బిగ్ బాస్ దాదాపు 9ఏళ్ళ క్రితం తెలుగులో అడుగుపెట్టిన ఈ కార్యక్రమం ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. స్టార్ మా ఛానల్ రేటింగ్స్ ను ఆకాశానికి ఎత్తేసింది ఈ కార్యక్రమం. బిగ్ బాస్ ప్రోగ్రాంకి ముఖ్యంగా ఆ క్రేజ్ ఎలా వచ్చిందంటే దాని చుట్టూ వచ్చే వివాదాలే ముఖ్యకారణం. వివాదం లేని సీజన్ ఇప్పటిదాకా జరగలేదు. తాజాగా ఈ బిగ్ బాస్ 9వ సీజన్ పూర్తి చేసుకుంది. మరి ఈ సీజన్ ఎలా గడిచిందో ఈ బిగ్ రివ్యూ లో చూద్దాం.
బిగ్ బాస్ సీజన్ 9(Bigg Boss 9 Telugu ) ఆరంభం అదుర్స్ ముగింపు ముదుర్స్ అని చెప్పవచ్చు. సెప్టెంబర్ 7 న అట్టహాసంగా ప్రారంభమైన ఈ షో 22మంది కంటెస్టెంట్లతో మూడు నెలలకు పైగా ప్రేక్షకులను అలరించింది. ప్రముఖ నటులు నాగార్జున ముందు చేసిన 6 సీజన్లతో పాటు ఈ సీజన్ కూడా వ్యాఖ్యాతగా వ్యవహరించి తనదైన శైలిలో షోకు ఆయువుపట్టుగా మారారు. ఈసారి హౌస్ లోకి సెలబ్రిటీ స్టేటస్ లేని వాళ్ళను 7 మందిని పంపడం విశేషం. అందులోనూ సెలబ్రిటీ కాని వ్యక్తి అయిన కళ్యాణ్ పడాల ట్రోఫీ కూడా గెలుచుకోవడం మరో విశేషం. మునుపటి సీజన్లతో పోలిస్తే ఈ షోలో కంటెస్టెంట్ల మధ్య మసాలాలు కాస్త మోతాదుకు మించి జరిగాయని చెప్పవచ్చు.

అంతేకాదు అభ్యంతరకర పదజాలంతో సీజన్ లోని ఒకటి రెండు ఎపిసోడ్స్ లో కంటెస్టెంట్లు విపరీత ధోరణి తో మితిమీరి పోయారు. అయితే ఇప్పటి ఓటిటి కాలం ప్రేక్షకులకు ఇదేమంత పెద్ద విషయం కాదు. ఇక ఈ సీజన్ లో కంటెస్టెంట్ల బాండింగులకు కొదవే లేదు. దాదాపుగా కుటుంబంలో ఎన్ని బంధాలైతే ఉంటాయో అంతకన్నా ఎక్కువే హౌస్ లో కంటెస్టెంట్ల మధ్య భారీగానే నడిచాయి. వాటిలో తనూజ, దివ్య, భరణి మధ్య నడిచిన బంధంతో పాటు డెమోన్ పవన్, రీతూ మధ్య నడిచిన ప్రేమాయణం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ సీజన్ లో ఆసక్తికరమైన పరిణామం ఏమిటంటే ఎప్పూడూ తన గంభీర వదనంతో సుపరిచితుడైన బిగ్ బాస్ ఎన్నడూ లేని విధంగా తన కంటెస్టెంట్ లో ఒకరిని హౌస్ లో ఉండమని వేడుకోవడం.

సంజన విషయంలో జరిగిన ఈ ఘటన సీజన్ కే హైలైట్ గా నిలిచింది. ఘనంగా ప్రారంభించిన ఈ సీజన్ పేలవంగా ముగించారు. మామూలుగా ప్రతి సీజన్ ముగింపు దశలో చూపే హడావిడి ఈ సీజన్ లో బాగా తగ్గిందని చెప్పవచ్చు. ప్రతి సీజన్ ఆఖర్లో బయటకు వెళ్ళిన కంటెస్టెంట్లను హౌస్ లోకి ఆఖరున పిలిచి పండుగ కోలాహలంతో నింపేవారు. కాని ఈ సీజన్ లో ఆ ఊసే లేదు. అంతేకాకుండా ఫినాలే కప్పును పెద్ద సెలబ్రిటీతో విన్నర్ కు ప్రెజెంట్ చేసే ఆనవాయితీని కూడా ఈ సారి టీం పక్కన పెట్టేసింది. సెలబ్రిటీలు ఈ సారి దొరకలేదో ఏమో కాని ఫినాలేలో రోబోలతో కూడా ఒక ఎలిమినేషన్ అనౌన్స్ చేయించారు. ఏది ఏమైనప్పటికీ ఈ బిగ్ బాస్ సీజన్ 9 ఆరంభం అదుర్స్ ముగింపు ముదుర్స్.
- హరికృష్ణ ఇంటూరు


