తమిళ ప్రముఖ నిర్మాత జ్ఞానవేల్ రాజా మరో వివాదంలో చిక్కుకున్నారు. కొన్నిరోజుల క్రితం ఈయన నిర‍్మించిన కొత్త సినిమా 'వా వాతియర్'.. సరిగ్గా రిలీజ్‌కి మరికొన్ని గంటలు ఉందనగా కోర్టు ఉత్తర్వులతో నిలిచిపోయింది. దీనికి చేసిన అప్పులు తీర్చకపోవడమే కారణం. అర్జున్ లాల్ సుందర్ దాస్ అనే వ్యక్తికి ఈయన రూ.20 కోట్ల మేర బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఈ సమస్య ఓవైపు ఉండగానే ఇప్పుడు తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్ కూడా జ్ఞానవేల్‌పై చెన్నై కోర్టులో పిటిషన్ వేశాడు.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 19 సినిమాలు.. మరి థియేటర్లలో?)
శివకార్తికేయన్ హీరోగా జ్ఞానవేల్ నిర్మాతగా 2019లో 'మిస్టర్ లోకల్' అనే సినిమా వచ్చింది. దీనికిగానూ హీరోకి రూ.15 కోట్లు ఇచ్చేలా ఒప్పందం కుదిరింది. కానీ తనకు రూ.11 కోట్లు మాత్రమే ఇచ్చి మిగతా రూ.4 కోట్లు బకాయిలు ఇప్పటివరకు చెల్లించలేదని శివకార్తికేయన్ న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. నిర్మాత.. తనకిచ్చిన పారితోషికంపై టీడీఎస్ చెల్లించకపోవడంతో తన బ్యాంక్ ఖాతా నుంచి రూ.90 లక్షల మొత్తాన్ని ఐటీ శాఖ కట్ చేసుకుందని పేర్కొన్నాడు.
తనకు బాకీ ఉన్న మిగతా రెమ్యునరేషన్ చెల్లించేవరకు జ్ఞానవేల్ నిర్మిస్తున్న సినిమాలు.. విడుదల కాకుండా నిలుపుదల చేయాలని శివకార్తికేయన్, చెన్నై కోర్టుని కోరారు. ప్రస్తుతం ఈ విషయం కోలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. ఎందుకంటే జ్ఞానవేల్ రాజా.. హీరోల సూర్య, కార్తీలకు దగ్గర బంధువే. అయితే గతేడాది ఈయన నిర్మించిన తంగలాన్, కంగువ, బడ్డీ, రెబల్ సినిమాలు.. బాక్సాఫీస్ దగ్గర దారుణమైన ఫ్లాప్స్ అయ్యాయి. సరే కార్తీ హీరోగా తీసిన సినిమా రిలీజ్ చేద్దామంటే తిరిగివ్వాల్సిన అప్పులు మెడకు చుట్టుకున్నాయి. మరి ఈ విషయంలో జ్ఞానవేల్ ఏం చేస్తాడో చూడాలి?
(ఇదీ చదవండి: పెళ్లిలో తెలుగు స్టార్ హీరో భార్యతో కీర్తి సురేశ్ డ్యాన్స్)


