దేశవ్యాప్తంగా బిగ్ బాస్ ప్రారంభమై దాదాపు పాతికేళ్లు కావస్తోంది. హిందీతో మొదలుకుని ఈ రెండున్నర దశాబ్ధాల గమనంలో ఒకటొకటిగా పలు ప్రాంతీయ భాషలకు ఈ రియాల్టీ షో విస్తరించిన సంగతి తెలిసిందే. తెలుగులోనూ ఈ షో సూపర్ హిట్ అవడం, సీజన్ సీజన్‌కూ రేటింగ్స్ పెంచుకుంటూ పోతోంది. తాజా తెలుగు బిగ్‌బాస్ సీజన్ ముగిసి విజేత ఎవరో కూడా తేలిపోయింది. ఈ నేపధ్యంలోనే విజేతతో పాటు పాల్గొనేవారికి అందే పారితోషికాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి.
ఓ వైపు ఆదరణతో పాటు ఆదాయం కూడా పెంచుకుంటున్న బిగ్ బాస్ కంటెస్టెంట్లకు కూడా ఆ మేరకు పారితోషికాలు అందిస్తోంది. అయితే సహజంగానే అత్యధిక వ్యూయర్‌షిప్ కారణంగా హిందీ బిగ్ బాస్ లో పాల్గొన్నవారికే అత్యధిక ఆదాయాలు అందుతాయి అనే మనం భావిస్తాం కానీ... ఈ విషయంలో తెలుగు బిగ్ బాస్ కూడా థీటుగానే పోటీపడుతోంది. ఇప్పటి దాకా మన దేశం నుంచి బిగ్ బాస్‌లో పాల్గొని అత్యధిక రెమ్యునరేషన్స్ పొందిన వారిలో ది గ్రేట్ ఖలీ గా పిలవబడే మాజీ రెజ్లర్ దలీప్ సింగ్ రానా ముందున్నారు.
(చదవండి: పోరాడి ఓడిన తనూజ.. భారీ పారితోషికమే ముట్టింది!)
ఆయన బిగ్‌బాస్ 4వ సీజన్‌లో వారానికి దాదాపు రూ.50లక్షలు అందుకున్నారు. అదే విధంగా బిగ్ బాస్ 12వ సీజన్‌లో పాల్గొన్న మాజీ క్రికెటర్ శ్రీశాంత్ కూడా దాదాపు అంతే మొత్తాన్ని దక్కించుకున్నారు. కరణ్‌వీర్ బోహ్రా. తహసీన్ పూనావాలా ఇటీవల గౌరవ్ ఖన్నా తదితర తారలు కూడా దాదాపుగా వారానికి రూ.20లక్షలు దాకా అందుకుని అత్యధిక ఆదాయం పొందిన వారుగా నిలిచారు
(చదవండి: బిగ్ బాస్ బిగ్ రివ్యూ - ఆరంభం అదుర్స్, ముగింపు ముదుర్స్)
వీరందరినీ అలా ఉంచితే భారతేశపు బిగ్ బాస్ చరిత్రలో అత్యధిక పారితోషికం అందుకున్న రికార్డ్ ఒకే ఒక నటికి దక్కింది. ఆమె కూడా భారతదేశానికి చెందని నటి కావడం విశేషం. అలా బిగ్ బాస్ లో ఎవరికీ దక్కనంత ప్రైజ్ మనీని అందుకున్న ఏకైక కంటెస్టెంట్ పమేలా ఆండర్సన్. ఈ అందాల భామ అమెరికాకు చెందిన హాలీవుడ్ నటి. పాతికేళ్ల క్రితం బే వాచ్ అనే షో ద్వారా విశ్వవ్యాప్తంగా ఆమె గ్లామర్ సెన్సేషన్ సృష్టించింది.
మన దేశంలోనూ ఆమెకు ఉన్న పాప్యులారిటీ బిగ్ బాస్ షోలో ఆమెకు రెడ్ కార్పెట్ పరిచింది. ఆమె సీజన్ 4లో కేవలం మూడు రోజుల పాటు కనిపించినందుకు ఏకంగా రూ.2.5 కోట్లు సంపాదించినట్లు సమాచారం, తద్వారా తక్కువ కాలం పాటు పాల్గొని ఎక్కువ ఆదాయం ఆర్జించిన నటిగా ఆమె చెరిగిపోని రికార్డును నెలకొల్పింది. హిందీ బిగ్ బాస్ ఆ సీజన్‌లో అత్యధిక టిఆర్పీలు కూడా అందుకుంది.


