కొద్దిరోజుల్లో టాలీవుడ్ కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టబోతుంది. అయితే, 2025లో బాక్సాఫీస్ వద్ద టాలీవుడ్ వాటా రేంజ్ ఎంత అనేది తెలుసుకోవాలని చాలామంది ఆసక్తితో ఉంటారు. గత కొన్నేళ్లుగా హిందీ చిత్రసీమ పరిస్థితి అంత గొప్పగా ఏమీ లేదు. కానీ, ఈ ఏడాదిలో సత్తా చాటింది. ధురందర్, ఛావా, సైయారా వంటి మూడు సినిమాలే సుమారు రూ. 2,500 కోట్ల కలెక్షన్స్‌కు దగ్గర్లో ఉన్నాయి. అయితే, ఈ ఏడాది టాలీవుడ్ పరిస్థితి చెప్పుకోతగినంత రేంజ్‌లో లేదు. అత్యధిక వసూళ్లు రాబట్టిన టాప్-10 చిత్రాల్లో ఓజీ మాత్రమే ఉంది.
అదే గతేడాదిలో అయితే పుష్ప2, కల్కి, దేవర, హనుమాన్ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలు టాప్- 10లో ఉన్నాయి. ఈ నాలుగు సినిమాలు ఏకంగా రూ. 3600 కోట్లు రాబట్టాయి. దీంతో గతేడాది ఇండియన్ సినిమా మార్కెట్‌లో తెలుగు పరిశ్రమ వాటానే ఎక్కువగా ఉంది. 2024లో టాలీవుడ్ మొత్తం ప్రపంచవ్యాప్త వసూళ్లు సుమారు రు. 7,924 కోట్ల గ్రాస్ ఉంది.
2025లో మరింత ఉత్సాహంతో భారతీయ సినీ పరిశ్రమ అడుగుపెట్టింది. ఈ ఏడాదిలో మెత్తం భాషలలో కలిపి దేశవ్యాప్తంగా 1546 సినిమాలు విడుదలయ్యాయి. అన్ని సినిమాలు రూ. 12,604 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాయి. నెట్ పరంగా చూస్తే రూ. 10696 కోట్లుగా ఉంది. అయితే, కేవలం హిందీ పరిశ్రమ నుంచి ఈ ఏడాది 231 సినిమాలు విడుదలైతే రూ. 4,639 కోట్ల గ్రాస్ వచ్చింది. తర్వాతి స్థానంలో టాలీవుడ్ ఉంది. తెలుగులో విడుదలైన 274 సినిమాలకు గాను రూ. 2,551 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఆ తర్వాతి స్థానంలో తమిళ ఇండస్ట్రీ రూ. 1,533 కోట్ల గ్రాస్‌తో ఉంది. కన్నడ రూ. 1,100 కోట్లు, మలయాళం రూ. 919 కోట్లతో వరుసగా ఉన్నాయి.
బాలీవుడ్‌లో సత్తా చూపని తెలుగు సినిమా
ఈ ఏడాదిలో తెలుగు సినిమా కలెక్షన్స్ పెద్దగా ప్రభావం చూపలేదు. కనీసం రూ. 500 కోట్లు రాబట్టిన సినిమా ఒక్కటీ లేదు. ఓజీ, సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలు మాత్రమే రూ. 300 కోట్ల కలెక్షన్స్‌తో టాప్‌లో ఉన్నాయి. తర్వాత మిరాయ్, డాకు మహారాజ్, హిట్, కుబేర వంటి చిత్రాలు మాత్రమే కాస్త మెప్పించాయి. అయితే, ఈ ఏడాదిలో భారీ అంచనాలతో విడుదలైన గేమ్ ఛేంజర్ నిరాశపరిచింది. రూ. 500 కోట్ల కలెక్షన్స్ సాధిస్తుందని అందరూ అనుకుంటే ఆశించినంత రేంజ్‌లో రీచ్ కాలేదు. ఆపై హరిహర వీరమల్లు, కింగ్‌డమ్, ఘాటీ, మాస్ జాతర, అఖండ-2 వంటి సినిమాలు కూడా అదే బాటలో నిలిచాయి. ఫైనల్‌గా 2025 టాలీవుడ్‌కు అనుకున్నంత రేంజ్‌లో కలెక్షన్స్ సాధించిన సినిమాలు పడలేదు.


