శివమొగ్గ: శివమొగ్గ నగరంలో ఫుట్‌పాత్ ఆక్రమణల తొలగింపు ఆపరేషన్ ఆరంభమైంది. సోమవారం ఉదయం ట్రాఫిక్ పోలీసులు మున్సిపల్ కార్పొరేషన్ సహకారంతో కువెంపు రోడ్డులో పెట్టంగళ్లు, బండ్లు తదితరాలను జేసీబీలతో తొలగించారు. ప్రవాసి మందిర్ సర్కిల్ సమీపం నుంచి శివమూర్తి సర్కిల్ వరకు కువెంపు రోడ్డుపై వాహనాల రద్దీ పెరిగింది. స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ కింద రోడ్ల పనులు చేపట్టిన తర్వాత ట్రాఫిక్ సమస్య మరింత అధికమైంది. వ్యాపారాలతో పాటు వాహనాల పార్కింగ్ వల్ల సమస్యగా ఉంది. ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ దేవరాజ్, ఎస్‌ఐ స్వప్న, కార్పొరేషన్ అధికారులు తొలగింపులో పాల్గొన్నారు.
షేర్ మార్కెట్ పేరుతో రూ.15 లక్షల మస్కా
మైసూరు: మీ డబ్బును రెట్టింపు చేస్తామని ఆశ చూపి ఒక వ్యక్తి నుంచి రూ.15.29 లక్షలకు స్వాహా చేసిన ఘటన నగరంలో జరిగింది. మైసూరులోని సిద్ధార్థ బారంగే నివాసి ఒకరు ఫేస్‌బుక్‌లో స్టాక్ మార్కెట్ ప్రకటనను చూశారు. అందులోని నంబరుకు ఫోన్ చేయగా, మోసగాళ్లు అతనికి స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి గురించి చెప్పారు. ఎంత పెట్టుబడి పెడితే డబ్బు రెట్టింపు అవుతుందని చెప్పి వారు అతన్ని ఆశ చూపారు. వారి మాటలు నమ్మిన ఆ వ్యక్తి, క్రమంగా వివిధ ఖాతాలలో రూ. 15,29,894 జమ చేశాడు. డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరగా మోసగాళ్లు నంబరును బ్లాక్ చేశారు. దీంతో బాధితుడు సైబర్ ఠాణాలో ఫిర్యాదు చేశాడు.
ప్రైవేటు బస్సు బోల్తా
● ఒకరు మృతి
దొడ్డబళ్లాపురం: గోవా నుంచి బెంగళూరుకు వస్తున్న ప్రైవేటు బస్సు బోల్తా పడగా ఓ ప్రయాణికుడు మృత్యువాత పడ్డారు. హావేరి పట్టణ శివారులోని 48వ జాతీయ రహదారిలో సోమవారం ఉదయం జరిగింది. డ్రైవర్ నిద్రమత్తు, అతి వేగం వల్ల పల్టీ పడగా, బస్సులో ఉన్న 20మందికి పైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. బావర్‌సింగ్ రాజ్‌పుత్ (18) అనే యువకుడు అక్కడే మృతి చెందాడు. పోలీసులు చేరుకుని క్షతగాత్రులను హావేరి జిల్లా ఆస్పత్రికి తరలించారు. బస్సును క్రేన్ సాయంతో తొలగించి వాహనాల రాకపోకలకు అవకాశం కల్పించారు.
ప్రదోష్ అప్రూవర్‌కు
కోర్టు ఆమోదం
బనశంకరి: చిత్రదుర్గ రేణుకాస్వామి హత్య కేసులో 14వ నిందితుడు ప్రదోష్‌ను సాక్షిగా పరిగణించడానికి బెంగళూరు 59వ సీసీహెచ్ సెషన్స్ కోర్టు సమ్మతించింది. దీంతో దర్శన్‌కు తీవ్రమైన ఎదురుదెబ్బ తగిలినట్లయింది. దర్శన్ తరఫు న్యాయవాదుల సుదీర్ఘ వాదనలను జడ్జి సుజాతా సాంబ్రాణి తోసిపుచ్చి ప్రదోష్ అప్రూవర్ పిటిషన్‌ను ఆమోదించారు. హత్య జరిగిన రోజు ఏం జరిగిందో పూర్తిగా వివరిస్తానని ప్రదోష్ తెలిపాడు. తన మాట వినకుండా దర్శన్ దాడి చేశాడని, రేణుకాస్వామిని చెప్పుతో కొట్టాలని పవిత్రాగౌడ ఒత్తిడి చేసిందన్నారు. ప్రదోష్.. దర్శన్ నుంచి రూ.30 లక్షలు డబ్బు తీసుకుని నకిలీ నిందితులను సృష్టించడానికి ప్రయత్నించాడని, ఘటనాస్థలికి అతడే పవిత్రగౌడను తీసుకువచ్చాడని, హత్యలో పాల్గొన్నాడని అభియోగాలున్నాయి.
పేగుబంధాన్నే చిదిమేసింది
● బీదర్ జిల్లాలో కిరాతక తల్లి
దొడ్డబళ్లాపురం: కన్నకొడుకును తల్లి హత్య చేసిన కిరాతక సంఘటన బీదర్ జిల్లా ఔరాద్ తాలూకా వడగాంవ్ గ్రామంలో వెలుగు చూసింది. ఈ దారుణంలో ఆమెకు తల్లిదండ్రులు, సోదరుడు సహకరించడం గమనార్హం. నిందితురాలు వాణిశ్రీకి మహారాష్ట్ర దేగులూరు తాలూకా కవళగడ్డ గ్రామానికి చెందిన సంజుతో వివాహం జరిగింది. తెలంగాణ నిజామాబాద్‌లో కూలిపనులు చేసుకుంటూ నివసించేవారు. ఇటీవల వాణిశ్రీ కాన్పు కోసం పుట్టింటికి వచ్చింది. 50 రోజుల క్రితం మగబిడ్డ పుట్టగా ఓంకార్ అని పేరు పెట్టారు. రెండురోజుల కిందట వాణిశ్రీ, భర్తకు కాల్ చేసి పిల్లాడు చనిపోయినట్లు చెప్పడంతో అనుమానంతో పరుగున వచ్చాడు. పోలీసులకు ఫిర్యాదు చేయగా నలుగురినీ అరెస్టు చేసి విచారించగా తామే హత్య చేసినట్టు ఒప్పుకున్నారు. ఎందుకు హత్య చేశారనే స్పష్టత రావాల్సి ఉంది. క్షుద్ర పూజల కోసం చంపి ఉంటారనే అనుమానాలున్నాయి.


