'రాక్షసుడు' అనే తమిళ సినిమాతో మన ప్రేక్షకులకు కాస్త పరిచయమైన యంగ్ హీరో విష్ణు విశాల్. మట్టీ కుస్తీ, అరణ్య లాంటి తెలుగు మూవీస్ చేసినప్పటికీ పెద్దగా వర్కౌట్ కాలేదు. దీంతో చాలా గ్యాప్ తర్వాత 'రాక్షసుడు' తరహా మర్డర్ మిస్టరీ థ్రిల్లర్‌తో వచ్చాడు. అదే 'ఆర్యన్'. తమిళంలో గత వారం రిలీజ్ కాగా.. ఇప్పుడు(నవంబరు 07) తెలుగులోనూ థియేటర్లలో విడుదలైంది. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.
(ఇదీ చదవండి: The Girlfriend: రష్మిక ‘ది గర్ల్‌ఫ్రెండ్’ మూవీ రివ్యూ)
కథేంటి?
ఆత్రేయ (సెల్వ రాఘవన్) అనే వ్యక్తి... ప్రముఖ న్యూస్ ఛానెల్‌లో నయన(శ్రద్ధా శ్రీనాథ్) హోస్ట్ చేస్తున్న షోకి వస్తాడు. గన్‌తో అందరినీ బెదిరించి భయపెట్టేస్తాడు. తను ఓ ఫెయిల్యూర్ రచయితనని ఓ థ్రిల్లింగ్ కథ చెబుతానని అంటాడు. రాబోయే ఐదు రోజుల్లో ఐదు హత్యలు చేస్తానని.. ఎవరో చెప్పి మరీ చంపేస్తానని చెబుతాడు. అలా చెప్పిన కాసేపటికే గన్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకుంటాడు. ఈ కేసుని పైఅధికారులు.. పోలీసాఫీసర్ నంది(విష్ణు విశాల్)కి అప్పజెబుతారు. చెప్పినట్లే ఆత్రేయ చనిపోయినా వరస హత్యలు జరుగుతూ ఉంటాయి. ఇంతకీ ఇదెలా సాధ్యం? ఆత్రేయ ఎవరు? వీళ్లనే ఎందుకు చంపుతున్నాడు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.

ఎలా ఉందంటే?
సాధారణంగా మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ అనగానే ఓ ఫార్మాట్ ఉంటుంది. హత్యలు చేసే విలన్‌ని చివర్లో చూపిస్తారు లేదంటే విలన్‌ని ఇంటర్వెల్‌లో బయటపెడతారు. ఇదీ కాదంటే ప్రారంభంలోనే విలన్ ఎవరో రివీల్ చేసేసి దొంగ పోలీస్ గేమ్ తరహాలో స్టోరీని నడిపిస్తాడు. ఇవన్నీ కాకుండా సరికొత్తగా తీయొచ్చా అంటే తీయొచ్చు. అదే విషయాన్ని 'ఆర్యన్' దర్శకుడు నిరూపించి చూపించాడు.
న్యూస్ ఛానల్ లైవ్‌లో చనిపోయిన ఓ వ్యక్తి.. తర్వాత ఐదు రోజుల్లో మనుషుల్ని చంపడం అనే డిఫరెంట్ పాయింట్‌తో ఈ సినిమా తీశారు. వినడానికి బాగానే ఉంది గానీ మూవీ ఎలా తీశారా అంటే అదిరిపోయిందనే చెప్పొచ్చు. చిన్న చిన్న పొరపాట్లు ఉన్నప్పటికీ ఓవరాల్‍గా అయితే మంచి థ్రిల్లర్ చూశామనే ఫీలింగ్ కలుగుతుంది.
హీరో ఎవరో తెలుసు. విలన్ ఎవరో తెలుసు. మరోవైపు హత్యలు జరుగుతుంటాయి. పోని చనిపోతున్నవాళ్లు చెడ్డవాళ్లా అంటే కాదు. అందరూ మంచివాళ్లు. సమాజానికి ఏదో రకంగా ఉపయోగపడేవాళ్లు. అలాంటి వాళ్లని ఎందుకు చంపాల్సి వచ్చిందనే విషయాన్ని క్లైమాక్స్ వరకు పట్టుసడలకుండా అద్భుతంగా చూపించారు. 'రాక్షసుడు' అంత కాకపోయినప్పటికీ 'ఆర్యన్' కూడా బాగుంది.
కథంతా సీరియస్ టెంపోలో వెళ్తున్న టైంలో హీరో, అతడి భార్యతో విడాకులు, కోర్టు వాదనలు ఈ సీన్స్ అన్నీ అనవసరం అనిపిస్తాయి. అసలు ఈ సన్నివేశాలు సినిమాలో లేకపోయినా సరే స్టోరీలా పెద్దగా పోయేదేం ఉండదు కదా అనిపిస్తుంది. సినిమా అంతా బాగానే ఉంటుంది గానీ క్లైమాక్స్‌లో ఈ హత్యల వెనక కారణం కరెక్ట్ కాదు కదా అనిపిస్తుంది. అదే విషయాన్ని విష్ణు విశాల్ పోషించిన నంది పాత్రతోనూ చెప్పించారు.

ఎవరెలా చేశారు?
నంది అనే పోలీసాఫీసర్‌గా విష్ణు విశాల్ అదరగొట్టేశాడు. ఫిజిక్, యాక్టింగ్ అన్నీ కూడా నిజంగానే పోలీస్‌ని చూస్తున్నామా అనే ఫీలింగ్ కలిగించాయి. నయనగా చేసిన శ్రద్ధా శ్రీనాథ్, నంది భార్య అనితగా చేసిన మానస చౌదరివి సైడ్ క్యారెక్టర్స్ లాంటి పాత్రలు. చాలా పరిమితంగా సీన్స్ ఉంటాయి. విలన్ ఆత్రేయగా సెల్వ రాఘవన్ మెప్పించాడు. మిగిలిన పాత్రధారులు ఓకే.
టెక్నికల్ అంశాలకొస్తే.. థ్రిల్లర్ సినిమాలకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా కీలకం. జిబ్రాన్ ఈ విషయంలో అదరగొట్టేశాడు. కొన్ని సన్నివేశాల్లో అయితే తెరపై సీన్, వెనక నేపథ్య సంగీతం వింటుంటే టెన్షన్ వచ్చేస్తుంటుంది. ఆ రేంజ్ సౌండింగ్ ఇచ్చాడు. సినిమాటోగ్రఫీ డీసెంట్. డైరెక్టర్ ప్రవీణ్ వావ్ అనిపించాడు. ఓవరాల్‌గా సరికొత్త థ్రిల్లర్ చూద్దామనుకుంటే మాత్రం దీన్ని మిస్ అవ్వొద్దు.
- చందు డొంకాన
(ఇదీ చదవండి: ‘జటాధర’ మూవీ రివ్యూ)


