ఈ ఏడాది కాంతారా చాప్టర్-1 రిషబ్ శెట్టిదే హవా అనుకున్నాం. ఆ మూవీనే 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన రికార్డ్ చెదరదని ఫిక్సయిపోయాం. అంతేకాకుండా విక్కీ కౌశల్ ఛావాను కొట్టే చిత్రం ఈ ఏడాది బాలీవుడ్ రావడం కష్టమే అనుకున్నాం. మరికొద్ది రోజుల్లోనే ఈ సంవత్సరం ముగియనుందగా.. ఆ రెండు రికార్డ్స్ చెక్కు చెదరవని ఈ సినిమాలు తీసినవాళ్లు సైతం అనుకునే ఉంటారు. కానీ పెద్దగా అంచనాలు లేకుండా వచ్చి బాక్సాఫీస్‌ను ఓ రేంజ్‌లో షేక్ చేస్తోంది ఆ సినిమా. డిసెంబర్ 5 తేదీకున్న మహిమో.. ఏమో గానీ ఈ ఏడాది బాక్సాఫీస్ లెక్కలను మాత్రం తారుమారు చేస్తూ దూసుకెళ్తోంది. ఇంతకీ ఆ సినిమాకు ఎందుకింత సక్సెస్ అయింది.. అదే ఈ సినిమాకు ప్లస్‌గా మారిందా? అనేది తెలుసుకుందాం.
ఈ రోజుల్లో సినిమాలకు భారీ కలెక్షన్స్ రావడమంటే మామూలు విషయం కాదు. ఓటీటీలు వచ్చాక చాలామంది థియేటర్లకు వెళ్లడం తగ్గించేశారు. పెద్ద పెద్ద స్టార్స్ ఉంటే తప్ప థియేటర్స్ వైపు కన్నెత్తి చూడటం లేదు. ఇక చిన్న సినిమాలైతే అలా వచ్చి ఇలా వెళ్లిపోతున్నాయి. ఇలాంటి టైమ్‌లో ఎలాంటి బజ్ లేకుండా వచ్చిన దురంధర్ మాత్రం బాక్సాఫీస్ రికార్డులు తిరగరాస్తోంది. డిసెంబర్ 5న రిలీజైన ఈ చిత్రం 17 రోజుల్లోనే రూ.845 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ ఏడాది అత్యధిక వసూళ్ల లిస్ట్‌లో రెండో స్థానంలో ఉన్న ఛావాను అధిగమించింది. ఇక మరో ఏడు కోట్లు వస్తే చాలు కాంతార చాప్టర్-1 రికార్డ్ బ్రేక్ చేయనుంది. సైలెంట్‌గా వచ్చిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ ఇంతలా దూసుకెళ్లడానికి కారణాలేంటి? గతంలో ఇలాంటి జోనర్‌లో చాలా సినిమాలు వచ్చినా దురంధర్ క్రేజ్ అందుకోలేకపోయాయి. కేవలం హిందీలో విడుదలై ప్రభంజనం సృష్టించడానికి అదొక్కటే ప్రధాన కారణమా? అనేది తెలుసుకుందాం.
సాధారణంగా స్పై, గూఢచారి సినిమాలు యుద్ధాల నేపథ్యంలో తెరకెక్కిస్తుంటారు. వీటిలో కొన్ని ఫిక్షనల్.. అలాగే మరికొన్ని రియల్ వార్స్ కూడా ఉంటాయి. అలా వచ్చిన దురంధర్ డైరెక్టర్ కూడా పాకిస్తాన్ నేపథ్యంగా కథను ఎంచుకున్నారు. అక్కడ ఓ ప్రాంతంలోని ఉగ్రవాద నెట్‌వర్క్ ఆధారంగా దురంధర్ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు ఆదిత్య ధార్. ఈ మూవీలో భారతీయ ఏజెంట్ అయిన హంజా పాత్రలో రణ్‌వీర్ సింగ్ నటించారు. పాకిస్తాన్ టార్గెట్‌గా ఈ మూవీని తెరకెక్కించడం దురంధర్‌కు బాగా కలిసొచ్చినట్లు తెలుస్తోంది.
హృతిక్ రోషన్ విమర్శలు..
బాలీవుడ్ స్టార్ హీరో అయిన హృతిక్ రోషన్ ఈ సినిమాను పొగుడుతూనే విమర్శించారు. అంతా బాగుంది కానీ.. రాజకీయపరమైన అంశాలను చూపించడం తనకు నచ్చలేదంటూ మాట్లాడారు. ఆ తర్వాత చాలామంది ఈ మూవీని ప్రాపగండ సినిమా అంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేశారు. ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాఠీ ఏకంగా బీజేపీ ప్రాపగండ మూవీ అంటూ ఆరోపించారు. ఇదే దురంధర్‌కు మరింత ప్లస్‌గా మారింది. సాధారణంగా పాజిటివ్ కంటే నెగెటివ్‌కే ఎక్కువ పవర్ ఉంటుందని దురంధర్‌తో నిజమైంది. ప్రాపగండ ట్యాగ్ ముద్ర వేయడం కూడా దురంధర్‌కు కలెక్షన్స్ పెరిగేందుకు మరింత ఉపయోగిపడిందనడంలో ఎలాంటి సందేహం లేదు.
కాగా.. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ స్పై థ్రిల్లర్‌లో అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, ఆర్ మాధవన్ కూడా కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీ పార్ట్- 2 మార్చి 2026లో విడుదల కానుంది.


