బనశంకరి: రాష్ట్ర రాజకీయాల్లో తీవ్రవివాదానికి కారణమైన బిడది టౌన్‌షిప్ పథకానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు బీజేపీ, జేడీఎస్‌లు పోరాటానికి నాంది పలికాయి. బిడదిలో టౌన్‌షిప్ నిర్మాణానికి ఒప్పుకునేది లేదని ప్రకటించాయి. ఆదివారం బిడదిలోని బైరమంగల నుంచి బెంగళూరు ఫ్రీడం పార్కు వరకు 3 రోజుల జేడీఎస్–బీజేపీ పాదయాత్రకు కేంద్రమంత్రి హెచ్‌డీ.కుమారస్వామి, బీజేపీ పక్షనేత ఆర్.అశోక్ నాంది పలికారు. కుమారస్వామి మాట్లాడుతూ... బిడది టౌన్‌షిప్ పథకానికి తాను సీఎంగా ఉన్నప్పుడే ఆమోదం తెలిపామని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతోంది. కానీ తాను ఆమోదం ఇవ్వలేదని ఆయన చెప్పారు. ఈ ప్రాంత రైతులు, మహిళలు గత 516 రోజుల నుంచి నిరంతర ఆందోళనలు చేస్తున్నారన్నారు. సారవంతమైన, పచ్చని పంట భూమిలో టౌన్‌షిప్ కట్టరాదని డిమాండ్ చశారు. ఆర్.అశోక్ మాట్లాడుతూ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని, తాము అంగీకరించబోమని చెప్పారు. శాసనసభ లోపల, బయట తీవ్ర పోరాటం చేస్తామన్నారు. జేడీయస్ యువజన అధ్యక్షుడు నిఖిల్ మాట్లాడుతూ బిడది టౌన్‌షిప్‌తో రైతులకు మరణ శాసనం రాస్తోందన్నారు. కాగా, వందలాది మంది పాదయాత్రలో పాల్గొన్నారు. 11వ తేదీ మధ్యాహ్నానికి ఫ్రీడంపార్కుకు చేరుకుని భారీ సభ నిర్వహిస్తారు.
బిడదిని ప్రపంచ ఏఐ
సిటీ చేస్తాం: సీఎం
బనశంకరి: ‘చాలా ఏళ్లుగా పక్కనపెట్టిన బిడది టౌన్‌షిప్ పథకాన్ని మళ్లీ ప్రారంభించి, ప్రపంచస్థాయి రోడ్లు, మెట్రో రైలు వసతి, క్రీడామైదానాలు, పార్కులు, ఆధునిక సౌకర్యాలతో కూడిన ఏఐ సిటీగా అభివృద్ధి చేస్తాం అని సీఎం డీకే శివకుమార్ చెప్పారు. ప్రతిపక్షాల యాత్ర నేపథ్యంలో ఆయన ఆదివారం ఎక్స్‌లో ఈ పోస్టు చేశారు. గ్రేటర్ బెంగళూరు కింద చేపట్టే బృహత్ పథకంతో బెంగళూరు దక్షిణ జిల్లా రూపురేఖలు మారిపోతాయన్నారు. రైతుల క్షేమానికి పెద్దపీట వేశామన్నారు. బిడదిలో గత ప్రభుత్వం ఎకరాకు రూ.25 లక్షలు నిర్ణయించగా, తమ సర్కారు ఎకరాకు రూ.3 కోట్లకు పైగా పరిహారం అందిస్తుందన్నారు. డబ్బుకు బదులు భూమి ఇష్టపడే రైతులకు 50 శాతం అభివృద్ధి చేసిన స్థలం ఇస్తామని, భూములు ఇవ్వడం ఇష్టం లేని రైతులపై ఎలాంటి ఒత్తిడీ లేదన్నారు. యువతకు అపారమైన ఉద్యోగ అవకాశాలు, అన్నదాతలకు గౌరవ జీవనానికి కట్టుబడి ఉన్నామన్నారు.
రైతుల పొట్టకొట్టొద్దు
కేంద్రమంత్రి కుమారస్వామి
బెంగళూరుకు ప్రతిపక్షాల పాదయాత్ర


