ఇటీవల ఒక్క మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న కథానాయకులలో జీవీ ప్రకాశ్ కుమార్ ఒకరని చెప్పవచ్చు. ప్రముఖ సంగీత దర్శకుడిగా రాణిస్తున్న ఈయన ఇప్పటికే శత చిత్రాలకు చేరుకున్నారు. పరాశక్తి జీవీ.ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్న 100వ చిత్రం. అదేవిధంగా సంగీత దర్శకుడుగా జాతీయ అవార్డు అందుకున్న ఈయన హీరోగానూ నటిస్తున్న విషయం తెలిసిందే. డార్లింగ్, బ్యాచిలర్ వంటి సక్సెస్‌ఫుల్ చిత్రాల్లో నటించారు.
హ్యాపీరాజ్‌మూవీ
అయితే ఇటీవల ఈయన కథానాయకుడిగా నటించిన చిత్రాలు ఆశించిన స్థాయిలో విజయాలను అందుకోలేకపోతున్నాయి. చివరగా ఈయన నటించిన బ్లాక్ మెయిల్ చిత్రం పర్వాలేదు అనిపించుకుంది. తాజాగా హ్యాపీరాజ్‌మూవీలో హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా నటుడు, దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ శిష్యుడు ఇళంసెళియన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. గౌరీప్రియ హీరోయిన్. ఈ చిత్రంలో ప్రేమదేశం హీరో అబ్బాస్ ముఖ్యపాత్ర పోషిస్తున్నారు.
పదేళ్ల తర్వాత రీఎంట్రీ
గతంలో హీరోగా తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో నటించిన ఈయన చాలా కాలం క్రితమే దుబాయిలో సెటిల్ అయ్యారు. తాజాగా హ్యాపీరాజ్ ద్వారా దాదాపు పదేళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తున్నారు. బియాండ్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ మూవీ వైవిధ్య భరిత ప్రేమ కథా చిత్రంగా ఉంటుందని యూనిట్ సభ్యులు పేర్కొన్నారు. ఈ చిత్ర ప్రోమో వీడియోను శనివారం విడుదల చేశారు. ఇందులో అబ్బాస్ ఐయామ్ బ్యాక్ అంటూ బరిలోకి దిగాడు. ఇది ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.


