సాక్షి, బళ్లారి: ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో తీవ్ర వర్షాభావం నెలకొంది. వర్షాధారిత భూముల్లో సాగు చేసిన పంటలు ఎండిపోయాయి. రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి నాగేంద్ర స్పష్టం చేశారు. శుక్రవారం సండూరు నియోజకవర్గంలోని విఠలాపురం, దరోజి తదితర గ్రామాల్లో పర్యటించారు. అధికారులు, ఎమ్మెల్యేలతో కలసి క్షేత్రస్థాయిలో తిరుగుతూ ఎండిపోయిన పంటలను పరిశీలించారు. ఆయా గ్రామాల్లో రైతులు పెద్ద సంఖ్యలో చేరి సమస్యలు చెప్పుకున్నారు. పంటలు పూర్తిగా ఎండిపోయాయి అని.. ప్రస్తుతం వర్షం వచ్చినా ఎలాంటి ప్రయోజనం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతాంగానికి సహాయం చేయాలని వేడుకున్నారు. అనంతరం మంత్రి నాగేంద్ర మాట్లాడుతూ.. సీఎం డీకే శివకుమార్ ఆదేశాల మేరకు పంట నష్టాన్ని అంచనా వేసి, రైతులకు సాయం చేసేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి పూర్తి వివరాలు అందించాలని తెలిపారు. ఈ ఏడాది జిల్లాలో 37 వేల మంది రైతులు పంటలు బీమా చేయించుకున్నారని గుర్తు చేశారు. ఉపాధి హామీ పథకం కింద పని దినాలు పెంచుతామని పేర్కొన్నారు. ఆయకట్టు రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. కచ్చితంగా పంటలకు నీరు వదులుతామన్నారు. పశుగ్రాసం కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మహార్షి వాల్మీకి విగ్రహావిష్కరణ అంశంపై సీఎంతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే అన్నపూర్ణ, జిల్లా అధికారి నాగేంద్ర ప్రసాద్, రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
మంత్రి నాగేంద్ర


