అంగన్‌వాడీలో నకిలీ బాగోతం | - | Sakshi
Sakshi News home page

అంగన్‌వాడీలో నకిలీ బాగోతం

Aug 5 2026 2:05 AM | Updated on Aug 5 2026 2:05 AM

9 ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్న

నకిలీ టీచర్‌

అసలు టీచర్‌ విధులకు డుమ్మా

విషయం వైరల్‌ కావడంతో

సీడీపీఓ విచారణ

జడ్చర్ల టౌన్‌: జడ్చర్ల మున్సిపాలిటీలోని నాగసాల అంగన్‌వాడీ కేంద్రంలో విధులు నిర్వహించాల్సిన టీచర్‌ స్థానంలో డూప్లికేట్‌ టీచర్‌ విధులు నిర్వహిస్తున్నారు. 9ఏళ్లుగా తంతు కొనసాగుతున్నా.. ఐసీడీఎస్‌ అధికారులు గుర్తించకపోగా.. సమర్ధించటం చర్చనీయాంశంగా మారింది. మంగళవారం విషయం వెలుగులోకి రావడంతో స్పందించిన సీడీపీఓ ఘటనపై విచారణ చేపట్టారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా..

నాగసాల అంగన్‌వాడీ టీచర్‌గా జ్యోతిలక్ష్మి నియమితులైంది. తొలిరోజుల్లో విధులు పర్వాలేదనిపించినా 9ఏళ్లుగా లావణ్య అనే మరో మహిళతో విధులు చేయిస్తుంది. నెలకు రూ.6వేలు ఇచ్చి తనస్థానంలో మరో మహిళతో పనులు చేయిస్తుంది. మొదట్లో ఆయా లేదని సాకుగా.. చెబుతూ లావణ్యతో విధులు చేయించగా.. ఆయా నియమితులైన తరువాత కూడా ఒరిజినల్‌ టీచర్‌ విధులకు రాకుండా డూప్లికేట్‌తోనే కేంద్రం రన్‌ చేస్తుంది. తన స్థానంలో మరొకరిని నియమించి 20మంది చిన్నా రుల జీవితంపై చెలగాటమాడుతుంది. ఈ విష యంలో ఎవరైనా ప్రశ్నిస్తే తాను పూర్తిగా తప్పుకుని లావణ్యను టీచర్‌గా పెట్టిస్తానంటూ సమాధానం దాటవేసేది. దీంతో పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. అయితే 9ఏళ్లుగా డూప్లికేట్‌ టీచర్‌ విధులు నిర్వహిస్తున్నప్పటికీ ఐసీడీఎస్‌ అధికారులు, సీడీపీఓ, సూపర్‌వైజర్‌ గుర్తించకపోటం నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తుంది. ఇదే విషయమై ఇటీవల కొందరు సీడీపీఓకు లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ విచారణ చేయకపోవడం విస్మయం కలిగిస్తుంది. మంగళవారం విషయం మీడియాకు లీక్‌ కావడంతో సీడీపీఓ శోభారాణిని వివరణ కోరగా.. ఫిర్యాదు అందింది వాస్తవమేనని అంగీకరించారు. బుధవారం విచారణ చేస్తామని బదులిచ్చా రు. అప్పటికే సామాజిక మాధ్యమాల్లో విషయం వైరల్‌ కావడంతో వెంటనే నాగసాల అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్లి విచారణ చేపట్టారు. విచారణలో అనేక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తుంది. గ్రామంలో గర్భిణులు, బాలింతలు లావణ్య విధులు నిర్వహిస్తున్న విషయాన్ని చెబుతూనే ఒరిజినల్‌ టీచర్‌ కూడా అప్పుడప్పుడు వస్తారని బదులిచ్చినట్లు తెలిసింది. అంగన్‌వాడీ కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న లావణ్యను వివరణ కోరగా 9ఏళ్లుగా పనిచేస్తున్నానని, టీచర్‌ నెలకు రూ.6వేలు ఇస్తున్నారని వెల్లడించారు. ఒరిజినల్‌ టీచర్‌ జ్యోతిలక్ష్మిని వివరణ కోరగా.. ఇదేం పెద్ద తప్పని, తనకు నెలకు డబ్బులిస్తున్నానని బదులివ్వటం గమనార్హం. తాను సర్‌ ప్రక్రిలో బిజీగా ఉన్నానని చెప్పటం కొసమెరుపు. ఒక ప్రభుత్వ ఉద్యోగి తనస్థానంలో మరొకరిని పెట్టి విధులు చేయించిన ఘటనపై పూర్తి విచారణ చేసి డూప్లికేట్‌ టీచర్‌ను నియమించాలని గ్రామస్తులు కొందరు కోరుతున్నారు. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లానని చర్యలు తప్పవని సీడీపీఓ శోభారాణి తెలిపారు.

అసలు టీచర్‌

నకిలీ టీచర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement