ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే విధంగా, ఒక మంచి అనుభూతిని పంచే చిత్రంగా చాంపియన్ చిత్రం నిలుస్తుందని హీరో రోషన్ ధీమా వ్యక్తం చేశారు. ప్రదీప్ అద్వైతం దర్శకత్వంలో అనస్వర రాజన్ కథానాయికగా తెరకెక్కిన ఈ చిత్రం ఈనెల 25న విడుదల కానుంది. చిత్ర ప్రమోషన్లలో భాగంగా ఆదివారం రాత్రి బీచ్ రోడ్డులో గ్రాండ్‌గా మ్యూజికల్ నైట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో రోషన్ మాట్లాడుతూ నటనలో పరిణతి సాధించేందుకే ‘పెళ్లి సందడి’ తర్వాత కావాలనే విరామం తీసుకున్నానని తెలిపారు.
1948 నేపథ్యంలో సాగే ఈ యాక్షన్ వార్ డ్రామాలో తాను ఫుట్‌బాల్ ఆటగాడిగా కనిపిస్తానని, తనను తాను కొత్తగా మలుచుకున్నానని పేర్కొన్నారు. పీటర్ హెయిన్ మాస్టర్ పర్యవేక్షణలో అద్భుతమైన పోరాట ఘట్టాలు ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని వివరించారు. కథానాయిక అనస్వర రాజన్ మాట్లాడుతూ వైజాగ్ అంటే తనకు ఎంతో ఇష్టమని, ఈ సినిమా పక్కా బ్లాక్‌బస్టర్‌గా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నిర్మాత జెమిని కిరణ్ మాట్లాడుతూ చిత్రంలోని ‘గిర గిరా’ సాంగ్ ఇప్పటికే సూపర్ హిట్ అయిందని, సినిమా కూడా అందరినీ అలరిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నటి ఊహతో పాటు చిత్ర బృందం పాల్గొంది.


