదలకి ముందు ప్రేక్షకులలో హైప్‌ని రేకెత్తించడంలో విఫలమైంది. ఫలితంగా, ఇది బాక్సాఫీస్ దగ్గర పరాజయం పాలైంది. ఆ మరుసటి రోజునే అనుపమ పరమేశ్వరన్ నటించిన ’పరదా’ చిత్రం విడుదలైంది. సినిమా కంటెంట్ సంగతి పక్కన పెడితే, మొదటి రోజు వసూళ్లను బట్టి చూస్తే, ఈ సినిమా థియేటర్లలోకి వచ్చిందనే విషయం కూడా చాలా మందికి తెలియనే తెలీదు.
నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటించిన ’గర్ల్‌ఫ్రెండ్’ ఒక్కటే మరోసారి కధానాయిక ప్రాధాన్యమున్న చిత్రాల విజయాలకు ఊపిరి పోసింది. అంటే జనాన్ని థియేటర్లకు రప్పించడంలో ప్రస్తుతం రష్మికకు ఉన్న క్రేజ్ కూడా ఉపకరించిందని ఒప్పుకోవాలి. ఏదేమైనా ఒక మహిళా ప్రధాన చిత్రం మంచి కాన్సెప్ట్‌తో తగిన సత్తా కలిగిన నటితో వస్తే, ప్రజలు వాటిని ఖచ్చితంగా ఆదరిస్తారని మరోసారి ఈ సినిమాతో రుజువైంది. మరోవైపు ధియేటర్లకు వెళ్లకున్నా, ఓటీటీ వేదికలపై ’8 వసంతాలు’ ’పరదా’ చిత్రాలు చూసిన వారిలో అత్యధికులు ప్రశంసలు కురిపించారు.
కాబట్టి మహిళా ప్రధాన చిత్రాల పట్ల ఆదరణ, ఆసక్తి పూర్తిగా లేదని మనం చెప్పలేం. నిజానికి ఒకప్పటితో పోలిస్తే ఈ రోజుల్లో, ప్రేక్షకులు సినిమాల్లో నటీనటులు ఎవరనేది కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు, కాకపోతే వారు థియేటర్లకు వెళ్ళడానికి మాత్రం కొన్ని షరతులు కలిగి ఉన్నట్టు అనిపిస్తుంది. ముఖ్యంగా అగ్రహీరోలు, పెద్ద బ్యానర్లు, లేదా భారీ బడ్జెట్‌తో నిర్మించిన చిత్రాలను మాత్రమే థియేటర్ కోసం ఎంచుకుంటున్నారు. లేదంటే నటీనటులు ఎవరైనప్పటికీ, తక్కువ బడ్జెట్‌తో నిర్మించినప్పటికీ పాజిటివ్ టాక్ వచ్చిన చిత్రాలను చూడటానికి మాత్రం థియేటర్లకు వెళ్తున్నారు. ఈ పరిస్థితుల్లో పేక్షకులను థియేటర్లకు రప్పించేది ఏదో మహిళా ప్రధాన చిత్రాల్లో లోపిస్తోందనేది నిర్వివాదం. అదేంటో సమీక్షించుకుని సరిచేసుకోగలిగితే మరోసారి మహిళా చిత్రాల విజయ పరంపర మొదలు కావచ్చు.


