● ఏటా పెరుగుతున్న అటవీశాఖ నిబంధనలు
● ప్రకృతి ఒడిలో కొలువుదీరిన
దైవాలకు దూరమవుతున్న భక్తులు
బల్మూర్: మండలంలోని బాణాల సమీపంలో కొలువుదీరిన లొద్ది మల్లయ్య దర్శనానికి ప్రతిఏటా ఏకాదశి పర్వదినాన భక్తులు, ప్రజలు కాలినడకన వేల సంఖ్యలో తరలివస్తారు. ఈ ప్రాంత ప్రజలు లొద్దిమల్లయ్య దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. లొద్ది చేరుకున్న భక్తులు ఏకాదశి రోజు ప్రత్యేక పూజలు, వ్రతాలు చేస్తారు. అయితే నల్లమల అటవీ ప్రాంతంలో కొలువుదీరిన ఈ క్షేత్రానికి వెళ్లడానికి గత కొన్నేళ్లుగా అటవీ శాఖ ఆంక్షలు అడ్డొస్తున్నాయి. ప్రస్తుతం పులుల సంతానోత్పత్తి కాలం కావడంతో అడవిలో జనసంచారంపై అధికారులు నిషేధం విధించారు. సరిగ్గా ఇదే సమయంలో తొలి ఏకాదశి పర్వదినం రావడంతో అక్కడికి వెళ్లలేక భక్తులు నిరాశకు గురవుతున్నారు. ఏడాదిలో ఒకసారి లొద్దిమల్లయ్య చెంతకు భక్తులు వెళ్లడం వల్ల అటవీ శాఖకు, జంతువుల సంరక్షణకు వచ్చే ముప్పు ఏమీ ఉండదని కొందరు అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా ఈసారి కూడా తొలి ఏకాదశి పర్వదినాన లొద్ది మల్లన్న దర్శన భాగ్యం లేనట్లేనా అని భక్తులు నిట్టూర్పు విడిచారు.


