అలంపూర్: వానకాలం పంట సాగులో కంది లాభసాటిగా ఉంటుంది. కంది జూన్, జూలై, ఆగస్టు మాసాల్లో పంట సాగు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావం వల్ల వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో కంది సాగు పెరగడానికి అవకాశం ఉంటుందని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. వాతావరణ ప్రతికూల పరిస్థితుల్లో తట్టుకునే విధంగా ప్రభుత్వం సైతం కంది పంట సాగును ప్రోత్సహిస్తున్నారు.
మిశ్రమ పంటగా..
వేరుశనగ, పెసర, సజ్జ, మొక్కజొన్న, పత్తి, అముదం పైర్లలో కంది పంటను మిశ్రమ పంటగా సాగు చేసుకోవచ్చు. ఇది రైతుకు ఎంతో అనుకూలం. ఏడాది పాటు కంది రైతుకు గిట్టుబాటు ధర లభించడానికి అవకాశం ఉంటుంది. పెట్టుబడి తక్కువ ఆదాయం ఎక్కువగా ఉంటుంది.
విత్తన రకాలు: కందిలో మధ్య కాలిక, స్వల్పకాలిక రకాలు ఉన్నాయి. సీఓ–9, భీమా జీఆర్‌జీ –152, డబ్ల్యూఆర్‌జీఈ–93, డబ్ల్యూర్‌జీఈ–121 రకాలు అందుబాటులో ఉన్నాయి. వీటితోపాటు టీడీఆర్‌జీ–59, ఎల్‌ఆర్‌జీ–133–33, డబ్లూఆర్‌జీ–255, ఎల్‌ఆర్‌జీ–52, పీఆర్‌జీ–176, ఆశ(ఐసీపీఎల్–87119) రకాలు అందుబాటులో ఉన్నాయి.
నేలలు విత్తన మోతాదు..
అన్ని రకాల నేలలు అనుకూలం. చౌడు నేలలు నీరు పీల్చే పొలాలు అనుకూలం కాదు. పొలాన్ని భాగ రెండు లేదా మూడు సార్లు దున్ని మెత్తగా తయారుచేయాలి. మధ్య కాలిక రకాలు హెక్టారుకు 5 నుంచి 10 కిలోలు, స్వల్ప కాలిక రకాలు 15 నుంచి 18 కిలోలు అవసరం అవుతాయి. నాగలి సాళ్లలో కాని, గొర్రుతో గాని విత్తుకోవాలి. మధ్య కాలిక రకాలకు వరుసకు వరుసకు మధ్య దూరం 150 నుంచి 240 సెంటీమీటర్లు ఉండాలి. మొక్కకు మొక్కకు మధ్య దూరం 20 సెంటిమీటర్లు ఉండాలి. ఆగస్టు 15 వరకు ఖరీఫ్ సీజన్‌లో పంట సాగు చేసుకోవచ్చు.
విత్తన శుద్ధి, కలుపు మందులు
కిలో విత్తనానికి మూడు గ్రాముల మ్యాంకోజెట్ కలిపి విత్తన శుద్ధి చేయాలి. రైజోబియం కల్చర్‌ను కూడా పట్టించాలి. విత్తన శుద్ధి ద్వారా భూమి, విత్తనం ద్వార సంక్రమించే కొన్ని తెగుళ్లను నివారించుకోవచ్చు. విత్తనం వేసిన వెంటనే పెండి మిథలిన్ హెక్టారుకు 3.25 నుంచి 3.75 లీటర్ల వరకు పిచికారీ చేయాలి. 20 నుంచి 25 రోజుల తర్వాత ఇనుజాతాఫైర్ 750 ఎంఎల్ హెక్టారుక వాడాలి. 60 రోజుల వరకు పైరులో కలుపు సమస్య లేకుండా చూడాలి.
ఎరువుల వాడకం..
హెక్టారుకు ఆఖరి దుక్కిలో 20 కిలోల నత్రజని, 50 కిలోల భాస్వరం నిచ్చే ఎరువులను వాడాలి. పైపాటుగా ఎరువులను వేయాల్సిన అవసరం లేదు.
నీరు పెట్టడం..
పూత దశలో, కాయ ఏర్పడే దశలో కంది పంట నీటి ఎద్దడికి గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పూత, పిందె దశలోను తగిన స్థాయిలో నీరు పెట్టాలి. వ్యవసాయ శాఖ అధికారుల సూచన మేరకు కందిలో సస్యరక్షణ చేపట్టాలి.
పాడి–పంట


