టైటిల్: జటాధర
నటీనటులు: సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా, శిల్పా శిరోద్కర్, దివ్య ఖోస్లా, రాజీవ్ కనకాల,ఝాన్సీ, అవసరాల శ్రీనివాస్ తదితరులు
నిర్మాతలు: ఉమేష్ కుమార్ బన్సల్, శివిన్ నారంగ్, అరుణ అగర్వాల్, ప్రేరణ అరోరా, శిల్పా సింగ్‌హల్, నిఖిల్ నందా
దర్శకత్వం: వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వా
సంగీతం: రాజీవ్ రాజ్
విడుదల తేది: నవంబర్ 7, 2025
కథేంటంటే..
శివ(సుధీర్ బాబు) దెయ్యాలు ఉన్నాయని నమ్మని ఓ ఘోస్ట్ హంటర్. సైన్స్ని మాత్రమే నమ్ముతూ.. దెయ్యాలు ఉన్నాయని ప్రచారం జరిగిన చోటికి వెళ్లి రీసెర్చ్ చేస్తుంటాడు. అతని తల్లిదండ్రులకు(ఝాన్సీ, రాజీవ్ కనకాల) ఈ విషయం తెలియదు. ఓ రోజు ప్రముఖ ఘోస్ట్ హంటర్ మణిశర్మ(అవసరాల శ్రీనివాస్) అసిస్టెంట్ అంకిత్ అనుమానాస్పదంగా మరణించడంతో.. శివ రుద్రారం అనే గ్రామానికి వెళ్తాడు. ఈ విషయం అతని తల్లిదండ్రులకు తెలియడంతో ఆందోళన చెందుతారు. ఆ గ్రామానికి వెళ్లకూడదంటూ శివ గతం గురించి చెబుతారు. శివ గతం ఏంటి? రుద్రారం గ్రామానికి, అతనికి ఉన్న సంబంధం ఏంటి? ధన పిశాచి(సోనాక్షి సిన్హా) ఆ గ్రామంలోనే ఎందుకు తిష్ట వేసింది? ధన పిశాచి వల్ల శివ ఫ్యామిలీకి జరిగిన అన్యాయం ఏంటి? తన పేరెంట్స్ ఆత్మలకు శాంతి కలిగించేందుకు శివ ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? ఈ సినిమాలో శిల్పా శిరోద్కర్ పాత్ర ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే..
ఎలా ఉందంటే..
నిధుల కోసం తవ్వకాలు.. వాటికి రక్షణగా క్షుద్రశక్తులు ఉండడం.. దెయ్యాలు అంటే నమ్మని హీరో అనుకోకుండా అక్కడికి వెళ్లడం.. ఫ్లాష్బ్యాక్లో ఆ ప్రాంతంతో హీరోకి సంబంధం ఉందనే విషయం తెలియడం.. చివరకు దైవశక్తి సహాయంతో హీరో క్షుద్రశక్తులను అంతం చేయడం.. మైథలాజికల్ జానర్లో వచ్చే హారర్ చిత్రాల నేపథ్యం దాదాపు ఇలాగే ఉంటుంది. అయితే ప్రేక్షకులను ఎంత మేరకు థ్రిల్కి గురిచేశారనేదానిపై ఫలితం ఆధారపడి ఉంటుంది.
కాస్త భయపెట్టి.. ప్లాష్‌బ్యాక్ స్టోరీని ఎమోషనల్గా తీర్చిదిద్దితే చాలు సినిమాని హిట్ చేస్తారు. జటాధరలో అది మిస్సయింది. ఇటు పూర్తిగా భయపెట్టనూ లేదు.. అటు ఎమోషనల్గానూ ఆకట్టుకోలేకపోయారు. కథలో కొత్తదనం ఎలాగూ లేదు.. కథనాన్ని అయినా కాస్త ఆసక్తికరంగా నడిపించే ప్రయత్నం చేయలేదు. సినిమా ప్రారంభం నుంచి ఎండింగ్ వరకు ఎక్కడా కూడా హైప్ ఇచ్చే సీన్ కనిపించదు. శివుడి ఎపిసోడ్ కూడా పూర్తిగా ఆకట్టుకునేలా తీర్చిదిద్దలేకపోయారు.
ఒకప్పుడు నిధులను ఎందుకు భూమిలో పాతిపెట్టేవారో వివరిస్తూ కథను ప్రారంభించారు దర్శకులు. ఆ నిధులకు రక్షణగా బంధనం వేసేవారని.. అందులో ధన పిశాచి బంధనం అతి భయంకరమైనదంటూ ఆసక్తికరంగా కథ ప్రారంభం అవుతుంది. ఆ వెంటనే ఘోస్ట్ హంటర్‌గా హీరోని పరిచయం చేశారు. దెయ్యాలు లేవని ఎందుకు బలంగా నమ్ముతున్నాడో వివరిస్తూ ఓ ప్లాష్‌బ్యాక్ స్టోరీ చెప్పడం వరకు కథనం ఇంట్రెస్టింగానే అనిపిస్తుంది. ఆ తర్వాత కథనం చప్పగా సాగుతుంది. ఘోస్ట్ హంటర్‌గా హీరో చేసే విన్యాసాలు ఆకట్టుకోకపోగా.. సాగదీతగా అనిపిస్తాయి. మధ్యలో వచ్చే హీరోహీరోయిన్ల లవ్‌స్టోరీ సహనానికి పరీక్షగా మారుతుంది. ఫస్టాఫ్ మొత్తం కథనం అక్కడక్కడే తిరుగుతున్నట్లు అనిపిస్తుంది.
మధ్యమధ్యలో వచ్చిన ధన పిశాచి ప్రేక్షకులను భయపెట్టలేకపోయింది. ఇంటర్వెల్ సీన్ సెకండాఫ్‌పై కాస్త ఆసక్తిని పెంచుతుంది. కానీ ద్వితీయార్థంలో వచ్చే ప్లాష్‌బ్యాక్ స్టోరీ కూడా సాగదీసినట్లుగానే ఉంటుంది. ఒక్క సీన్‌లో చెప్పాల్సిన కథని ఐదారు సీన్లలో చెప్పినట్లుగా అనిపిస్తుంది. ధన పిశాచి ఎపిసోడ్ కూడా ఏమంత ఆకట్టుకోలేదు. ఇక చివరిలో వచ్చిన శివుడి ఎపిసోడ్ కూడా ప్రేక్షకుడిలో జోష్ నింపలేకపోయింది. ఈ సినిమాకు పార్ట్ 2 కూడా ఉందని చెబుతూ శుభం కార్డు వేశారు.
ఎవరెలా చేశారంటే..
సుధీర్ బాబు తన పాత్రకు న్యాయం చేసేందుకు చాలా ప్రయత్నం చేశారు. కానీ ఆ పాత్రని తీర్చిదిద్దిన విధానంలోనే లోపం ఉండడంతో ఆయన పడిన కష్టం బూడిదలో పోసిన పన్నీరుగా మారింది. దివ్య ఖోస్లా పాత్ర నిడివి తక్కువే ఉన్నా.. నటన పరంగా పర్వాలేదు. కానీ సుధీర్‌కి జోడీగా మాత్రం సెట్ కాలేదనే చెప్పాలి. నెగెటివ్ షేడ్ ఉన్న శోభ పాత్రలో శిల్పా శిరోద్కర్ ఒదిగిపోయింది. ధన పిశాచిగా సోనాక్షి సిన్హా.. లుక్‌పరంగా భయంకరంగా ఉన్నా.. ప్రేక్షకుడిని భయపెట్టడంలో మాత్రం విఫలం అయింది.
ఆమె పాత్రకు పెద్ద డైలాగులు కూడా లేవు. గట్టిగా నవ్వడం.. అరవడం తప్ప ఆమెకు సరైన డైలాగులే పడలేదు. రాజీవ్ కనకాల, శుభలేఖ సుధాకర్, రోహిత్ పాఠక్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. నేపథ్య సంగీతం ఆకట్టుకునే విధంగా లేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. వీఎఫ్‌ఎక్స్ విభాగం పనితీరు జస్ట్ ఓకే. నిర్మాణ విలువలు బాగున్నాయి.


