హొసపేటె: దేవప్రయాగ్‌లో పవిత్రమైన తపస్సును పూర్తి చేసి బుధవారం సాయంత్రం మఠానికి విచ్చేసిన కొట్టూరు స్వామి సంస్థాన మఠానికి చెందిన జగద్గురువులు కొట్టూరు బసవ లింగ మహాస్వామికి భక్తులు, వీరశైవ సమాజ బాంధవులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయనను మఠానికి తీసుకెళ్లారు. నగరంలోని పేటె బసవేశ్వర ఆలయం నుంచి కొట్టూరు స్వామి సంస్థాన మఠం వరకు ఊరేగింపుగా తోడ్కొని వెళ్లారు. ఊరేగింపులో ముత్తైదు మహిళలు, వివిధ కళా, సంగీత బృందాలు పాల్గొన్నాయి. స్వాగత కార్యక్రమంలో వీరశైవ లింగాయత్ సమాజ నాయకులు జి.నీలకంఠప్ప, సాలి సిద్దయ్య స్వామి, అక్కన బళగ సభ్యులు స్వామి, గంగాధరప్ప, కే.కొట్రేష్, కోరిశెట్టి లింగప్ప, ఎల్.బసవరాజు, బి.చిత్తప్ప, కిచిడి కొట్రేష్, ఎం.ధర్మనగౌడ, వివిధ యూనిట్ల పదాధికారులు, శ్రీమఠం భక్తులు, సంఘ సభ్యులు పాల్గొన్నారు.


