జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): జిల్లాలో గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలు, మండల పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలు, జిల్లా పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలు నాణ్యతతో రూపొందించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ ఖుష్బూగుప్తా అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన ఆటోమేటిక్ స్కోరింగ్, గ్రేడింగ్ విధానంలో జిల్లాకు ఉత్తమ ఫలితాలు సాధించేలా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అన్ని శాఖల జిల్లా అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడుతూ పంచాయతీరాజ్ కమిషనర్ ఆదేశాల మేరకు పీపుల్స్ ప్లాన్ క్యాంపెయిన్–2026ను సమర్థవంతంగా అమలు చేయాల్సిన బాధ్యత ప్రతి శాఖపై ఉందన్నారు. గ్రామాభివృద్ధి ప్రణాళికలు 16వ ఆర్థిక సంఘం నిధులు, రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు, గ్రామ పంచాయతీల సొంత ఆదాయ వనరులు, అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వివిధ పథకాల సమన్వయంతో రూపొందించాలని తెలిపారు. ఈ ప్రణాళికల్లో ప్రజాప్రతినిధులు, అన్ని శాఖల అధికారులు, స్వయం సహాయక సంఘాలు, కమ్యూనిటీ ఆర్గనైజర్లు తదితర భాగస్వాములందరూ చురుకుగా పాల్గొనాలని కోరారు. సంబంధిత శాఖల అధికారులు గ్రామసభలు, మండలసభల్లో తప్పనిసరిగా పాల్గొని నాణ్యమైన ప్రణాళికల రూపకల్పనకు సహకరించాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు మధుసూదన్ నాయక్, హరిప్రియ, అసిస్టెంట్ ట్రెయినీ కలెక్టర్ సాయి శివాని, డీఆర్‌ఓ నిర్మల, భూసేకరణ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ రామ్‌రెడ్డి, జెడ్పీ సీఈఓ వెంకట్‌రెడ్డి, డీఆర్‌డీఓ నర్సింహులు, తదితరులు పాల్గొన్నారు.
తల్లిపాలు శిశువుకు ప్రకృతి ఆహారం
తల్లిపాలు శిశువుకు ప్రకృతి ప్రసాదించిన సంపూర్ణ అహారమని కలెక్టర్ ఖుష్బూగుప్తా అన్నారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా కలెక్టరేట్‌లో తల్లిపాల ప్రాముఖ్యతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ రూపొందించిన ప్రచార పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ ఏడాది ప్రపంచ తల్లిపాల వారోత్సవాల థీమ్ ‘‘తల్లిపాలకు ప్రాధాన్యత ఇద్దాం – సుస్థిరమైన సహాయ వ్యవస్థలను ఏర్పాటు చేద్దాం’’ సందేశాన్ని ప్రజల్లో విస్తృతంగా చేర్చేందుకు జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి శ్రీమతి జరీనా బేగం, తదితరులు పాల్గొన్నారు.


