భారం పెరుగుతుంది
బస్తాపై రూ.30 పెరిగింది
అంతటా ఒకే ధర ఉంటుంది..
ఎరువుల రవాణా భారాన్ని ఎత్తేసిన ప్రభుత్వం
● రైతులకు భారంగా మారనున్న
ఎరువుల ధరలు
● ఇకపైన ప్రైవేట్ డీలర్ల చేతిలో
రసాయన ఎరువులు
కల్వకుర్తి టౌన్: గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రైతులకు ఎరువుల ఇబ్బంది లేకుండా ఆయా మండల కేంద్రాల్లో ఉన్న ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా ఎరువులు అందేవి. రైతులకు వేరే ప్రాంతానికి వెళ్లి ఎరువులను తెచ్చుకునే అవసరం లేకుండా అక్కడే రసాయన ఎరువులు కొనుగోలు చేసేవారు. ఇందుకు సంబంధించి మార్క్ ఫెడ్ ద్వారా ఎరువులను ఆయా ప్రాథమిక సహకార సంఘాలకు ప్రభుత్వమే రవాణా ఛార్జీ భరించి సరఫరా చేసేది. ప్రస్తుతం ఈ రవాణా చార్జీలను ఎత్తివేసి, ఆ చార్జీలను సంబంధిత పీఏసీఎస్‌లు భరించుకోవాలని జీవో ఆర్‌టీ నెంబర్ 391ను విడుదల చేసింది. సహకార సంఘాలకు అందించే ఎరువుల రవాణా భారాన్ని ఎత్తివేశామని, ఇందుకు సంబంధించిన జీవోను అన్ని సహకార సంఘాలకు పంపించి వెంటనే దీనిని అమలు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇకపై రవాణా భారం డబ్బులు కూడా రైతుపైనే పడనున్నాయి. ఇప్పటి నుంచి సహకార సంఘాలు బహిరంగ మార్కెట్లో అమ్మిన విధంగానే ఎరువులను అమ్మే అవకాశం ఉంది. ఈ విధంగా అయితే రైతుపై ఒక్కో బస్తాకు రూ.15 రవాణా చార్జీల భారం పడనుంది.
రవాణాకు పాడిన మంగళం
మార్క్‌ఫెడ్ నుంచి పీఏసీఎస్‌లకు ఎరువులను ఉచితంగా సరఫరా చేసే రవాణా ఖర్చులను ప్రభుత్వం తాజాగా ఉపసంహరించుకుంది. ఇకనుంచి ఆయా సహకార సంఘాలకు వచ్చే ఎరువుల లారీ రవాణా ఖర్చులను వారే భరించుకోవాల్సి ఉంటుంది. ఒక్క బస్తా యూరియా సహకార సంఘంలో రూ.266లకు లభిస్తే, ప్రైవేట్‌లో రూ.300 వరకు అమ్మేది. తాజాగా మార్క్‌ఫెడ్ ఏర్పాటు చేసిన ర్యాకుల వద్దకు లారీలను మాట్లాడుకుని, ఎరువులు తెచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది. లారీల యజమానులు కిరాయిలు పెంచే అవకాశం ఉండటంతో ఎరువుల విక్రయాల నుంచి సహకార సంఘాలు తప్పుకునే ఆలోచనలు చేస్తున్నాయి.
మార్క్‌ఫెడ్ ద్వారా ఉచిత రవాణా
మార్క్‌ఫెడ్ ద్వారా జిల్లాలోని 17 సహకార సంఘాలకు రసాయన ఎరువులు అందేవి. రైల్వే వ్యాగన్లు లేకుంటే గోదాముల్లో నిల్వచేసిన ఎరువులను ఆయా సంఘాలకు రైతుల అవసరాన్ని బట్టి సరఫరా చేసేది. ఇదే సంస్థకు చెందిన లారీల్లో హమాలీలతో ఎరువుల బస్టాండ్ లోడ్ చేయించి పంపించేది. ఈ ప్రక్రియలో లారీలు, హమాలీల ఖర్చులను మార్క్‌ఫెడ్ భరించేది. దీంతో ఆయా సహకార సంఘాలు హమాలీల ఖర్చు, సంఘానికి కొద్దిపాటి లాభాన్ని చూసుకుని, బయట వ్యాపారుల కంటే తక్కువ రేటుకు రైతులకు ఎరువులు అందించేవారు. సహకార సంఘంలో రైతులకు అందించే ఒక్కో ఎరువు బస్తా అసలు ధర రూ.252 కాగా, హమాలీ ఖర్చు రూ.6.5, మామూలు కింద రూ.2, ఆయా సంఘాల లాభం కింద రూ.5 ఇలా బస్తాకు రూ.266–268 వరకు అమ్మేవారు. జిల్లాలో ప్రధానంగా ఉన్న సహకార సంఘాలకు, మండల కేంద్రానికి కొద్ది దూరంలో ఉండే సహకార సంఘాలకు రవాణా చార్జీల్లో వ్యత్యాసం వచ్చి బస్తా ధర మరింత ఎక్కువగా అవుతుంది.
పీఏసీఎస్‌ల ద్వారా అందించే ఎరువులకు సంబంధించి ధరలు పెరుగుతాయని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం రాయితీతో అందించే రవాణా చార్జీలను సంఘాలే భరించాలని చెప్పడంతో ఎరువుల ధరలు పెరిగే అవకాశం ఉంది. సంఘాల్లోనూ ఇలా రేట్లు పెరిగితే ప్రైవేటు మార్కెట్‌లో ఎరువుల ధరలు మరింతగా పెరిగి రైతులకు భారం కానుంది.
– దస్రునాయక్, రైతు, సారబండతండా,
చారకొండ మండలం
రసాయన ఎరువుల ధరను శుక్రవారం నుంచే బస్తాపై రూ.30 వరకు పెంచారు. ధరలు ఎందుకు పెంచారని అధికారులను అడిగితే, ట్రాన్స్‌పోర్టు చార్జీలు పెరిగాయని అందుకే ధరలు పెరిగాయని చెబుతున్నారు. ఒక్కో బ్యాగుపై ఇంతగా ధరలు పెరిగితే రైతులకు ఇబ్బందులు తప్పవు.
– భీమయ్య గౌడ్, రైతు,
చెర్కూర్, వెల్దండ మండలం
అన్ని సహాకార సంఘాల్లో ఒకే రేటు ఉండేలా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ట్రాన్స్‌పోర్టు చార్జీలు లేకపోవటం వల్ల ఒక్కో దగ్గర ఒక్కో రేటకు ఎరువులను విక్రయిస్తున్నారు. రైతులు ఎక్కడ తక్కువగా దొరికితే అక్కడ కొనుగోలు చేసేవారు. ఇకపై రైతులకు ఇబ్బంది లేకుండా యూనిఫామ్ ధరకు ఎరువులు లభించేలా చూస్తున్నాము.
– తహాసీన్, ఎండీ, మార్క్‌ఫెడ్


