చిక్కబళ్లాపురం: విశ్వ తల్లి పాల వారోత్సవాల సందర్భంగా ప్రజల్లో జాగృతి కోసం బెంగళూరు హెబ్బాళ నుంచి ముద్దేనహళ్లి మధుసూదన్‌సాయి వైద్య సంస్థ వరకు బైక్ ర్యాలీ సాగింది. రోటరీ క్లబ్ సభ్యులు, వైద్యులు, పౌరులు ఇందులో పాల్గొన్నారు. తల్లి పాలు శిశువు అత్యుత్తమ పెరుగుదలకు ఉపయుక్తమని తెలిపారు. నెలల తక్కువ బిడ్డలు, రోగగ్రస్త శిశువులకు తల్లి పాలే ఔషధమన్నారు. తల్లుల నుంచి పాలను సేకరించి పాలు లేని శిశువులకు అందజేసే విధానం పెంపొందాలన్నారు. బెంగళూరులోని ఆస్పత్రుల్లో నవజాత శిశువులకు 25 లీటర్ల తల్లి పాలను సేకరించి అందజేసినట్లు వైద్యులు తెలిపారు. పాలు దానం చేసిన మహిళలను సన్మానించారు.
పరామర్శకు వచ్చిన మహిళ అరెస్టు
శివమొగ్గ: సెంట్రల్ జైలులో విచారణ ఖైదీని కలిసి గంజాయిని ఇవ్వడానికి ప్రయత్నించిన మహిళ, మరొకరు అదే జైలు అతిథులయ్యారు. రుక్సర్ బాను, నాసిర్ ఖురేషి 5న విచారణ ఖైదీ అబ్దుల్ మునాఫ్‌ను కలవడానికి బైక్‌లో జైలుకు వచ్చారు. వారిని జైలు సిబ్బంది సాధారణ తనిఖీలు చేశారు. రుక్సర్ జీన్స్ బెల్టులో టేప్ ఉపయోగించి గంజాయి, పొగాకు వంటి నిషేధిత వస్తువులను దాచుకున్నట్లు గుర్తించారు. వెంటనే గంజాయి, పొగాకుగా భావిస్తున్న పదార్థాలు, జీన్స్, ఒక అంగీ, రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. జైలు అధికారి రంగనాథ్ ఫిర్యాదు మేరకు తుంగ నగర పోలీసులు అరెస్టు చేశారు.
బిడది వద్ద కేరళ బస్సు పల్టీ
● ఇద్దరు మృతి, 25 మందికి గాయాలు
మైసూరు: బెంగళూరు నుంచి కోజికోడ్‌కు వెళ్తున్న కేరళ ఆర్టీసీ బస్సు రామనగర వద్ద మైసూరు ఎక్స్‌ప్రెస్ వేలో పల్టీలు కొట్టింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు ప్రయాణికులు చనిపోగా, పెద్దసంఖ్యలో గాయాల పాలయ్యారు. వారిలో కొందరికి తీవ్ర గాయాలు తగిలాయి. శనివారం సాయంత్రం 7 గంటల సమయంలో అరవెగెరె గేట్ అనే చోట బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న పెద్ద సైన్‌బోర్డును ఢీకొని బోల్తా పడింది. అఖిలేష్, అరుణ్ అనే ఇద్దరు దుర్మరణం చెందగా, 25 మందికి పైగా గాయపడ్డారు. బిడది పోలీసులు, స్థానికులు కలిసి క్షతగాత్రులకు రక్షించి రామనగర, బెంగళూరు ఆస్పత్రులకు తరలించారు. బస్సు అడ్డంగా పడిపోవడంతో గంటల కొద్దీ ట్రాఫిక్‌కు అంతరాయ ఏర్పడింది.
రౌడీల గొడవలో
పోలీసుకు గాయాలు
బనశంకరి: ఉత్తర కన్నడ జిల్లా భట్కళ తాలూకా మురుడేశ్వరలో శనివారం అర్ధరాత్రి రౌడీ ముఠాల మధ్య కొట్లాటలు జరగ్గా, అడ్డుకోబోయిన పోలీసులపై చాకుతో దాడి చేశారు. రౌడీషీటర్ రాజు, మనోజ్ వర్గాల మధ్య గొడవ జరుగుతోందని ప్రజలు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు వచ్చి గొడవను విడిపించడానికి ప్రయత్నించారు. రౌడీలు ఓ పోలీసుపై కత్తితో పొడవడంతో గాయాలై ఆస్పత్రిలో చేరాడు. ఈ ఘటనలో రాజు, రితిక్, మదన్‌నాయక్, యోగేశ్, దర్శన్ అనేవారిపై కేసు నమోదు చేశారు. నిందితులు పరారీలో ఉన్నారు.


