● 10తో ముగియనున్న ఎస్‌ఐఆర్‌మొదటి దశ
● జిల్లాలో గత ఓటరు జాబితా ప్రకారం 99,132 ఓట్ల తొలగింపు?
మహబూబ్‌నగర్ న్యూటౌ: కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఎస్‌ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్)–2026 ఎన్యూమరేషన్ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. జూన్ 25న ప్రారంభమైన ఈ కార్యక్రమంలో ఎన్యూమరేషన్ ఫారాలను ఇంటింటికి అందజేసి.. పూర్తి చేసిన ఫారాలను ఓటర్ల నుంచి తీసుకొని మ్యాపింగ్ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఈ ప్రక్రియ ఈ నెల 10వ తేదీతో ముంగియనుండటంతో బూత్ లెవల్ అధికారులు జల్లెడ పడుతున్నారు. జిల్లాలో మూడు నియోజకవర్గాల పరిధిలో గతంలో మొత్తం 7,32,488 మంది ఓటర్లు ఉన్నారు. ఎస్‌ఐఆర్–2026లో భాగంగా వీరందరికీ ఎన్యూమరేషన్ ఫారాలను ఇంటింటికి బీఎల్‌ఓల ద్వారా అందజేశారు. బీఎల్‌ఓలు ఇంటింటికి వెళ్లి వాటిని తిరిగి సేకరించి మ్యాపింగ్ చేస్తున్నారు. బీఎల్‌ఓ యాప్ ద్వారా 6,29,846 మంది ఓటర్ల వివరాలను పరిశీలించి అనుమతించారు. చనిపోయిన వారి వివరాలు, డబుల్ ఓటర్ల వివరాలతో పాటు అడ్రస్ మారిన వారు, అందుబాటులో లేని ఓటర్ల వివరాలు బీఎల్‌ఓల దృష్టికి వచ్చాయి. వీటితో పాటు ఈ నెల 3వ తేదీ నాటికి గుర్తించలేని ఓటర్లు 804 మంది ఉన్నారు. ఈ నెల 10వ తేదీ వరకు అవకాశముండటంతో జల్లెడ పడుతూ ఓటర్ల వివరాలను సేకరించి మ్యాపింగ్ చేసే పనిలో నిమగ్నమయ్యారు. గత జాబితాలో నమోదై ఉన్న ఓటర్లలో 99,132 మందిని జాబితా నుంచి తొలగించే అవకాశాలున్నాయి. ఈ నెల 10న పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్ చేపట్టిన అనంతరం 17న డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాను విడుదల చేస్తారు.


