టాలీవుడ్ మూవీ ఆనందం మీకు గుర్తుందా? జై ఆకాశ్ హీరోగా వచ్చిన ఈ సినిమా 2001లో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమాతోనే హీరోయిన్ రేఖ వేదవ్యాస్ వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత ఆమె పేరు కూడా ఆనందం హీరోయిన్ రేఖగా ముద్రపడిపోయింది. ఆ తర్వాత ఒకటో నెంబర్ కుర్రాడు, దొంగోడు, జానకి వెడ్స్ శ్రీరామ్, ప్రేమించుకున్నాం.. పెళ్లికి రండి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించింది. అయితే కన్నడలోనే ఎక్కువ సినిమాలు చేసి అక్కడ స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకుంది. 2014 తర్వాత అనారోగ్య కారణాలతో వెండితెరకు గుడ్‌బై చెప్పిన రేఖ.. కొన్నేళ్ల తర్వాత ఓ షోలో మెరిసింది. ప్రస్తుతం ఆమె రీ ఎంట్రీ కోసం ఎదురు చూస్తోంది.
దాదాపు 40 ఏళ్లు దాటినా కూడా ఇంకా సింగిల్‌గానే ఉంటోంది రేఖ వేదవ్యాస్. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన రేఖ వేదవ్యాస్ తన కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఆనందం సినిమానే తన ఐడెండిటీ అని చెప్పుకొచ్చింది. అయితే ఆనందం సినిమాలో హీరోగా ఉదయ్ కిరణ్ చేయాల్సిందని ఆమె వెల్లడించింది. నేను రెండు, మూడుసార్లు ఉదయ్ కిరణ్‌తో చేయాల్సిన మూవీస్ మిస్సయ్యానని తెలిపింది. కలుసుకోవాలని చిత్రంలో నేనే హీరోయిన్‌గా చేయాల్సిందని రేఖ రివీల్ చేసింది.
మీ సపోర్ట్ కావాలి..
మన ప్లాన్ చేసేది ఒకటి.. దేవుడ్ ప్లాన్ చేసేది ఒక్కటి అందుకే ఇండస్ట్రీకి దూరమయ్యానని రేఖ తెలిపింది. ప్రస్తుతం నేను మళ్లీ సినిమాల్లోకి రావాలనుకుంటున్నా..అందుకు నాకు ఇండస్ట్రీ సపోర్ట్ కావాలని మనసులోని మాట చెప్పేసింది. పెళ్లి గురించి ప్రస్తావించగా.. సల్మాన్ ఖాన్ తర్వాత నేనే సింగిల్‌గా మిగిలిపోతానేమేనని నవ్వుతూ సరదాగా చెప్పింది.
నా టైమ్ అయిపోయిందనుకున్నా..
మన జీవితంలో ఎవరినైనా మనం మోసం చేస్తే.. మనల్ని కూడా మోసం చేసేవాళ్లు ఉంటారని రేఖ తెలిపింది. మనం చేసిన తప్పులను ఆ దేవుడు లెక్కలతో సహా రాసిపెట్టుకుంటాడని నమ్మముందని పేర్కొంది. నా లైఫ్‌లో నేను ఏడ్చిన సందర్భాలు చాలా ఉన్నాయని వెల్లడించింది. అనారోగ్యం వచ్చినప్పుడు చాలా బాధపడ్డానని.. నాకు ఇక్కడ వరకే రాసిపెట్టి ఉందేమో అనుకున్నానని తెలిపింది. పైకి వెళ్లడానికి టికెట్ కన్‌ఫామ్ అయిందనుకున్నానని తన బాధను పంచుకుంది. ఇప్పుడున్న రోజుల్లో ఒక అమ్మాయికి వయసు అయిపోయిందంటే ఆంటీ, అమ్మ, ఇంకా పచ్చిగా చెప్పాలంటే ముసలిది అని పిలుస్తారని ఆవేదన వ్యక్తం చేసింది రేఖ. ఏదేమైనా ఆమె మళ్లీ వెండితెరపై కనిపించి అభిమానులను అలరించాలని కోరుకుందాం.


